Telangana Elections 2023: రాజగోపాల్ రెడ్డి రాజకీయం స్టైలే వేరయా!

తెలంగాణలో ఎన్నికల వేళ ఏ నేత ఏపార్టీలో ఉంటాడో, ఎందుకు మారుతాడో అర్థంకాని పరిస్థితులు దాపరించాయి. సరిగ్గా ఎన్నికలకు 40 రోజుల క్రితం బీజేపీ నుంచి కాంగ్రెస్‌కు జంప్‌ చేశాడు కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి. ఉన్న పార్టీని తిట్టడం, పక్క పార్టీని పొగడడం రాజగోపాల్‌రెడ్డికి అలవాటు. ఎన్నికలకు ముందు బీజేపీ బతుకు బస్టాండ్ చేసిన రాజగోపాల్‌రెడ్డి అసలు కాంగ్రెస్‌ను ఎందుకు వదిలిపెట్టాడు? మళ్లీ కాంగ్రెస్‌లోకి ఎందుకు వెళ్తున్నాడు? ఈ ఆర్టికల్‌ చదివి తెలుసుకోండి.

New Update
Telangana Elections 2023: రాజగోపాల్ రెడ్డి రాజకీయం స్టైలే వేరయా!

Telangana Elections 2023: తెలంగాణలో ఎన్నికల కౌంట్ డౌన్‌ మొదలైంది. ఇంకో 40రోజుల్లో ఎన్నికలు. ఎవరు గెలుస్తారో పక్కనపెడితే.. నేతల జంపింగ్ జపాంగ్‌లే ఇపుడు హాట్‌ టాపిక్‌. ఏనేత ఏపార్టీలో ఉంటాడో, అసలు పార్టీ ఎందుకు మారుతాడో అర్థం కాని పరిస్థితి. ఇపుడున్న లీడర్లకు ఎవరికీ సిద్ధాంతాలు లేవు, కమిట్‌మెంట్ అసలే లేదు. పవర్ ఎక్కడుంటే తామూ అక్కడే అంటారు. జంపింగ్‌ల ప్రస్తావన వచ్చింది కాబట్టి మనం ప్రధానంగా ప్రస్తావించుకోవాల్సింది బీజేపీ నేత, కాంట్రాక్టర్ కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి. మనోడి రూటే సపరేటు. ఈయన ఎప్పుడు ఏ పార్టీలో ఉంటాడో, ఎందుకు పార్టీ మారుతాడో అర్థం కాదు. ఈయనలో మరో స్పెషాలిటీ ఏంటంటే ఉన్నపార్టీలోనే చిచ్చులు పెడుతాడు. సొంత పార్టీని తిడుతూ పక్కపార్టీని ఆకాశానికి ఎత్తుతాడు. అసలు కోమటిరెడ్డి రాజగోపాల్‌(Komatireddy Rajagopal Reddy) రాజకీయం ఏంటో ఎవరికీ అర్థం కాని పరిస్థితి.

Also Read: కోమటిరెడ్డి మీద బూర నర్సయ్య పోటీ?

మనోడి రూటే సపరేటూ:
రాజకీయ నాయకులు ఎవరైనా సరే పార్టీ మారిన వెంటనే పాత పార్టీపై దుమ్మెత్తి పోస్తారు. కానీ మనోడు కాస్త డిఫరెంట్. పార్టీలోనే ఉంటూ అదే పార్టీపై విమర్శలు చేస్తాడు. కాంగ్రెస్ మునిగిపోయే పడవ అంటాడు. తెలంగాణలోనే  (Telangana) కాదు, దేశంలోనే ఈపార్టీకి భవిష్యత్‌ లేదూ అంటాడు. కాంగ్రెస్‌లో (Congress) డబ్బులు పెట్టి టిక్కెట్లు తెచ్చుకుంటారు అంటాడు. దేశం మొత్తం మోదీవైపే చూస్తోంది, వచ్చేది బీజేపీ (BJP) సర్కారే అంటూ డైలాగులు కొడుతాడు. కానీ ఎన్నికలకు కొద్దిరోజులు ఉందనగా, కీలక సమయంలో ఇపుడు అదే పార్టీకి పంగనామం పెట్టి కాంగ్రెస్‌లో చేరబోతున్నాడు.

కథ అడ్డం తిరిగింది:
గతేడాది కాంగ్రెస్‌ పార్టీకి, ఎమ్మెల్యే పదవికి మరి రాజీనామా చేసి బీజేపీలోకి వెళ్లాడు కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి. దాంతో మునుగోడుకు ఉపఎన్నిక వచ్చింది. అప్పటికే దుబ్బాక, హుజూరాబాద్‌ ఉపఎన్నికలు గెలిచి బీజేపీ మాంచి ఊపు మీదుంది. మునుగోడు బైపోల్‌ కూడా గెలిచి కేసీఆర్‌ (KCR) సర్కారుకు గట్టి మెస్సేజ్‌ పంపాలనుకుంది. కానీ కథ అడ్డం తిరిగింది. ఎన్నో ఆశలు పెట్టుకున్న రాజగోపాల్‌రెడ్డి ఓడిపోయాడు. బైపోల్ ఓటమిని ఏమాత్రం ఊహించని అధిష్టానం షాక్‌లోకి వెళ్లింది. రాజగోపాల్‌ను గెలిపించడానికి బీజేపీ అధిష్టానం చాలానే కష్టపడింది. ఎన్నడూలేని విధంగా మనుగోడులో వంద కోట్ల రూపాయలను ప్రచారం కోసం వినియోగించింది. కానీ ఏదీ వర్క్‌ఔట్‌ కాలేదు. అటు డబ్బులు పోయాయి, ఇటు ఎన్నికా పోయింది. అలా బీజేపీ బతుకును బస్టాండ్ చేశాడు రాజగోపాల్‌ రెడ్డి.

బండి సంజయ్ మార్పు తర్వాత ఏం జరిగింది?
మునుగోడు ఉపఎన్నికలో బీజేపీ పరాజయం తర్వాత పార్టీలో జరిగిన మరో కీలక పరిణామం అధ్యక్ష మార్పు. ఎన్నికలకు కొద్దిరోజుల ముందు బండి సంజయ్‌ని (Bandi Sanjay) మార్చి కిషన్‌రెడ్డికి (Kishan Reddy) బాధ్యతలు అప్పగించడం సంచలనంగా మారింది. బండి సంజయ్‌ అధ్యక్షుడయ్యాక బీజేపీలో ఎక్కడాలేని జోష్ వచ్చింది. దుబ్బాక, హుజూరాబాద్‌ ఉపఎన్నికల్లో బీజేపీ గెలిచింది. GHMC ఎలక్షన్స్‌లో ఏకంగా 48 కార్పొరేటర్లను గెలిపించి సంచలనం సృష్టించారు బండి సంజయ్‌. బండిని తప్పించాక బీజేపీలో ఆ స్పీడ్ తగ్గింది. కార్యకర్తల్లో జోష్ లేకుండా పోయింది. పార్టీలో యాక్టివిటీ కూడా పడిపోయింది. బండి సంజయ్‌ని తప్పించడానికి కూడా రాజగోపాల్‌రెడ్డే ప్రధాన కారణం. సంజయ్‌ని అధ్యక్ష పదవి నుంచి తప్పించాలని రాజగోపాల్‌రెడ్డి అధిష్టానంపై తీవ్రంగా ఒత్తిడి తెచ్చినట్లు సమాచారం. బండి సంజయ్‌ తమను కలుపుకుని పోవడం లేదని, పార్టీలో ప్రాధాన్యత కరువైందని అధిష్టానానికి ఫిర్యాదు చేశారు. అధ్యక్షుడిని మార్చకపోతే పార్టీని వీడుతామని అధిష్టాననికే వార్నింగ్ ఇచ్చినట్లు టాక్. ఎప్పుడైతే రాజగోపాల్‌రెడ్డి అధ్యక్షుడిని మార్చాలని అధిష్టానంపై ఒత్తిడి మొదలుపెట్టారో.. ఇక అప్పటినుంచి బీజేపీలోనూ గ్రూపులు బయటపడ్డాయి. అప్పటిదాకా అనిగిమనిగి ఉన్న అసంతృప్త నేతలంతా ధిక్కార స్వరాన్ని వినిపించడం మొదలుపెట్టారు.

ఉన్న పార్టీని తిట్టడం అలవాటా?
కోమటిరెడ్డి అధిష్టానంపై వాయిస్ రేజ్ చేయడంతో ఈయనకు మరికొందరు తోడయ్యారు. పార్టీపై అసంతృప్తిగా ఉన్న విజయశాంతి, వివేక్ వెంకటస్వామి, కొండా విశ్వేశ్వర్‌రెడ్డి కోమటిరెడ్డితో కలిసి గ్రూపుగా ఏర్పడ్డారు. పలుమార్లు రహస్య సమావేశాలు కూడా పెట్టుకున్నారు. అంతా కలిసి పార్టీ వీడుతారనే ప్రచారం కూడా జరిగింది. ఇలా బీజేపీలో గ్రూపులు తయారు కావడానికి ప్రధాన కారణం అయ్యారు కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి. జరుగుతుంది చూసి ఆందోళనకు గురైన అధిష్టానం ఈయన్ని బుజ్జగించేందుకు జాతీయ కార్యవర్గంలోకి తీసుకుంది. అయినా కూడా మనోడిలో మార్పు రాలేదు. మునుగోడులో ఓడినప్పటినుంచి పార్టీ వ్యవహరాలకు దూరంగానే ఉంటూ వస్తున్నాడు. పెద్దగా యాక్టివ్‌గా కనిపించింది ఎక్కడా లేదు. కానీ పార్టీ అధిష్టానంపై మాత్రం అసంతృప్తిని వెళ్లగక్కడం కామన్‌ అయిపోయింది. రాజగోపాల్‌రెడ్డి ఏపార్టీలో ఉన్నా ఇంతే. ఉన్న పార్టీని తిట్టడం, పక్క పార్టీని పొగడటం పరిపాటిగా వస్తోంది.

బీజేపీ లెక్కలు బోల్తా
రాజగోపాల్‌రెడ్డి వస్తే ఓ బలమైన నాయకత్వం ఏర్పడుతుంది. పార్టీ బలపడుతుంది. అధికారపార్టీని ఢీకొట్టేందుకు మంచి అవకాశం వస్తుంది. ఇలా బీజేపీ ఎన్నెన్నో లెక్కలేసుకుంది. కానీ రాజగోపాల్‌రెడ్డి పార్టీ మారితే బీజేపీకి పెద్ద దెబ్బ కొట్టినట్లే అవుతుంది. పార్టీని గెలిపించలేదు కదా, లేని గ్రూపులను తయారు చేశాడని ఆ పార్టీలో చర్చ సాగుతోంది. అధిష్టానం అంటే నాయకుల్లో విలువ లేకుండా చేశాడన్న టాక్ కూడా ఉంది. అసలు రాజగోపాల్‌రెడ్డి కాంగ్రెస్‌ను ఎందుకు వదిలిపెట్టాడు? వచ్చి బీజేపీలో ఎందుకు చేరాడు? ఇప్పుడు బీజేపీని వదిలి మళ్లీ కాంగ్రెస్‌లోకి ఎందుకు వెళ్తున్నాడు? అన్న ప్రశ్నలపై కూడా రాజకీయవర్గాల్లో చర్చ సాగుతోంది.

Also Read: PAK vs AFG: చెన్నై బీచ్‌లో కొట్టుకుపోయిన పాకిస్థాన్‌ పరువు.. ఘోరంగా పసికూనల చేతిలో..! - Rtvlive.com

Advertisment
Advertisment
తాజా కథనాలు