టార్గెట్ కేసీఆర్ . ధరణిపైనే ప్రతిపక్షాల ఫోకస్ రానున్న ఎన్నికల్లో ఎవరికి ‘ధరణి’ అస్త్రంగా మారనుంది..రద్దు చేస్తామంటున్న కాంగ్రెస్ కు ఓట్లు రాలుతాయా..బీజేపీ స్టాండ్ అంతేనా!! ఎన్నికల్లో వేడిని డబుల్ చేస్తున్న ధరణి పోర్టల్ తో ఏ పార్టీకి ప్రయోజనం చేకూరబోతుంది..అన్నదాతల ఓట్లు ఎవరి ఖాతాలోకి...!! By P. Sonika Chandra 08 Aug 2023 in రాజకీయాలు టాప్ స్టోరీస్ New Update షేర్ చేయండి ఓ వైపు ఎన్నిలక వేడి రాజుకుంటుంటే..మరోవైపు ప్రతిపక్షాలకు ధరణి ఓ పెద్ద అస్త్రంగా మారుతోంది. దీంతో ధరణి పోర్టల్ పై మరోసారి అధికార ప్రతిపక్షాల మధ్య మాటల యుద్ధం నడుస్తోంది. అధికారంలోకి రాగానే ముందుగా ధరణినే రద్దు చేస్తామని కాంగ్రెస్ లు హామీల మీద హామీ ఇస్తుంటే.. రద్దు చేయం కాని అందులో ఉన్న సమస్యలను పరిష్కరిస్తామని కమలనాథులంటున్నారు. అధికార పక్షం బీఆర్ఎస్ మాత్రం అవకాశం చిక్కినప్పుడల్లా.. ధరణి ప్రయోజనాలను ప్రచారం చేస్తూ.. అంతా సవ్యంగానే ఉందని మెసేజ్ ఇచ్చే ప్రయత్నం చేస్తోంది. అంతే కాదు ధరణి రద్దు చేస్తామన్న పార్టీని గద్దెనెక్కిస్తే.. భూముల సంగతి అంతే సంగతులు అని గులాబీ బాస్ జనానికి హితవు పలుకుతున్నారు. మరి ఈ నేపథ్యంలో ఎన్నికల్లో వేడిని డబుల్ చేస్తున్న ధరణి పోర్టల్ ఎవరికి అస్త్రంగా మారబోతుంది.. దాని పై బీఆర్ఎస్, కాంగ్రెస్, బీజేపీల స్టాండ్ ఏంటి..? అధికారంలోకి రాగానే రద్దంటున్న కాంగ్రెస్.. సర్వం పెంచుతోన్న కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగానే వెంటనే.. ధరణి పోర్టల్ ను నామ రూపాలు లేకుండా రద్దు చేస్తామని అంటోంది. ఇదే విషయాన్ని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి పదే పదే ప్రకటిస్తున్నారు. పేదల లక్షల ఎకరాలను ధరణి పేరుతో బీఆర్ఎస్ ప్రభుత్వం మళ్లించిందని ఆయన తీవ్ర ఆరోపణలు చేశారు.ధరణి పోర్టల్ కారణంగా ఎంతో మంది అమాయక రైతులు నట్టేట మునిగారని.. ప్రతి గ్రామంలో ధరణి బాధితులున్నారని ఆయన ధ్వజమెత్తుతున్నారు. దీంతో ధరణి విషయంలో సర్కార్ ను టార్గెట్ చేయడానికి ప్రత్యేకమైన ప్రణాళికను కాంగ్రెస్ పార్టీ సిద్ధం చేసుకుంది. స్థానికంగా జరుగుతున్న సమావేశాల్లో ధరణి సమస్యలనే హైలెట్ చేస్తోంది ఆ పార్టీ. దోపిడీ చేసేందుకే కేసీఆర్ సర్కార్ ధరణి పోర్టల్ ను తీసుకొచ్చిందన్న కాంగ్రెస్.. ధరణి పోర్టల్ సింపుల్ సాప్ట్ వేర్ కాదని.. దీని వెనుక చాలా పెద్ద కుట్ర దాగుందని ప్రచారం జోరుగా చేస్తోంది. తెలంగాణ భూములకు సంబంధించి వివరాలను కేసీఆర్ సర్కార్ ఓ విదేశీ కంపెనీ చేతుల్లో పెట్టారని రేవంత్ రెడ్డి తీవ్ర ఆరోపణలు చేస్తున్నారు. దీంతో ధరణి పోర్టల్ అంశాన్ని ఓ అస్త్రంగా మార్చుకొని ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోరాటాన్ని కొనసాగిస్తోంది కాంగ్రెస్. రైతు పోరు కార్యక్రమాన్ని మొదలు పెట్టి రుణమాఫీ పొందని అన్నదాతలు, ధరణి పోర్టల్ కారణంగా ఇబ్బందులు పడుతున్న రైతుల పక్షాన పోరాటం చేస్తోంది. త్వరలోనే ధరణి పైల్స్ ను రిలీజ్ చేస్తామని రేవంత్ రెడ్డి అన్నారు. అదే విధంగా ధరణి పోర్టల్ సంస్థలో పెట్టుబడి దారులెవరో కేంద్ర ప్రభుత్వం నిగ్గు తేల్చాలని రేవంత్ రెడ్డి డిమాండ్ చేస్తున్నారు. ధరణి మ్యాటర్లో బీజేపీ స్టాండ్.. ధరణి పోర్టల్ విషయంలో బీజేపీ స్టాండ్ గందరగోళంగా ఉంది. మేము అధికారంలోకి పోర్టల్ ను రద్దుచేయం కాని.. అందులో ఉన్న సమస్యలను మాత్రం పరిష్కరిస్తామని గతంలో టీబీజేపీ అధ్యక్షుడిగా ఉన్న బండి సంజయ్ బహిరంగం ప్రకటించారు. అయితే నాగర్ కర్నూల్ సభలో మాత్రం అందుకు భిన్నంగా ఆ పార్టీ జాతీయ అధ్యక్షుడు నడ్డా.. బీజేపీ రాష్ట్రంలో అధికారంలోకి వస్తే..ధరణిని రద్దు చేస్తామని ప్రకటించడం గందరగోళానికి దారి తీసింది. దీంతో కమలనాథుల మధ్యే క్లారిటీ లేకుండాపోయిందని రాజకీయ వర్గాల్లో అప్పటి నుంచి చర్చ జరుగుతోంది. గట్టిగా తిప్పికొడుతున్న బీఆర్ఎస్... ఇక ప్రతిపక్షాలు ధరణికి వ్యతిరేకంగా చేస్తున్న ప్రచారాన్ని బీఆర్ఎస్ ఎప్పటికప్పుడు తిప్పికొడుతూనే ఉంది. ఈ విషయంలో స్వయంగా గులాబీ బాస్ యే కాంగ్రెస్ ను టార్గెట్ చేస్తున్నారు. ఎవరైతే ధరణిని రద్దు చేస్తామంటున్నారో.. వాళ్లను బంగాళాఖాతంలో వేయాలని పిలుపునిచ్చారు. అంతా సవ్యంగా, సేఫ్ గా కొనసాగుతుంటే.. కావాలని కాంగ్రెస్ ధరణి పై దుష్ప్రచారం చేస్తోందని ఆయన కౌంటర్ ఎటాక్ కు దిగుతున్నారు. బహిరంగ సభల్లో తప్పని సరిగా ధరణి పై గవర్నమెంట్ స్టాండ్ ను తెలియజేస్తూ.. కాంగ్రెస్ కు చురకలంటిస్తున్నారు సీఎం కేసీఆర్. ఇక ధరణిని రద్దు చేస్తే రైతుబంధు, రైతు బీమా వంటి పథకాలు ఆగిపోతాయంటూ బీఆర్ఎస్ అన్నదాతలను కన్ఫ్యూజన్లో పడేస్తోంది. పారదర్శకంగా ఉన్న ధరణిని రద్దు చేస్తే అనేక సమస్యలు వస్తాయని హెచ్చరిస్తోంది. ధరణిని రద్దు చేస్తామని చెబుతున్న పార్టీకి అధికారం ఇవ్వొద్దని కేసీఆర్ ప్రజలను కోరుతున్నారు. ధరణిని వద్దనేది దళారులేనని.. 60 ఏళ్ళ కాంగ్రెస్ పాలనలో బ్రోకర్లదే రాజ్యం నడిచిందని బీఆర్ఎస్ ఎదురుదాడికి దిగుతోంది. మూడేళ్లు కష్టపడి ధరణి పోర్టల్ ను రూపొందించానన్న కేసీఆర్.. రైతు భూమిని ఎవరూ ఆక్రమించకుండా చేశామన్నారు. మరి ఈ నేపథ్యంలో ధరణి పోర్టల్ ఎవరికి అస్త్రంగా మారుతుంది.. ఏ పార్టీకి ప్రయోజనాన్ని చేకూర్చుతుందన్నది తెలంగాణ రాజకీయాల్లో ఆసక్తికరంగా మారింది. #NULL మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి