CBSE : తెలంగాణలో అతిపెద్ద ఎగ్జామ్ స్కామ్.. !

2019లో ఏం జరిగిందో  గుర్తుందా?   తెలంగాణ ఇంటర్ విద్యార్థుల రక్తాన్ని తాగిన ఆ రాబందు గుర్తుందా?  3లక్షల 80వేల మందిని అన్యాయంగా ఫెయిల్ చేసి..  20 మందికి పైగా అమాయక విద్యార్థుల ప్రాణాలు బలిగొన్న అదే దుర్మార్గపు సంస్థ 'గ్లోబరేనా'!

New Update
scam

-Ravi Prakash 

ravi-prakash-2026-05-27-18-35-07

2019లో ఏం జరిగిందో  గుర్తుందా?  
తెలంగాణ ఇంటర్ విద్యార్థుల రక్తాన్ని తాగిన ఆ రాబందు గుర్తుందా? 
3లక్షల 80వేల మందిని అన్యాయంగా ఫెయిల్ చేసి.. 
20 మందికి పైగా అమాయక విద్యార్థుల ప్రాణాలు బలిగొన్న
అదే దుర్మార్గపు సంస్థ 'గ్లోబరేనా'!
ఆ పాపపు మరకలను కడుక్కోవడానికి 
రాత్రికి రాత్రే 'కోఎంప్ట్' అని పేరు మార్చుకుని 
బోర్డు తిప్పేసింది! 
తెలంగాణ బిడ్డల జీవితాలను బుగ్గిపాలు చేసిన 
ఆ నరరూప రాక్షస సంస్థకు.. 
అతిదారుణంగా CBSE మళ్లీ కాంట్రాక్ట్ కట్టబెట్టింది.

తెలంగాణలో అంతమంది విద్యార్థులు చనిపోతే.. 
ఆ శవాల మీద పైసలు ఏరుకున్న సంస్థకు 
మళ్లీ కోట్ల రూపాయల కాంట్రాక్టా? 
పేరు మార్చేస్తే చేసిన ఖూనీలు చెరిగిపోతాయా? 
ఇలాంటి క్రిమినల్ హిస్టరీ ఉన్న సంస్థలకు 
మళ్లీ దేశ భవిష్యత్తును ఎలా అప్పగిస్తారు? 
తెలంగాణ గడ్డ అడుగుతోంది..
దీనికి సమాధానం చెప్పే ముఖం ఎవరికైనా ఉందా?

ఇది ఏ పార్లమెంటరీ కమిటీ బయటపెట్టిన రహస్యం కాదు!
ఏ పెద్ద ఆడిట్ రిపోర్టులోనూ దొరికిన స్కామ్ కాదు!
దేశంలోనే అతిపెద్ద విద్యామండలి.. CBSE గుట్టు రట్టు చేసింది ఎవరో తెలుసా?
ఏదో ఒక పెద్ద ఇన్వెస్టిగేషన్ ఛానెల్లో కూర్చున్న సీనియర్ జర్నలిస్టులు కాదు..
ముగ్గురంటే ముగ్గురు టీనేజర్లు!
అవును.. జస్ట్ పద్దెనిమిదేళ్లు కూడా నిండని ముగ్గురు కుర్రాళ్లు అడిగిన ప్రశ్నలకి..
ఇప్పుడు ఢిల్లీ పీఠం కదులుతోంది!
లక్షల మంది విద్యార్థుల భవిష్యత్తును డిసైడ్ చేసే ఒక పెను వివాదం.. 
ఇప్పుడు దేశవ్యాప్తంగా సంచలనం రేపుతోంది!

అంతా డిజిటల్ చేసేస్తాం



ఆన్-స్క్రీన్ మార్కింగ్.. అంటే OSM!
పేపర్లు చేత్తో దిద్దడం పాత పద్ధతి.. 
అంతా డిజిటల్ చేసేస్తాం.. తప్పుల్లేకుండా రిజల్ట్స్ ఇస్తాం అంటూ 
రంగంలోకి తెచ్చిన మోడ్రన్ సిస్టమ్ ఇది!
థియరీ వినడానికి బాగానే ఉంది. 
కానీ, ప్రాక్టికల్స్‌లోకి వచ్చేసరికి సీన్ రివర్స్ అయింది!
మార్కుల్లో తేడాలు.. డేటా లీకులు.. 
ఇంటర్నెట్ సెక్యూరిటీలో లూప్‌హోల్స్!
వేదాంత్ శ్రీవాస్తవ అనే స్టూడెంట్.. 
ఈ మార్కింగ్ విధానంలో ఉన్న లోపాలను పక్కాగా ప్రశ్నించాడు.
నిసర్గ అధికారి అనే మరో కుర్రాడు.. 
ఏకంగా CBSE డేటా సెక్యూరిటీ సిస్టమ్‌కే కన్నం పడేలా ఉన్న
లూప్‌హోల్స్‌ని సోషల్ మీడియా వేదికగా బట్టబయలు చేశాడు!
లక్షల మంది విద్యార్థుల ప్రైవసీ.. 
గాల్లో దీపంగా మారిందా? అనే అనుమానాలు రేకెత్తించాడు!

