Jeevan Reddy: కాంగ్రెస్‌కు బిగ్‌షాక్‌..జీవన్‌ రెడ్డి రాజీనామా

గత కొంతకాలంగా అధిష్టానంపై అసంతృప్తి వ్యక్తం చేస్తూ వస్తున్న జగిత్యాల మాజీ ఎమ్మెల్యే, సీనియర్‌ కాంగ్రెస్‌ నేత జీవన్‌ రెడ్డి ఎట్టకేలకు పార్టీకి రాజీనామా సమర్పించారు. కాంగ్రెస్ పార్టీ ఏఐసీసీ సభ్యత్వంతో పాటు, ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేశారు.

New Update
FotoJet (40)

Jeevan Reddy resigns

Jeevan Reddy: గత కొంతకాలంగా అధిష్టానంపై అసంతృప్తి వ్యక్తం చేస్తూ వస్తున్న జగిత్యాల మాజీ ఎమ్మెల్యే, సీనియర్‌ కాంగ్రెస్‌ నేత జీవన్‌ రెడ్డి ఎట్టకేలకు పార్టీకి రాజీనామా సమర్పించారు. కాంగ్రెస్ పార్టీ ఏఐసీసీ సభ్యత్వంతో పాటు, ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేశారు. రాజీనామా లేఖ విడుదల చేసిన జీవన్ రెడ్డి సభలో కాంగ్రెస్ కండువా తీసేసి గ్రీన్ కలర్ కండువా కప్పుకున్నారు.

జగిత్యాల నుంచి గెలిచిన బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యే డాక్టర్‌ సంజయ్‌ కుమార్‌ను కాంగ్రెస్‌లోకి తీసుకోవడాన్ని తప్పు పడుతూ వస్తున్న జీవన్‌ రెడ్డి అధిష్టానంపై గత కొంతకాలంగా నిరసన వ్యక్తం చేస్తున్నారు. కాగా  ఈ నెల 25న రాజీనామా చేస్తానని ప్రకటించిన ఆయన అన్నట్లుగానే తన అభిమానుల సమక్షంలో పార్టీకి రాజీనామా సమర్పించారు. ఈ సందర్భంగా ఆయన ఒకింత భావోదక్వేగానికి గురయ్యారు. “40 ఏళ్ల పాటు పార్టీ కోసం నిస్వార్థంగా పని చేశాను… కానీ నాకు సరైన గౌరవం దక్కలేదు” అని ఆవేదన వ్యక్తం చేశారు. తనకు గౌరవం లేనిచోట తాను ఉండలేనని స్పష్టం చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వానికి తగినంత మంది ఎమ్మెల్యేల బలం ఉన్నప్పటికీ, వేరే పార్టీల ఎమ్మెల్యేలను చేర్చుకోవడం పై ఆయన తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. పార్టీ ఫిరాయింపులు మంచివి కాదని మొదటి నుంచే చెబుతున్నానని గుర్తు చేశారు.

“రాహుల్ గాంధీ ‘జై బాపు, జై భీమ్, జై సంవిధాన్’ అంటూ ముందుకు వెళ్తుంటే, ఇక్కడ మాత్రం ఆ విలువలను నీరుగార్చే విధంగా వ్యవహరిస్తున్నారు” అని అని తీవ్రంగా ఆరోపించారు.  తన అనుచరుడి హత్య జరిగినప్పుడు కూడా ముఖ్యమంత్రి పరామర్శించలేదని ఆరోపించిన జీవన్ రెడ్డి ఓపికకు కూడా హద్దు ఉంటుందని 20 నెలలుగా అవమానాలు భరిస్తూ వచ్చాను” అని ఆవేదన వ్యక్తం చేశారు. గౌరవం లేని చోట ఎలా పని చేయాలి?” అంటూ ప్రశ్నించారు.ముఖ్యంగా జగిత్యాల నియోజకవర్గంలో తన ప్రత్యర్థిగా ఉన్న సిట్టింగ్ ఎమ్మెల్యే సంజయ్ కుమార్‌ను పార్టీలోకి చేర్చుకోవడాన్ని తాను తీవ్రంగా వ్యతిరేకిస్తున్నట్లు పేర్కొన్నారు. తనతో కనీసం సంప్రదించకుండా పార్టీలో చేర్చుకోవడంపై అభ్యంతరం వ్యక్తం చేశారు. ఈ నిర్ణయం తనను ఎంతగానో బాధించింది అని మాజీమంత్రి జీవన్ రెడ్డి చెప్పుకొచ్చారు.  

తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిందన్న సంతోషం లేకుండా చేశారని...20 నెలలకు పార్టీలో మానసిక ఇబ్బందులకు గురి చేశారని మాజీమంత్రి జీవన్ రెడ్డి ఆరోపించారు. ఈ పరిణామాలను పరిగణలోకి తీసుకునే కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు.  తన రాజకీయ భవిష్యత్తుపై కార్యకర్తలతో చర్చించిన తర్వాతే తుది నిర్ణయం తీసుకుంటానని అన్నారు. తన రాజకీయ జీవితంలో ఏనాడూ కూడా పదవుల కోసం వెంపర్లాడలేదు అని జీవన్‌ రెడ్డి చెప్పుకొచ్చారు. అలాగని పదవుల కోసం ఎలాంటి పైరవీలు కూడా చేయలేదన్నారు. కార్యకర్తల గౌరవం కాపాడటమే తన ప్రాధాన్యతగా చెప్పుకొచ్చారు. తాను తీసుకున్న నిర్ణయం పట్ల ఈనెల 26 నుంచి గ్రామాల్లో పర్యటించి ప్రజల అభిప్రాయాలను సేకరించి ఆ తర్వాత తన భవిష్యత్ కార్యచరణ ప్రకటిస్తానని మాజీమంత్రి జీవన్ రెడ్డి స్పష్టం చేశారు.

Advertisment
తాజా కథనాలు