Supreme Court : 3 వారాల్లోపు నిర్ణయం తీసుకోండి లేదంటే కోర్టు ధిక్కరణ కింద చర్యలు..స్పీకర్‌కు సుప్రీం హెచ్చరిక

ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్లపై సుప్రీంకోర్టు మరోసారి తెలంగాణ స్పీకర్‌కు గట్టి వార్నింగ్‌ ఇచ్చింది. 3 వారాల్లోపు నిర్ణయం వెలువరించాలని స్పష్టం చేసింది. లేదంటే తాము కోర్టు ధిక్కరణ కింద చర్యలు తీసుకోవలసి వస్తుందని హెచ్చరించింది.

New Update
FotoJet (8)

 Supreme Court

Supreme Court: ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్లపై సుప్రీంకోర్టు మరోసారి తెలంగాణ స్పీకర్‌కు గట్టి వార్నింగ్‌ ఇచ్చింది. 3 వారాల్లోపు నిర్ణయం వెలువరించాలని స్పష్టం చేసింది. లేదంటే తాము కోర్టు ధిక్కరణ కింద చర్యలు తీసుకోవలసి వస్తుందని హెచ్చరించింది. పార్టీ ఫిరాయింపు ఆరోపణలు ఎదుర్కొంటున్న పది మంది ఎమ్మెల్యేలపై అనర్హతవేటు వేయాలని కోరుతూ బీఆర్‌ఎస్‌ పార్టీ  దాఖలు చేసిన పిటిషన్లపై గత ఏడాది అక్టోబరు 31 లోపు నిర్ణయం తీసుకోవాలని సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చింది.  

అయితే స్పీకర్‌ నిర్ణయం తీసుకోకపోవడంతో పాటు సుప్రీం తీర్పును ఉల్లంఘించినందున అసెంబ్లీ స్పీకర్‌ గడ్డం ప్రసాద్‌కుమార్‌పై కోర్టు ధిక్కరణ కింద చర్యలు తీసుకోవాలని బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యే పాడి కౌశిక్‌రెడ్డి, బీఆర్‌ఎస్‌ వర్కిగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌లు గత ఏడాది నవంబరు 10న  మరోసారి పిటిషన్లు దాఖలు చేశారు. వాటిని విచారించిన జస్టిస్‌ సంజయ్‌ కరోల్, జస్టిస్‌ ఏజీ మసీహ్‌లతో కూడిన ధర్మాసనం ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేసింది. జనవరి 16న ఈ కేసు విచారణకు వచ్చింది. ఆ సమయంలో పెండింగ్‌ పిటిషన్లపై స్పీకర్‌ నిర్ణయం తీసుకోవడానికి 4 వారాల సమయం ఇవ్వాలని సీనియర్‌ న్యాయవాది అభిషేక్‌ సింఘ్వీ ధర్మాసనానికి విజ్ఞప్తి చేశారు. అందుకు న్యాయమూర్తులు అంగీకరిస్తూనే కేసును 2 వారాలకు వాయిదా వేశారు. అప్పటివరకు జరిగిన పురోగతిని తమకు తెలపాలని ఆదేశాలిచ్చారు. అందులో భాగంగా ఈ పిటిషన్లు ధర్మాసనం ముందు విచారణకు వచ్చాయి. 

వాదనలు మొదలైన వెంటనే స్పీకర్‌ తరఫున అభిషేక్‌ సింఘ్వీ తన వాదనలు వినిపిస్తూ స్పీకర్‌ ముందు పెండింగ్‌లో ఉన్న అనర్హత పిటిషన్లలో ఒకదానిపై నిర్ణయం వెలువరించారని, మరో రెండింటిపై నిర్ణయం తుది దశలో ఉందని ధర్మాసనానికి తెలిపారు. మున్సిపల్‌ ఎన్నికల కారణంగా బీఆర్‌ఎస్‌ నాయకులు సమయం కోరడం వల్ల ఆ రెండింటిపై నిర్ణయం ఆలస్యమైందని చెప్పుకొచ్చారు. మార్చి రెండో వారానికల్లా వాటిపై నిర్ణయం తీసుకుంటామని వెల్లడించారు. అయితే పిటిషనర్‌ కౌశిక్‌రెడ్డి తరుపు న్యాయవాది మోహిత్‌రావు ఈ వాదనలతో విభేదించారు.

స్పీకర్‌ న్యాయవాదులు వాస్తవాలను వక్రీకరిస్తున్నారని పేర్కొన్నారు. ‘ఓ ఎమ్మెల్యే (దానం నాగేందర్‌) మా పార్టీ తరఫున గెలిచిన తర్వాత 6 నెలల్లోపే కాంగ్రెస్‌ నుంచి ఎంపీగా పోటీచేసి ఓడిపోయారని తెలిపారు. అయినా ఇప్పటికీ మా పార్టీలో కొనసాగుతున్నామని చెబుతున్నారు. ఏ మాత్రం విచారణ అవసరం లేకుండా నిర్ణయం తీసుకోవాల్సిన ఈ కేసులో ఇంత జాప్యం చేయాల్సిన అవసరం ఏముంది? అని ప్రశ్నించారు. అలాగే మరో ఎమ్మెల్యే (కడియం శ్రీహరి) కుమార్తె కాంగ్రెస్‌ నుంచి ఎంపీగా పోటీచేశారు. ఆమె తరఫున ఆ ఎమ్మెల్యే ప్రచారం కూడా చేశారు. ఇందులోనూ జాప్యానికి కారణాలేవీ లేవు’ అని ధర్మాసనం దృష్టికి తీసుకువచ్చారు.

ఈ విషయంలో జస్టిస్‌ సంజయ్‌ కరోల్‌ జోక్యం చేసుకుంటూ 2 వారాల తర్వాత దీనిపై విచారిస్తాని స్పష్టం చేశారు. అయితే సింఘ్వీ 3 వారాల సమయం ఇవ్వాలని కోరారు. వాదనల అనంతరం జస్టిస్‌ సంజయ్‌ కరోల్‌ స్పీకర్‌కు 3 వారాల సమయం ఇస్తూ కేసు విచారణ ముగించారు. ‘ఈసారి స్పీకర్‌ నిర్ణయం తీసుకోవాలి. లేకపోతే మేం కోర్టు ధిక్కరణ కింద చర్యలకు ఉపక్రమిస్తాం’ అని సింఘ్వీని ఉద్దేశించి జస్టిస్‌ వార్నింగ్‌ ఇచ్చారు.  కాగా కోర్టులో జరిగిన వాదనల ఆధారంగా రీల్‌ చేయొద్దని న్యాయమూర్తి జస్టిస్‌ సంజయ్‌ కరోల్‌ పిటిషనర్‌ తరఫు న్యాయవాది మోహిత్‌రావుకు సూచించారు. ఇప్పుడు ఇది (రీల్‌ చేయడం) కొత్త పరిశ్రమగా మారిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. న్యాయవాది స్పందిస్తూ తాను ఇదివరకు ఎప్పుడూ అలా చేయలేదని, ఇక ముందు కూడా చేయబోనని హామీ ఇచ్చారు. 

Advertisment
తాజా కథనాలు