కథ ఇక్కడితో అయిపోలేదు. 
అసలు ట్విస్ట్ ఇచ్చింది సార్థక్ సిద్ధాంత్ అనే క్లాస్ 12 స్టూడెంట్!
సమస్య వస్తే అందరూ కంప్లైంట్ చేస్తారు.. 
కానీ ఈ కుర్రాడు మాత్రం ‘రూట్ కాజ్’ వెతికాడు!
బ్యూరోక్రాట్లు కూడా చదవడానికి భయపడే వందల పేజీల 
సీబీఎస్ఈ టెండర్ డాక్యుమెంట్లను.. 
లైన్ బై లైన్, క్లాజ్ బై క్లాజ్ జల్లెడ పట్టాడు!
ఒక్క టెండర్ కాదు..
ఒకదాని తర్వాత ఒకటి మారిన 
మల్టిపుల్ టెండర్ వెర్షన్లని తిరగేసాడు.
అక్కడ బయటపడింది అసలు గుట్టు!
రూల్స్ మారాయా? 
లేక ఒకే ఒక్క కంపెనీ కోసం రూట్ మ్యాప్ మార్చారా?
ఒక్కొక్క క్లాజ్ మారుతూ ఉంటే.. 
ఒకే ఒక్క కంపెనీకి లాభం ఎలా చేకూరింది? 
ఇదే ఇప్పుడు మిలియన్ డాలర్ల ప్రశ్న!

ఇప్పుడు ఈ వివాదంలోకి ఎంట్రీ ఇచ్చింది ‘కోయంప్ట్ ఎడ్యుటెక్’.
సార్థక్ తన బ్లాగ్‌లో బయటపెట్టిన సంచలన నిజం ఏంటంటే.. 
ఈ కోయంప్ట్ కంపెనీ పాత పేరు ‘గ్లోబరీనా టెక్నాలజీస్’!
అవును.. ఇదే గ్లోబరీనా.. 2019లో 
తెలంగాణ ఇంటర్మీడియట్ ఫలితాల వివాదంలో 
కోర్టుల చుట్టూ, వివాదాల చుట్టూ తిరిగిన కంపెనీ!
ప్రభుత్వ కమిటీ సైతం తప్పులు ఎత్తి చూపిన హిస్టరీ ఉన్న సంస్థ.. 
పేరు మార్చుకుని CBSE రేసులోకి ఎలా వచ్చింది?
మొదటి టెండర్‌లో TCS లాంటి దిగ్గజాలు ఉన్నా..
ఆ టెండర్‌ను ఎందుకు రద్దు చేశారు?
రెండోసారి కొత్త టెండర్ తెచ్చి.. 
రూల్స్ అన్నిటినీ సవరించి.. 
ఈ కంపెనీకి రెడ్ కార్పెట్ పరిచారా?

సార్థక్ వెలికితీసిన ఆధారాలు చూస్తే 
ఎవరికైనా ఫ్యూజులు ఎగిరిపోవాల్సిందే!
‘పాత ట్రాక్ రికార్డ్, చెడ్డ పేరు ఉంటే డిస్క్వాలిఫై’ చేసే రూల్‌ను 
కొత్త టెండర్‌లో ఎందుకు మార్చారు?
‘గతంలో బ్లాక్‌లిస్ట్ అయిన కంపెనీలు పనికిరావు’ అనే నిబంధనను మార్చి..
‘ప్రస్తుతం బ్లాక్‌లిస్ట్‌లో ఉంటేనే వర్తించదు’ అని ఎందుకు మార్చారు? 
ఎవరిని కాపాడటానికి ఈ మార్పు?
కోట్లాది మంది డేటా హ్యాండిల్ చేసే సాఫ్ట్‌వేర్‌కు ఉండాల్సిన
‘CMMI లెవెల్’ మెచ్యూరిటీ స్టాండర్డ్స్‌ని ఎందుకు తగ్గించారు?
రిటైర్డ్ అధికారులు కంపెనీల్లో చేరకూడదనే
‘టూ ఇయర్స్ కూలింగ్ ఆఫ్ పీరియడ్‌’ను వన్ ఇయర్‌కి ఎందుకు కుదించారు?
సొంత డేటా సెంటర్ ఉండాలనే రూల్ తీసేసి.. 
థర్డ్ పార్టీకి ఇచ్చుకునేలా ఎందుకు సడలించారు?
సోర్స్ కోడ్‌పై ఓనర్షిప్ నిబంధనను ఎందుకు తుడిచేశారు?

ఇప్పుడు ఈ వ్యవహారం కేవలం 
స్టూడెంట్స్ రూమ్‌లకే పరిమితం కాలేదు.
ఏకంగా పార్లమెంట్ వీధుల్లోకి చేరింది!
సార్థక్ సిద్ధాంత్ చేసిన ఈ ఇన్వెస్టిగేషన్‌ను 
ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ స్వయంగా ప్రశంసించారు! 
CBSE సొంత డాక్యుమెంట్లతోనే బోర్డు గుట్టు రట్టు చేశాడని కొనియాడారు.
జ్యుడీషియల్ ఎంక్వైరీ జరగాలని 
కాంగ్రెస్ నేత జైరాం రమేష్ డిమాండ్ చేస్తున్నారు!
ఒక్కొక్క క్లాజ్ మార్పు వెనుక ఉన్న అసలు హస్తం ఎవరిది?
ఇవన్నీ యాదృచ్ఛికంగా జరిగిన మార్పులా?
లేక ప్రీ-ప్లాన్డ్ స్కెచ్‌లా?
లక్షల మంది విద్యార్థుల భవిష్యత్తుతో ఆడుకున్న 
ఈ టెండర్ల వెనుక ఉన్న అసలు ‘బిగ్ బాస్’ ఎవరు?
ఈ ప్రశ్నలకు సమాధానం చెప్పాల్సిన బాధ్యత 
ఇప్పుడు CBSEతోపాటు విద్యాశాఖపై ఉంది!

