/rtv/media/media_files/2026/06/16/arrest-2026-06-16-19-53-02.jpg)
నారాయణగూడ సర్వే భవన్ డిప్యూటీ డైరెక్టర్ నరహరిని ఏసీబీ అధికారులు అరెస్ట్ చేశారు. భూమి రికార్డుల వ్యవహారాల్లో పెద్ద ఎత్తున అవినీతికి పాల్పడుతున్నారనే ఆరోపణలతో ఏసీబీ అధికారులు ఆయన ఇల్లు, ఆఫీసులపై ఏకకాలంలో దాడులు నిర్వహించారు. సర్వే ల్యాండ్ రికార్డ్స్ మల్టీ జోన్ - 2 డిప్యూటీ డైరెక్టర్ హోదాలో పనిచేస్తున్న నరహరి, ప్రతి భూమి రికార్డు విషయంలో క్రింది స్థాయి సిబ్బందిని అడ్డుపెట్టుకుని పెద్ద ఎత్తున వసూళ్లకు పాల్పడుతున్నట్లు అధికారులకు ఫిర్యాదులు అందాయి.
ఈ ఫిర్యాదుల ఆధారంగా ఏసీబీ డీఎస్పీ గంగసాని శ్రీధర్ నేతృత్వంలోని అధికారుల బృందం రంగంలోకి దిగింది. ఛత్రినాకలోని నరహరి నివాసంతో పాటు, నారాయణగూడలోని సర్వే భవన్ ఆఫీసు, ఆయనకు సంబంధించిన పలు ప్రాంతాల్లో అధికారులు సోదాలు జరిపారు. ఈ సోదాల్లో నరహరి సంపాదించిన అక్రమాస్తులను చూసి అధికారులు సైతం విస్మయానికి గురయ్యారు.
రూ. 1.5 కోట్ల నగదు
నరహరి ఇళ్లు, ఇతర ప్రాంతాల్లో జరిపిన సోదాల్లో దాదాపు రూ. 100 కోట్ల విలువైన అక్రమాస్తులను ఏసీబీ అధికారులు గుర్తించారు. అందులో రూ. 1.5 కోట్ల నగదును స్వాధీనం చేసుకోగా, వివిధ బ్యాంకుల్లో ఉన్న రూ. 2 కోట్ల 29 లక్షల నగదును ఫ్రీజ్ చేశారు. వీటితో పాటు రూ. 5 కోట్ల విలువైన ఫిక్స్‌డ్ డిపాజిట్ బాండ్లను కూడా అధికారులు స్వాధీనం చేసుకున్నారు. ఆదాయానికి మించిన ఆస్తుల కేసు నమోదు చేసిన ఏసీబీ అధికారులు, ఈ అవినీతి తిమింగలాన్ని అరెస్ట్ చేసి విచారణను మరింత వేగవంతం చేశారు.
Follow Us