/rtv/media/media_files/2025/01/27/fJK8rkClY3EbATMFnrgd.jpg)
Karimnagar Municipal Corporation
Municipal Elections: మున్సిపాల్ ఎన్నికల నామినేషన్ల ఉపసంహరణ వేళ అనేక కీలక పరిణామాలు చోటు చేసు కున్నాయి. టికెట్ రాని వారి అలకలు, నాయకుల బుజ్జగింపులు, తిరుగుబాట్లతో రాష్ట్రవ్యాప్తంగా అనేక మున్సిపాలిటీలు, కార్పొరేషన్లలో గందరగోళం నెలకొంది. అన్ని పార్టీల్లోనూ అసంతృప్తుల్ని నాయకులు బుజ్జగింపులతో ఉపసంహరింప జేయాల్సి వచ్చింది. ఎట్టకేలకు 6,701 మంది నామినేషన్లను ఉపసంహరించుకోవడంతో తెలంగాణ మునిసిపల్ ఎన్నికల బరిలో రాష్ట్రంలోని 2,996 వార్డులకు గాను12,993 మంది అభ్యర్థులు పోటీలో నిలిచారు.
రాష్ట్రంలోని 7 కార్పొరేషన్లు, 116 మునిసిపాలిటీల పరిధిలో 2,996 వార్డులకు గాను రాష్ర్టవ్యాప్తంగా అన్ని రాజకీయ పార్టీలకు చెందిన అభ్యర్థులు 20,313 నామినేషన్లు వేశారు. ఆ తర్వాత నామినేషన్ల పరిశీలన, ఉపసంహరణ ప్రక్రియ లు మంగళవారం పూర్తయిన అనంతరం 12,993మంది అభ్యర్థులు బరిలో నిలిచినట్లు రాష్ట్ర ఎన్నికల సంఘం ప్రకటించింది. కాగా, నామినేషన్ల తిరస్క రణ, ఉపసంహరణ ప్రక్రియలో 7,320మంది పోటీ నుంచి తొలగిపోయినట్లయింది.
ఉపసంహరణ వేళ అన్ని ప్రధాన పార్టీలకూ తిరుగుబాట్ల బెడద తప్పలేదు. అయా పార్టీల నాయకులు చాలామందిని బతిమిలాడి ఉపసంహరించుకునేలా చేసినప్పటికీ కొంతమంది నాయకుల మాటను ధిక్కరించి స్వతంత్రులుగా బరిలో నిలిచారు. ఒకే వార్డుకు ఒకే పార్టీ నుంచి నలుగురైదుగురు పోటీపడటంతో అనేక చోట్ల నాటకీయ పరిణామాలు చోటు చేసుకున్నాయి. పార్టీ ఆదేశాలతో కొంతమంది ఉపసంహరించుకున్నప్పటికీ మరికొంతమంది బరిలో ఉండటంతో అభ్యర్థులకు రెబల్ బాధలు తప్పడం లేదు. పెద్దసంఖ్యలో అభ్యర్థులు పోటీ పడుతుండటంతో వారికి సర్దిచెప్పడం అగ్రనాయకులకు తలనొప్పిగా మారింది. దీంతో ఈ తతంగాన్ని అన్ని ప్రధాన పార్టీల నాయకులు హైదరాబాద్‌లోని తమ కార్యాలయాల నుంచే పర్యవేక్షించారు. కాగా ఈ నెల 11న ఎన్నికలు జరగనున్నాయి.
గద్వాలలో బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ లో చేరిన ఎమ్మెల్యే కృష్ణమోహన్‌రెడ్డికి, మాజీ జడ్పీ చైర్మన్ సరిత వర్గాల మధ్య టికెట్ల కేటాయింపులో వివాదం తలెత్తింది. అధిష్టానం కృష్ణమోహన్‌రెడ్డి చేతికి బిఫాంలు ఇవ్వగా ఆయన కాంగ్రెస్ అభ్యర్థులకు మంగళవారం ఉదయమే బీఫాంలు అందజేశారు. అయితే ఈ విషయంలో పార్టీ తీరును తప్పు పట్టిన సరిత వర్గీయులు ఏడుగురు తామూ పోటీలో కొనసాగడానికే నిర్ణయించుకున్నారు. ఇక జగిత్యాల జిల్లాలో కూడా స్థానిక ఎమ్మెల్యే వర్గానికి చెందినవారికే ఎక్కువ సీట్లు దక్కాయని మాజీమంత్రి జీవన్‌రెడ్డి ఆరోపించారు.నిజామాబాద్ జిల్లా ఆర్మూర్‌లో కాంగ్రెస్ టికెట్టు దక్కని నలుగురు ఆశావహులు పోటీలో ఉంటామని చెప్పారు.
Follow Us