ఇప్పటివరకు... సార్థక్ లేవనెత్తిన ప్రశ్నలన్నీ
 కేవలం అర్హతల చుట్టూనే తిరిగాయి! 
ఎవరికి అర్హత ఉంది? 
ఎవరు ఈ టెండర్‌లో పాల్గొనవచ్చు? 
ఎలాంటి ప్రమాణాలు పాటించాలి? 
కానీ... సరిగ్గా ఇక్కడే ఈ ఇన్వెస్టిగేషన్ ఒక సంచలన మలుపు తిరిగింది!

ఎందుకంటే... ప్రొక్యూర్మెంట్ అంటే 
కేవలం ఒక కాంట్రాక్ట్ ఎవరికి దక్కింది అనేదానితోనే ముగిసిపోదు. 
అసలు కథ కాంట్రాక్ట్ దక్కిన తర్వాతే మొదలవుతుంది! 
పనితీరును ఎలా కొలుస్తారు? 
తప్పులు జరిగితే శిక్షలు ఎలా ఉంటాయి? 
క్వాలిటీని ఎలా కంట్రోల్ చేస్తారు? 
అన్నిటికంటే ముఖ్యంగా... ఒకవేళ ఏదైనా తప్పు జరిగితే బాధ్యత ఎవరిది? 
సార్థక్ అనాలసిస్ ప్రకారం... 
సరిగ్గా ఇక్కడే అసలు ఆట మొదలైంది. 
నిబంధనలన్నీ ఒక్కొక్కటిగా మారిపోయాయి!

ప్రతి పెద్ద ప్రభుత్వ టెండర్‌కు 
ఒక స్కోరింగ్ సిస్టమ్ ఉంటుంది. 
గెలిచేదెవరో.. ఓడేదెవరో డిసైడ్ చేసేది ఇదే! 
పాత మోడల్ ప్రకారం చూస్తే... 
గతంలో పెద్ద పెద్ద ప్రాజెక్టులు చేసిన అనుభవానికి, 
భారీ ఆపరేషన్స్ సక్సెస్‌ఫుల్‌గా రన్ చేసిన ట్రాక్ రికార్డ్‌కు 
ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చేవారు.
ప్రాజెక్ట్ వాల్యూ, స్కేల్, హ్యాండిల్ చేసిన పేజీల సంఖ్య... 
ఇవే మెయిన్ క్రైటీరియా!

కానీ... సార్థక్ చేతికి చిక్కిన కొత్త టెండర్ డాక్యుమెంట్ లో 
లాజిక్ మొత్తం రివర్స్ అయిపోయింది! 
పెద్ద ప్రాజెక్టుల స్థానంలో...
చిన్న చిన్న మల్టిపుల్ అసైన్‌మెంట్స్ ఉన్నా
చాలనేలా రూల్స్ మార్చేశారు. 
పైకి ఇది చిన్న టెక్నికల్ మార్పులా కనిపించొచ్చు...
కానీ, దీని వెనుక పెద్ద స్కెచ్చే ఉందంటున్నారు సార్థక్! 
పాత రూల్స్ ప్రకారం పెద్ద కంపెనీలకు వచ్చే ఛాన్స్...
కొత్త రూల్స్ వల్ల చిన్న చిన్న ప్రాజెక్టులు చేసిన 
వెండర్లకు కూడా కార్పెట్ పరిచేలా మారిపోయింది!


ఒక్కసారి ఆలోచించండి... 
ఇది లక్షలాది విద్యార్థుల భవిష్యత్తుకు సంబంధించిన వ్యవహారం. 
కోట్లాది ఆన్సర్ షీట్లు! డిజిటలైజేషన్, కాంప్లెక్స్ సాఫ్ట్‌వేర్ సిస్టమ్స్,
డేటా సెక్యూరిటీ, మానిటరింగ్...
ఇంత పెద్ద ప్రాజెక్టుకు అత్యున్నత సాంకేతిక నైపుణ్యం అవసరం లేదా?


పాత నిబంధనల ప్రకారం... 
ఎక్స్‌పీరియన్స్ ఉన్న సాఫ్ట్‌వేర్ ప్రొఫెషనల్స్ 
ఎక్కువగా ఉన్న సంస్థలకే వెయిటేజీ ఉండేది. 
కానీ కొత్త ఫ్రేమ్‌వర్క్‌లో టెక్నికల్ మ్యాన్‌పవర్ అవసరాన్ని
భారీగా తగ్గించేశారు.!
టెక్నాలజీతో నడిచే ఇంత పెద్ద ప్రాజెక్టులో...
సాంకేతిక నిపుణుల అవసరాన్ని ఎందుకు తగ్గించారు? 
అసలు ఈ స్టాండర్డ్స్ మార్చాల్సిన అవసరం ఎందుకు వచ్చింది? 
ఇదే ఇప్పుడు సార్థక్ అడుగుతున్న మిలియన్ డాలర్ల ప్రశ్న!


