Mahesh Kumar Goud: అవకాశాలు రాకున్నా నిరాశ చెందలే.. స్టూడెంట్ లీడర్ నుంచి పీసీసీ చీఫ్‌ వరకు.. మహేశ్ ప్రస్థానం ఇదే!

28 ఏళ్ల వయస్సులోనే విద్యార్థి రాజకీయాల్లో రాష్ట్ర స్థాయికి ఎదిగారు.. ఎమ్మెల్యేగా పోటీ చేశారు.. ఆ తర్వాత పెద్దగా అవకాశాలు రాలేదు. అయినా.. నిరాశ చెందకుండా పార్టీ కోసమే పని చేశారు. స్టూడెంట్ లీడర్ నుంచి పీసీసీ చీఫ్ స్థాయికి ఎదిగిన మహేశ్ కుమార్ గౌడ్ ప్రస్థానంపై స్పెషల్ స్టోరీ

New Update
Mahesh Kumar Goud: అవకాశాలు రాకున్నా నిరాశ చెందలే.. స్టూడెంట్ లీడర్ నుంచి పీసీసీ చీఫ్‌ వరకు.. మహేశ్ ప్రస్థానం ఇదే!

ఏడు నెలలుగా కొనసాగుతున్న సస్పెన్స్ కు కాంగ్రెస్ హైకమాండ్ తెరదించింది. తెలంగాణ పీసీసీ చీఫ్ ను ఖరారు చేసింది. మహేశ్‌ కుమార్ గౌడ్ ను పీసీసీ చీఫ్ గా నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ఈ పదవి కోసం రాహుల్ గాంధీ వద్ద అత్యంత పలుకుబడి కలిగిన మధుయాష్కీ గౌడ్ ఆఖరి నిమిషం వరకు పోటీ పడ్డా.. మహేశ్‌ కుమార్ గౌడ్ పేరు వైపే హైకమాండ్ మొగ్గు చూపింది. కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్న సమయంలో అత్యంత పవర్ ఫుల్ గా భావించే పీసీసీ చీఫ్ పదవికి ఆయనకు దక్కడానికి గల కారణాలు ఏంటనే అంశంపై జోరుగా చర్చ సాగుతోంది. పార్టీకి విధేయతగా ఉండడం.. విద్యార్థి రాజకీయాల నుంచే కాంగ్రెస్ తో ఉండడం ఆయనకు కలిసివచ్చినట్లు తెలుస్తోంది. ఆయన పూర్తి పొలిటికల్ బ్యాగ్రౌండ్ ను ఓ సారి పరిశీలిస్తే..

మహేశ్ కుమార్ గౌడ్ డిగ్రీ చదువుతున్నప్పుడే పాలిటిక్స్ లోకి ప్రవేశించారు. ఆ సమయంలోనే ఎన్‌ఎస్‌యూఐ రాష్ట్ర కార్యర్శిగా నియమితులయ్యారు. 1986లో ఎన్‌ఎస్‌యూఐ నిజామాబాద్ జిల్లా అధ్యక్షుడిగా ఎన్నికయ్యారు. ఆ తర్వాత జాతీయ యువజన కాంగ్రెస్ కార్యదర్శి పదవి ఆయన నియమితులయ్యారు. ఆయన పనితీరును గమనించిన కాంగ్రెస్.. 1994 అసెంబ్లీ ఎన్నికల్లో డిచ్‌పల్లి నుంచి ఎమ్మెల్యే అభ్యర్థిగా బరిలోకి దించింది. అతి తక్కువ వయస్సు ఉన్న అభ్యర్థిగా ఆ సమయంలో అందరి దృష్టిని ఆకర్షించారు మహేశ్‌ కుమార్ గౌడ్. 2013 నుంచి 2014 ఉమ్మడి రాష్ట్రంలో గిడ్డంగుల సంస్థ చైర్మన్‌గా పని చేసే అవకాశం ఆయనకు దక్కింది.

ఆ తర్వాత 2014 ఎన్నికల్లో నిజామాబాద్ అర్బన్ నుంచి ఎమ్మెల్యే అభ్యర్థిగా ఆయనను బరిలోకి దించింది కాంగ్రెస్. ఆ ఎన్నికల్లో బీఆర్ఎస్ అభ్యర్థ గణేశ్‌ చేతిలో ఆయన ఓటమి పాలయ్యారు. అయినా వెనక్కి తగ్గకుండా పార్టీ కోసం పని చేస్తూ వచ్చిన మహేశ్‌ కు.. పీసీసీ సెక్రటరీగా, అధికార ప్రతినిధిగా, పీసీసీ ప్రధాన కార్యదర్శిగా పదవులు దక్కాయి. మరోసారి 2018లో నిజామాబాద్ అర్బన్ టికెట్ ను ఆయన ఆశించారు. అయితే.. అక్కడి నుంచి మైనార్టీలకు అవకాశం ఇవ్వాలని పార్టీ నిర్ణయించడంతో ఆయన పోటీ నుంచి తప్పుకున్నారు. పార్టీ అభ్యర్థి గెలుపుకోసం కృషి చేశారు.

ఆ ఎన్నికల్లో కాంగ్రెస్ మేనిఫెస్టో కమిటీ కన్వీనర్ గా ఆయన పని చేశారు. రేవంత్ రెడ్డి పీసీసీ చీఫ్ గా ఎన్నికైన సమయంలో మహేశ్ కుమార్ గౌడ్ కు వర్కింగ్ ప్రెసిడెంట్ గా ఛాన్స్ దక్కింది. ఆ తర్వాత పీసీసీ ఎన్నికల కమిటీలో సభ్యుడిగా కూడా ఆయన నియమితులయ్యారు. ఆ తర్వాత 2023 ఎన్నికల్లో నిజామాబాద్ అర్బన్ నుంచి పోటీ చేసేందుకు మహేశ్ కుమార్ సిద్ధమయ్యారు. కానీ సినియర్ నేత షబ్బీర్ అలీని పార్టీ అక్కడి నుంచి పోటీకి దించాలని నిర్ణయించింది. దీంతో మరోసారి మహేశ్ కుమార్ గౌడ్ టికెట్ త్యాగం చేయాల్సి వచ్చింది.

దీంతో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటు కాగానే ఆయనకు ఎమ్మెల్సీగా అవకాశం దక్కింది. అయితే.. తెలంగాణకు కొత్త పీసీసీ చీఫ్ రాబోతున్నరనే చర్చ ప్రారంభమైన నాటి నుంచి మహశ్ కుమార్ గౌడ్ పేరు చుట్టే ప్రధానంగా చర్చ సాగింది. రేవంత్ రెడ్డితో పాటు ముఖ్యనేతలందితో సన్నిహితంగా ఉండడం ఆయనకు కలిసివచ్చింది. వివాదరహితుడిగా పేరుండడం, మొదటి నుంచి కాంగ్రెస్ పార్టీలోనే ఉండడం ఆయనకు మరో ప్లస్ పాయింట్ గా మారింది. ఈ నేపథ్యంలో ఆయనకు రాష్ట్ర రాజకీయాల్లో అత్యంత కీలకమైన పీసీసీ చీఫ్‌ పదవి దక్కింది.

Advertisment
Advertisment
తాజా కథనాలు