Kohli: 'నా కల నేడు నిజమైంది'.. కింగ్ కోహ్లీ ఎమోషనల్!

ఐపీఎల్ 2026 ఫైనల్‌లో 42 బంతుల్లో 75 పరుగులతో ఆర్సీబీ విజయానికి విరాట్ కోహ్లీ కీలక పాత్ర పోషించాడు. ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్‌గా నిలిచిన కోహ్లీ, ఐపీఎల్ ట్రోఫీ గెలిపించడం తన కల అని చెప్పాడు. ఆటలో చేసిన మార్పులు, బ్యాటింగ్ విజయానికి కారణమయ్యాయని పేర్కొంటూ ఈ విజయాన్ని జీవితంలో మరపురాని క్షణంగా అభివర్ణించాడు.

New Update
Kohli

Kohli

Kohli: ఐపీఎల్ 2026 ఫైనల్‌లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు విజయానికి ప్రధాన కారణంగా నిలిచిన విరాట్ కోహ్లీ మ్యాచ్ అనంతరం ఎమోషనల్ గా మాట్లాడాడు. తన జీవితంలో ఎన్నో సంవత్సరాలుగా ఎదురుచూసిన క్షణం ఇదేనని, ఈ విజయాన్ని ఎప్పటికీ మరిచిపోలేనని చెప్పాడు.

ఫైనల్‌లో కోహ్లీ అద్భుత ఇన్నింగ్స్

గుజరాత్ టైటాన్స్‌తో జరిగిన ఫైనల్ మ్యాచ్‌లో ఆర్సీబీ 156 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగగా. ఈ ఛేజ్‌లో కోహ్లీ అద్భుతంగా బ్యాటింగ్ చేసి 42 బంతుల్లో 75 పరుగులు సాధించాడు. అతని ఇన్నింగ్స్‌లో 9 ఫోర్లు, 3 సిక్సర్లు ఉన్నాయి. చివరి వరకు క్రీజులో నిలిచి జట్టును విజయతీరాలకు చేర్చాడు. అతని అద్భుత ప్రదర్శనకు గుర్తింపుగా ‘ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్’ అవార్డు కూడా లభించింది.

“ఇది ప్రతి క్రికెటర్ కల”

విజయం తర్వాత మాట్లాడిన కోహ్లీ, ఐపీఎల్ ట్రోఫీ గెలిచే రోజు మైదానంలో ఉండి జట్టును గెలిపించాలని ఎప్పుడూ కలలు కనేవాడినని తెలిపాడు. నేడు ఆ కల నిజమైందని చెప్పాడు. ఫైనల్‌కు ముందు జట్టు మొత్తం చాలా ప్రశాంతంగా ఉందని, తమ ప్రణాళికలపై పూర్తి నమ్మకంతో బరిలోకి దిగామని పేర్కొన్నాడు. అదే విజయానికి కారణమైందని వివరించాడు.

ఆటలో చేసిన మార్పులే విజయ రహస్యం

ఈ సీజన్‌లో తన బ్యాటింగ్ విధానంలో కొన్ని మార్పులు చేసుకున్నట్లు కోహ్లీ తెలిపాడు. ప్రస్తుతం క్రికెట్ చాలా వేగంగా మారుతోందని, యువ ఆటగాళ్లు కొత్త సవాళ్లు విసురుతున్నారని చెప్పాడు. అందుకే తన ఆటను మరింత దూకుడుగా మార్చుకోవాలని నిర్ణయించుకున్నట్లు వెల్లడించాడు. కొత్త షాట్లు నేర్చుకోకపోయినా, ఇప్పటికే ఉన్న షాట్లను ఎక్కువగా ఉపయోగించే ప్రయత్నం చేశానని అన్నాడు.

ఈ సీజన్‌లో తన ఆలోచనా విధానాన్ని మార్చుకున్నానని కోహ్లీ చెప్పాడు. ప్రత్యర్థి జట్టులో ఉన్న అత్యుత్తమ బౌలర్లను కూడా గట్టిగా ఎదుర్కోవాలని ముందుగానే నిర్ణయించుకున్నట్లు వివరించాడు. ఆధునిక క్రికెట్‌లో అదనంగా వచ్చే 20 లేదా 30 పరుగులు మ్యాచ్ ఫలితాన్ని మార్చగలవని, అందుకే మరింత దూకుడుగా ఆడానని తెలిపాడు. ఆ వ్యూహం జట్టు విజయానికి ఉపయోగపడిందని చెప్పాడు.

విమర్శలకు బ్యాట్‌తోనే సమాధానం

గతంలో ఫైనల్ మ్యాచ్‌ల్లో ఆశించిన స్థాయిలో రాణించలేదనే విమర్శలు కోహ్లీపై వచ్చాయి. అయితే ఈసారి కీలక సమయంలో అద్భుత ఇన్నింగ్స్ ఆడి ఆ విమర్శలకు తన బ్యాట్‌తోనే సమాధానం ఇచ్చాడు.

ఆర్సీబీ వరుసగా రెండోసారి టైటిల్ గెలవడంలో కోహ్లీ పాత్ర ఎంతో కీలకంగా నిలిచింది. ఈ విజయాన్ని తన కెరీర్‌లో అత్యంత ప్రత్యేకమైన క్షణాల్లో ఒకటిగా కోహ్లీ తెలిపాడు. అభిమానులు కూడా మరోసారి ఫైనల్ మ్యాచ్‌లో కోహ్లీ తన క్లాస్‌ను నిరూపించాడని ప్రశంసిస్తున్నారు.

Advertisment
తాజా కథనాలు