ఇప్పుడు ఈ స్టోరీలోనే అత్యంత షాకింగ్ ఎపిసోడ్‌లోకి వెళ్దాం. 
అదే... పెనాల్టీలు! పాత RFPలో... 
తప్పుగా స్కాన్ చేసినా, పేజీలు మిస్సయినా, 
పార్షియల్ స్కానింగ్ జరిగినా, ఆన్సర్ బుక్స్ స్కాన్ చేయకుండా వదిలేసినా...
ఒక్కో తప్పుకు కఠినమైన జరిమానాలు ఉండేవి. 
ఎందుకంటే... ఆన్సర్ షీట్ అంటే కేవలం ఒక పేపర్ ముక్క కాదు! 
ఒక విద్యార్థి నెలల శ్రమ... ఏళ్తతరబడి ప్రిపరేషన్...
వారి జీవిత కాల భవిష్యత్తు!


కానీ సార్థక్ రీసెర్చ్ ప్రకారం... 
కొత్త రూల్స్ క్వాలిటీని పక్కనబెట్టి, 
కేవలం డెడ్‌లైన్స్ కు మాత్రమే ప్రాధాన్యత ఇచ్చాయి! 
ఆలస్యమైతే పెనాల్టీ ఉంటుంది కానీ...
తప్పులు జరిగితే పట్టింపు లేదు అనేలా సిస్టమ్ మారిపోయింది! 
వేగం ముఖ్యం కాదనట్లేదు... 
కానీ క్వాలిటీ కంటే వేగమే ముఖ్యం అనుకుంటే, 
కంగారులో తప్పులు జరగవా? 
విద్యార్థుల భవిష్యత్తు ఏం కావాలి?


క్వాలిటీ కంట్రోల్ సిస్టమ్‌లో...
ఇంతవరకు తప్పులు జరిగితే సహించేది లేదు అనే 
ఒక మ్యాథమెటికల్ బెంచ్‌మార్క్ ఉండేది. 
కొత్త దాంట్లో ఆ 'ఎర్రర్ త్రెషోల్డ్' పూర్తిగా మాయమైపోయింది! 
ఎందుకు తొలగించారు ఆ అకౌంటబిలిటీని?

అంతకంటే ఘోరం...
టెండర్ రిలీజ్ అయ్యాక ఇచ్చిన ఒక 'కొరిజెండం' ! 
సార్థక్ బలంగా ఆరోపిస్తున్నదేంటంటే...
ఈ సవరణ ద్వారా, తప్పు చేసిన కంపెనీలను 'బ్లాక్‌లిస్ట్' చేసే 
కఠినమైన నిబంధనలను సాఫ్ట్ చేసేశారు! 
భవిష్యత్తులో తప్పులు జరగకుండా 
అడ్డుకునే అతిపెద్ద ఆయుధాన్ని... 
టెండర్ ఫైనల్ అయ్యే చివరి నిమిషంలో ఎందుకు బలహీనపరిచారు?

ఇప్పుడు ఈ డాట్స్ అన్నింటినీ కనెక్ట్ చేసి చూడండి... 
ఎలిజిబిలిటీ తగ్గించారు... 
టెక్నికల్ స్టాండర్డ్స్ మార్చేశారు...
ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ సడలించారు...
సాఫ్ట్‌వేర్ రూల్స్ మార్చేశారు...
పెనాల్టీలు తగ్గించారు... ఎర్రర్ త్రెషోల్డ్ తీసేశారు...
ఆఖరికి బ్లాక్‌లిస్ట్ భయం కూడా లేకుండా చేశారు! 
ఇవన్నీ చూస్తుంటే... ఇవి యాదృచ్ఛికంగా జరిగిన మార్పులా? 
లేక ఎవరికో లబ్ధి చేకూర్చడానికి ఒకే దిశగా జరిగిన వ్యూహాత్మక మార్పులా?

ఇప్పుడు వివాదం కేవలం టెండర్ల కేటాయింపు దగ్గరే ఆగిపోలేదు.
ఈ సిస్టమ్ అసలు ఎలా పనిచేస్తోంది? 
కోట్ల మంది విద్యార్థుల ఆన్సర్ షీట్స్ భద్రంగా ఉన్నాయా? 
అసలు సైబర్ సెక్యూరిటీ ఉందా? 
విద్యార్థుల పర్సనల్ డేటా సేఫేనా? 
ఈ ప్రశ్నలే ఇప్పుడు దేశవ్యాప్తంగా సంచలనం రేపుతున్నాయి!

ఇప్పటివరకు మనం చూసింది వేరు... 
ఇప్పుడు చూడబోయేది వేరు! 
నిన్నటివరకు అది కేవలం టెండర్ల లొసుగుల వ్యవహారం.
కేవలం కాగితాల కొట్లాట! 
అర్హతలేంటి? టెక్నికల్ క్వాలిఫికేషన్స్ ఏంటి? 
స్కోరింగ్ సిస్టమ్స్ ఎలా ఇచ్చారు? 
పెనాల్టీలు ఎలా వేశారు? అంతా ఇదే అనుకున్నారు!
కానీ... సీన్ కట్ చేస్తే... కథ అడ్డం తిరిగింది!
ఫోకస్ మొత్తం ఒక్కసారిగా షిఫ్ట్ అయింది. 
అసలు కాంట్రాక్ట్ ఎలా ఇచ్చారు అన్న ప్రశ్న పక్కకు పోయింది. 
"అసలు ఈ సిస్టమ్ ఎంతవరకు సేఫ్?" అనే 
నయా డౌట్ తెరపైకి వచ్చింది! 
సరిగ్గా ఇక్కడే... ఈ కథలోకి మరో టీనేజర్ ఎంట్రీ ఇచ్చాడు!

