smartphones : ఫోన్ లపై ఆఫర్లు, డిస్కౌంట్లు మర్చిపోండి..  నథింగ్ CEO షాకింగ్ కామెంట్స్!

సాధారణంగా టెక్నాలజీ పెరిగే కొద్దీ డిజిటల్ గ్యాడ్జెట్స్, స్మార్ట్‌ఫోన్ల ధరలు తగ్గుతాయని అందరూ భావిస్తారు. కానీ, ప్రస్తుతం మార్కెట్లో పరిస్థితి ఇందుకు పూర్తిగా భిన్నంగా ఉంది. రాబోయే రోజుల్లో స్మార్ట్‌ఫోన్ల ధరలు భారీగా పెరగబోతున్నాయి.

New Update
nothing ceo

సాధారణంగా టెక్నాలజీ పెరిగే కొద్దీ డిజిటల్ గ్యాడ్జెట్స్, స్మార్ట్‌ఫోన్ల ధరలు తగ్గుతాయని అందరూ భావిస్తారు. కానీ, ప్రస్తుతం మార్కెట్లో పరిస్థితి ఇందుకు పూర్తిగా భిన్నంగా ఉంది. రాబోయే రోజుల్లో స్మార్ట్‌ఫోన్ల ధరలు భారీగా పెరగబోతున్నాయని, రాబోయే పండుగ సీజన్లలో ఎలాంటి ఆఫర్లు లేదా డిస్కౌంట్లు ఆశించవద్దని ప్రముఖ స్మార్ట్‌ఫోన్ బ్రాండ్ నథింగ్ సీఈఓ కార్ల్ పీ సంచలన వ్యాఖ్యలు చేశారు. 2027 వరకు ఈ ధరల పెరుగుదల కొనసాగుతుందని ఆయన స్పష్టం చేశారు.

స్మార్ట్‌ఫోన్ తయారీలో ఇప్పటివరకు ప్రాసెసర్లు, డిస్‌ప్లేలు అత్యంత ఖరీదైన భాగాలుగా ఉండేవి. కానీ ఇప్పుడు సీన్ మారింది. ఫోన్లలో వాడే మెమొరీ ధరలు ఆకాశాన్ని తాకుతున్నాయని కార్ల్ పీ తెలిపారు. కొన్ని ఫోన్లలో అయితే మొత్తం హార్డ్‌వేర్ తయారీ ఖర్చులో మెమొరీ చిప్స్ వాటానే 50 శాతం కంటే ఎక్కువగా ఉంటోందని ఆయన పేర్కొన్నారు.  

AI భూమ్ దీనికి ప్రధాన కారణం

ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా నడుస్తున్న AI భూమ్ దీనికి ప్రధాన కారణం. పెద్ద పెద్ద టెక్ కంపెనీలు భారీ ఐఏ డేటా సెంటర్లను, సర్వర్లను నిర్మిస్తున్నాయి. ఈ సర్వర్ల తయారీకి కూడా స్మార్ట్‌ఫోన్లలో వాడే మెమొరీ చిప్స్ అవసరమవుతాయి. గూగుల్, మైక్రోసాఫ్ట్, మెటా వంటి బడా కంపెనీలు రాబోయే కొన్నేళ్లకు సరిపడా మెమొరీ స్టాక్‌ను ఇప్పుడే కొనేస్తుండడంతో మార్కెట్లో తీవ్రమైన కొరత ఏర్పడింది. ఫలితంగా స్మార్ట్‌ఫోన్ బ్రాండ్లకు విడిభాగాల ధరలపై నియంత్రణ లేకుండా పోయింది.  

కార్ల్ పీ తన స్వంత బ్రాండ్‌ను ఉదాహరణగా చూపిస్తూ పరిస్థితి తీవ్రతను వివరించారు. వారి అప్ కమింగ్ మోడల్ Nothing Phone 4a ప్రాజెక్ట్‌ను ఓకే చేసినప్పటి ధరతో పోలిస్తే, అది లాంచ్ అయ్యే సమయానికి మెమొరీ ఖర్చు రెట్టింపు అయింది. ఆ తర్వాత అది మరింత పెరిగింది. 

మార్కెట్లో ఇప్పటికే ధరల పెరుగుదల మొదలైందని ఆయన గుర్తుచేశారు. అంతర్జాతీయ మార్కెట్లో కొత్త ఫోన్ల ధరలు వాటి పాత మోడల్స్ కంటే సుమారు 100 డాలర్ల వరకు ఎక్కువగా లాంచ్ అవుతున్నాయి. ఇక భారతదేశంలో అయితే.. రూ. 30,000 కంటే ఎక్కువ బడ్జెట్ ఉన్న స్మార్ట్‌ఫోన్ల ధరలు ఏకంగా రూ. 7,000 లేదా అంతకంటే ఎక్కువ పెరిగాయని కార్ల్ పీ స్పష్టం చేశారు.

Advertisment
తాజా కథనాలు