ఒకవైపు సార్థక్ టెండర్ డాక్యుమెంట్లను జల్లెడ పడుతుంటే...
మరోవైపు నిసర్గ అధికారి చూపు టెక్నాలజీ వైపు పడింది! 
ఇన్ఫ్రాస్ట్రక్చర్ మీద పడింది! 
సెక్యూరిటీ ఆర్కిటెక్చర్ లోపాలను ఆరా తీశాడు. 
ఆ తర్వాత అతను సోషల్ మీడియాలో పెట్టిన పోస్టులు
ఇప్పుడు దేశవ్యాప్తంగా ప్రకంపనలు సృష్టిస్తున్నాయి!

OSM ఎకోసిస్టమ్‌కు సంబంధించిన ఇన్ఫ్రాస్ట్రక్చర్‌లో 
ఘోరమైన సెక్యూరిటీ లోపాలు ఉన్నాయంటూ 
నిసర్గ సంచలన ఆరోపణలు చేశాడు. 
ఇవన్నీ టెక్నికల్ అంశాలే కావచ్చు...
కానీ దీని వెనుక ఉన్న అసలు ప్రమాదం వింటే 
ఒళ్ళు గగుర్పొడుస్తుంది! 
ఎందుకంటే... ఈ ఆరోపణలు నిజమైతే...
నష్టపోయేది కాంట్రాక్టర్లు కాదు...
లక్షలాది మంది విద్యార్థుల భవిష్యత్తు!

అసలు కథను మార్చేసి, అందరినీ ఉలిక్కిపడేలా చేసిన 
ఆ క్లెయిమ్ ఏంటో తెలుసా? 
ఎగ్జామినేషన్ మెటీరియల్‌కు సంబంధించిన 
ఒక క్లౌడ్ స్టోరేజ్ బకెట్‌ను ఎవరైనా చూసేలా ఓపెన్‌గా పెట్టేశారు! 
కనీసం అథెంటికేషన్... 
అంటే పాస్‌వర్డ్ లాంటి రక్షణ కూడా లేకుండా 
ఫైళ్లను బ్రౌజ్ చేసేలా వదిలేశారన్నది నిసర్గ ఆరోపణ!

సైబర్ సెక్యూరిటీ ఎక్స్‌పర్ట్స్ దీనిపై 
ఇంకా అధికారికంగా నిర్ధారించాల్సి ఉన్నప్పటికీ...
ఈ లీక్ వ్యవహారం ఎందుకు దావానలంలా మారింది? 
అక్కడ ఓపెన్‌గా ఉన్నది ఏంటో తెలుసా?
జవాబు పత్రాలు! క్వశ్చన్ పేపర్లు! 
విద్యార్థుల పర్సనల్ డేటా! 
అదీ ఒక్క ఇన్స్టిట్యూషన్ ది కాదు...
మల్టిపుల్ ఇన్స్టిట్యూషన్స్ డేటా! 
ఒకవేళ ఇది నిజమైతే...
ఇంతకంటే ద్రోహం మరొకటి ఉంటుందా?

ఒక్కసారి ఆలోచించండి! 
ఒక ఆన్సర్ షీట్‌లో ఏముంటుంది? 
విద్యార్థి చేతిరాత... వాళ్ల కష్టం... పర్సనల్ ఐడెంటిటీ...
వాళ్ల అకడమిక్ పర్ఫార్మెన్స్! 
ఇవన్నీ అత్యంత గోప్యంగా ఉంచాల్సిన బాధ్యత ఎవరిది?
న్యాయంగా ఎగ్జామ్స్ జరుగుతాయని, 
తమ డేటా సేఫ్‌గా ఉంటుందని నమ్మి 
విద్యార్థులు పరీక్షలు రాస్తారు. 
కానీ ఇక్కడ ప్రైవసీ అనేది ప్రశ్నార్థకంగా మారింది! 
అందుకే ఈ వివాదం కేవలం టెక్నికల్ ఇష్యూ కాదు...
ప్రతి స్టూడెంట్‌కి, ప్రతి పేరెంట్‌కి, ప్రతి టీచర్‌కి సంబంధించిన 
పర్సనల్ ఎమోషన్ అయిపోయింది!

ఇంటర్నెట్‌లో స్క్రీన్‌షాట్లు చక్కర్లు కొడుతుంటే...
భయానకమైన ప్రశ్నలు తలెత్తుతున్నాయి.
అసలు ఎంత మెటీరియల్ బయటకు లీక్ అయింది?
ఎంతకాలంగా ఇది ఇలా ఓపెన్‌గా ఉంది? 
ఎవరెవరు దీన్ని యాక్సెస్ చేశారు?
ఈ లోపాన్ని ఎప్పుడు గుర్తించారు? ఎప్పుడు ఫిక్స్ చేశారు?
అసలు నష్టపోయిన విద్యార్థులకు, పేరెంట్స్‌కు,
స్కూళ్లకు కనీసం సమాచారమైనా ఇచ్చారా?
ప్రశ్నలు కొండంత ఉన్నాయి...
సమాధానాలు మాత్రం శూన్యం! 
ఈ మౌనమే ఇప్పుడు అనుమానాలను మరింత పెంచుతోంది!

ఇప్పుడు పాత కథను మరోసారి గుర్తుతెచ్చుకోండి.
టెక్నికల్ రిక్వైర్మెంట్స్, సాఫ్ట్‌వేర్ స్టాండర్డ్స్, సెక్యూరిటీ ఆడిట్స్ మీద 
సార్థక్ లేవనెత్తిన ప్రశ్నలను...
ఇప్పుడు జరిగిన ఈ సెక్యూరిటీ ఫెయిల్యూర్ కోణంలో చూస్తే ఏం అర్థమవుతోంది?
అసలు పెట్టిన సేఫ్‌గార్డ్స్ సరిపోవా?
ఆడిట్స్ సరిగ్గా చేయలేదా? 
రూల్స్ సరిగ్గా అమలు చేయలేదా?
ఇక్కడే సార్థక్ పెట్టిన ఒక పోస్ట్ 
విద్యార్థుల గుండెల్లో గునపమై దిగబడింది! 
"మనం వ్యవస్థను నమ్మాం... బోర్డులను నమ్మాం... 
కానీ మన నమ్మకం పూర్తిగా వమ్ము అయింది" అంటూ 
సార్థక్ ఆవేదన వ్యక్తం చేశాడు. 
అవును... నమ్మకమే లేనప్పుడు 
ఈ ఎగ్జామినేషన్ సిస్టమ్‌కు అర్థమేముంది?

కథ సాఫ్ట్‌వేర్ నుంచి... 
ఇన్స్టిట్యూషనల్ రెస్పాన్సిబిలిటీ వైపు మళ్లింది. 
ఎందుకంటే విద్యార్థులు క్లౌడ్ సిస్టమ్స్‌ను ఆడిట్ చేయలేరు...
టెండర్లను చెక్ చేయలేరు. 
వాళ్లు కేవలం బోర్డును మాత్రమే నమ్మగలరు.
ఆ నమ్మకమే మునిగిపోతే ఎలా?
ఇదే అంశం ఇప్పుడు దేశ రాజధానిని కుదిపేస్తోంది! 
పొలిటికల్ లీడర్స్ రంగంలోకి దిగారు.
CBSE డాక్యుమెంట్లతోనే లొసుగులను బయటపెట్టిన సార్థక్ పోరాటాన్ని
రాహుల్ గాంధీ బహిరంగంగా మెచ్చుకున్నారు! 
దీనిపై తక్షణమే స్వతంత్ర జ్యుడీషియల్ ఎంక్వైరీ జరగాలని డిమాండ్ చేశారు.

మరోవైపు జైరాం రమేష్ ఈ వివాదాన్ని మరింత ముందుకు తీసుకెళ్లారు.
టెండర్ల లొసుగులు, సెక్యూరిటీ ఫెయిల్యూర్స్ మాత్రమే కాదు...
మూడో సంచలనాన్ని తెరపైకి తెచ్చారు! 
ఆన్సర్ షీట్స్ డిజిటలైజేషన్ వెనుక, స్కానింగ్ క్వాలిటీ వెనుక, 
వాడుతున్న ఎక్విప్‌మెంట్ వెనుక 
అసలు టెండర్ రూల్స్ ఏమయ్యాయంటూ కొత్త బాంబు పేల్చారు!

ఇప్పటివరకు మనం టెండర్ పత్రాలు చూశాం..
టెక్నికల్ స్పెసిఫికేషన్స్ మాట్లాడాం.. 
సెక్యూరిటీ లీకులపై లాయర్లు, సైబర్ నిపుణులు వాదించుకోవడం విన్నాం. 
కానీ కథ ఇప్పుడే అసలైన మలుపు తిరిగింది!

వివాదం కాగితాలు దాటి.. 
నేరుగా విద్యార్థుల Answer Sheets దగ్గరకు వచ్చింది.
ఎప్పుడైతే ఆ జవాబు పత్రాల ఇమేజెస్ 
సోషల్ మీడియాలోకి వచ్చాయో..
సామాన్య జనాల కళ్ళు బైర్లు గమ్మేలా చేశాయి.
లాయర్లు అక్కర్లేదు.. ఐటీ నిపుణులు అక్కర్లేదు..
కళ్ళున్న ప్రతి ఒక్కరికీ అక్కడ తప్పు జరిగిందని ఇట్టే అర్థమైపోతోంది! 
అసలు ఏం దాస్తోంది CBSE అనే క్వశ్చన్ రైజ్ అవుతోంది.

ఒకరోజు.. సార్థక్ అనే కుర్రాడు 
సోషల్ మీడియాలో వేసిన ఒకే ఒక్క ప్రశ్నతో 
CBSE కోటలు బద్దలయ్యాయి. 
ఆ క్వశ్చన్ కాస్తా దావాగ్నిలా దేశమంతా వ్యాపించింది. 
సార్థక్ వాదన చాలా సింపుల్.. చాలా స్ట్రెయిట్ ఫార్వర్డ్!
మా పేపర్లు అన్నీ హై-ఎండ్ ప్రొఫెషనల్ స్కానర్లతో 
స్కాన్ చేశామని CBSE పదే పదే చెప్తోంది కదా? 
మరి అలాంటప్పుడు...
ఆ జవాబు పత్రాల ఇమేజ్‌లలో కనిపిస్తున్న
ఆ వింత ఆకారాలు ఏంటి? 
ఇండస్ట్రియల్ స్కానర్ల నుంచి వచ్చే 
అవుట్‌పుట్ ఇలాగే ఉంటుందా?


ఒక్కసారి గమనించండి!
ఆ ఇమేజెస్‌లో ఏం కనిపించాయో తెలుసా?
Visible Shadows!
Fold Marks!
అసలు స్కానింగ్ మెషీన్‌లో రాని.. 
ఒక సాధారణ కెమెరాతో ఫోటో తీస్తే వచ్చే వింత ఫీచర్లు!
దీంతో సార్థక్ నేరుగా గురిపెట్టాడు..
"నిజంగా మీరు స్కానర్లనే వాడారా? 
లేక మొబైల్ ఫోన్లతో ఫోటోలు తీసి మమ్మల్ని నమ్మిస్తున్నారా?" అంటూ 
సోషల్ మీడియా వేదికగా నిలదీశాడు.
దీంతో సోషల్ మీడియా ఇన్వెస్టిగేటర్లు రంగంలోకి దిగారు.
'డేటావోరస్' అనే ఒక ఎక్స్ యూజర్ 
ఏకంగా 2,944 జవాబు పత్రాల పేజీలను క్షుణ్ణంగా పరిశీలించాడు. 
ఇది, ఒకటి లేదా రెండు పేజీల్లో జరిగిన పొరపాటు కాదు..
వేలాది పేజీల్లో అదే నీడలు.. అవే మడతలు..
చుట్టుపక్కల ఉండే అనవసరమైన ఎలిమెంట్స్ అన్నీ
ఆ ఇమేజెస్‌లో దర్శనమిచ్చాయి. 
ఇదా.. మీరు చెప్పిన అత్యున్నత ప్రమాణాలు గల
'ఇండస్ట్రియల్ డాక్యుమెంట్‌ స్కానింగ్‌'? అంటూ బోర్డుపై క్వశ్చన్స్ రైజ్ అయ్యాయి.

టెండర్ పత్రాల్లో సీబీఎస్‌ఈ ఏం చెప్పింది? 
రెండు వైపులా శరవేగంగా స్కాన్ చేసే 'డ్యూప్లెక్స్ స్కానర్లు' వాడతామన్నారు.
ఆటోమేటిక్ బుక్ స్కానర్లు, రోబోటిక్ బేస్డ్ స్కానింగ్ సిస్టమ్స్ ఉంటాయన్నారు. 
మరి ఇమేజెస్ చూస్తే మొబైల్ ఫోటోల్లా ఉన్నాయి.
సార్థక్ తన బ్లాగ్‌లో ముందే వార్న్ చేశాడు. 
మొదటి టెండర్ నోటిఫికేషన్‌లో ఉన్న కఠినమైన నిబంధనలను, 
స్కానర్ల స్పెసిఫికేషన్లను..
ఆ తర్వాత వచ్చిన టెండర్లలో CBSE ఎందుకు మార్చింది? 
ఎందుకు అంత సరళంగా, లూజ్ గైడ్‌లైన్స్‌గా మార్చేసింది? 
అంటే.. ముందే ప్లాన్ జరిగిందా? 
అనుకున్న స్కానర్లు వాడకుండా.. 
వేరే ఏదో తూతూమంత్రం తతంగం నడిపించారా?

ఇక్కడ ప్రశ్న పేపర్ మీద పడ్డ 'నీడ' గురించి కాదు.. 
పేపర్ 'మడత' గురించి అంతకన్నా కాదు. 
అసలైన ప్రశ్న.. సిస్టమ్‌ ట్రాన్సపరెన్సీ గురించి. 
కోట్ల మంది విద్యార్థుల రక్తం కూడ్చి రాసిన అకాడమిక్ భవిష్యత్తు ఇది.
టెండర్లలో చెప్పిన క్వాలిటీ కంట్రోల్ రూల్స్ పాటించారా లేదా? 
స్కానింగ్ ప్రాసెస్ సరిగ్గా జరిగిందా లేదా? 
దీనిపై థర్డ్ పార్టీ ఆడిట్ జరిగిందా? 
ఇలా జవాబు దొరకని అనేక ప్రశ్నలు మనమందు ఉన్నాయి.

ఆలోచించండి! 
ఒక్క నిమిషం ఆలోచించండి!
ఒక 17 ఏళ్ల కుర్రాడు... 
ఏకంగా Evaluation వ్యవస్థనే ప్రశ్నించాడు!
ఒక 19 ఏళ్ల యువకుడు...
సైబర్ సెక్యూరిటీ డొల్లతనాన్ని ఎండగట్టాడు!
మరో 17 ఏళ్ల విద్యార్థి...
వందల పేజీల ప్రభుత్వ టెండర్ పత్రాలను
లైన్ బై లైన్ చదివి, 
అందులోని లూప్‌హోల్స్‌ను బయటపెట్టాడు!

ఈ ఆరోపణల్లో ఎంత నిజముందనేది పక్కన పెడితే...
ఇన్స్టిట్యూషన్స్ అడగాల్సిన ప్రశ్నలను, 
వ్యవస్థలు నిలదీయాల్సిన అక్రమాలను, 
మెయిన్‌స్ట్రీమ్ మీడియా ప్రశ్నించాల్సిన నిజాలను...
ఈ ముగ్గురు కుర్రాళ్లు దేశం ముందు పెట్టారు!

ఇప్పుడు సోషల్ మీడియాలో 
ఒకే ఒక్క పోస్ట్ వైరల్ అవుతోంది! 
దేశ ప్రజల ఆలోచనలను తట్టి లేపుతోంది!
వేదాంత్ శ్రీవాత్సవ!
నిసర్గ అధికారి!
సార్థక్ సిద్దాంత్!
ఈ మూడు పేర్లు ఇప్పుడు దేశవ్యాప్తంగా మారుమోగిపోతున్నాయి. 
మూడు వేర్వేరు ఇన్వెస్టిగేషన్లు...
ఒకే ఒక్క లక్ష్యం...
 అది "అకౌంటబిలిటీ" అంటే బాధ్యతాయుతమైన వ్యవస్థ! 
వీరి పోరాటం చూస్తుంటే దేశంలో 
ఇంకా ఆశ చావలేదనిపిస్తోంది. 
అవును! విద్యార్థులు గమనిస్తున్నారు... 
పౌరులు ప్రశ్నిస్తున్నారు... దేశం నిలదీస్తోంది!

ఈ సెగ ఇక్కడితో ఆగలేదు! 
పార్లమెంట్ కారిడార్లను తాకింది. 
ఈ ముగ్గురు కుర్రాళ్ల దెబ్బకు రాజకీయ వ్యవస్థ ఉలిక్కిపడింది. 
సోషల్ మీడియాలో మొదలైన ఈ చిచ్చు, 
ఇప్పుడు దేశవ్యాప్త ఉద్యమంగా మారింది! 
కానీ, అసలు ప్రశ్నలకు ఇప్పటికీ సమాధానం లేదు!

ఇప్పుడు CBSE సమాధానం చెప్పి తీరాల్సిందే! 
టెండర్ నిబంధనలను అర్ధరాత్రి ఎందుకు మార్చారు?
అర్హత ప్రమాణాలను ఎవరి కోసం సవరించారు?
Security Audit నిజంగానే జరిగిందా? 
జరిగితే ఆ రిపోర్ట్ ఎక్కడ?
లక్షలాది మంది విద్యార్థుల డేటాను ఎలా ప్రొటెక్ట్ చేశారు?
అంతా సక్రమంగానే జరిగితే...
ఈ దేశంలో ఇంత గందరగోళం ఎందుకు నెలకొంది?
CBSE సమాధానం చెప్పాలి!

ఇది కేవలం ఒక సాఫ్ట్‌వేర్ గురించో, 
క్లౌడ్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ గురించో లేదా ఒక కంపెనీ గురించో కాదు...
ఇది కోట్ల మంది విద్యార్థుల భవిష్యత్తు, నమ్మకానికి సంబంధించిన ప్రశ్న! 
ఏటా లక్షలాది మంది విద్యార్థులు 
తమ జీవితాలను ఈ వ్యవస్థల చేతుల్లో పెడతారు. 
రాత్రింబవళ్లు చదువుతారు... 
సెలవులను త్యాగం చేస్తారు. 
తల్లిదండ్రులు తమ రక్తాన్ని కూడు చేసుకుని ఫీజులు కడతారు. 
వారు కోరుకునేది ఒక్కటే...
టాన్సపరెన్సీ, సెక్యూరిటీ, జస్టిస్‌..!
అది కూడా ఇవ్వలేనప్పుడు ఈ వ్యవస్థలు ఎందుకు?

ఇక్కడ మరో బాధాకరమైన విషయం ఏంటంటే...
ఓవైపు ఇంత జరుగుతుంటే 
దేశంలోని మెయిన్‌స్ట్రీమ్ మీడియా ఎక్కడ పడుకుంది?
జర్నలిజం పని ప్రభుత్వాలను, వ్యవస్థలను కాపాడటం కాదు...
ప్రజల తరఫున నిలబడి నిలదీయడం! 
కోట్ల మంది విద్యార్థుల భవిష్యత్తు ప్రమాదంలో పడితే...
ఆ ముగ్గురు పిల్లలు చేసిన పనిని 
పెద్ద పెద్ద మీడియా సంస్థలు ఎందుకు చేయలేకపోయాయి?

నిజాలు ఎప్పటికైనా బయటకు వస్తాయి...
స్వతంత్ర విచారణతో తేలుతాయి.
కానీ ఒకటి మాత్రం నిజం. 
వేదాంత్ శ్రీవాస్తవ, నిసర్గ అధికారి, సార్థక్ సిద్దాంత్...
ఈ ముగ్గురు కుర్రాళ్లు దేశాన్ని ఒక రాత్రిలో నిద్ర లేపారు!
పాలకులకు బాధ్యతను గుర్తు చేశారు! 
ప్రశ్నించడానికి వయసుతో సంబంధం లేదని నిరూపించారు! 
ఎందుకంటే... ఏ దేశంలోనైనా ప్రజలు ప్రశ్నించినప్పుడే 
ప్రజాస్వామ్యం బతుకుతుంది.
ఆ ప్రశ్నలు అడుగుతున్నది 
స్కూల్ యూనిఫాంలో ఉన్న పిల్లలైనా సరే...
వ్యవస్థలు వణకాల్సిందే..!

Advertisment
తాజా కథనాలు