Vaibhav Sooryavanshi : సూపర్ ఓవర్‌లో భారత్ ఓటమి.. లంక ప్లేయర్‌తో వైభవ్ సూర్యవంశీ ఫైట్!

దంబూళ్ల వేదికగా జరుగుతున్న ట్రై-నేషన్ ఏ సిరీస్‌లో సోమవారం జరిగిన నాలుగో మ్యాచ్‌లో భారత్  ఏ జట్టుకు ఊహించని పరాభవం ఎదురైంది. శ్రీలంక ఏ జట్టుతో జరిగిన ఈ ఉత్కంఠభరితమైన పోరులో భారత్  ఏ జట్టు సూపర్ ఓవర్‌లో ఓటమిని చవిచూసింది.

New Update
vaibhav

దంబూళ్ల వేదికగా జరుగుతున్న ట్రై-నేషన్ ఏ సిరీస్‌లో సోమవారం జరిగిన నాలుగో మ్యాచ్‌లో భారత్  ఏ జట్టుకు ఊహించని పరాభవం ఎదురైంది. శ్రీలంక ఏ జట్టుతో జరిగిన ఈ ఉత్కంఠభరితమైన పోరులో భారత్  ఏ జట్టు సూపర్ ఓవర్‌లో ఓటమిని చవిచూసింది. అంతేకాకుండా, మ్యాచ్ ముగిసిన అనంతరం భారత యువ ఆటగాడు వైభవ్ సూర్యవంశీ, శ్రీలంక ఏ ఆటగాడితో గొడవకు దిగడం ఈ మ్యాచ్‌ను వివాదాస్పదం చేసింది.

మొదట బ్యాటింగ్ చేసిన భారత్ 'ఏ' జట్టు నిర్ణీత 49.2 ఓవర్లలో 265 పరుగులకు ఆలౌట్ అయింది. సూర్యాంశ్ షెడ్గే 72 పరుగులు చేసి టాప్ స్కోరర్‌గా నిలవగా, విప్రాజ్ నిగమ్ 51 పరుగులు జోడించారు. అయితే, విప్రాజ్ నిగమ్ పిచ్‌పైకి రెండుసార్లు నడవడంతో భారత్‌కు 10 పెనాల్టీ పరుగుల జరిమానా పడింది. దీనికి సమాధానంగా శ్రీలంక 'ఏ' జట్టు 50 ఓవర్లలో 9 వికెట్లు కోల్పోయి 265 పరుగులు చేయడంతో స్కోర్లు సమమయ్యాయి. లంక బ్యాటర్ సదీర సమరవిక్రమ 93 పరుగులతో జట్టును ఆదుకున్నాడు.

తీవ్రస్థాయిలో వాదన

మ్యాచ్ టై అయిన తర్వాత సూపర్ ఓవర్ నిర్వహణ విషయంలో కొంత గందరగోళం నెలకొంది. ఈ క్రమంలో భారత కెప్టెన్ తిలక్ వర్మ అంపైర్లతో తీవ్రస్థాయిలో వాదనకు దిగారు. చివరకు సూపర్ ఓవర్ నిర్వహించేందుకు అంపైర్లు నిర్ణయించారు. సూపర్ ఓవర్‌లో శ్రీలంక 'ఏ' జట్టు 16 పరుగులు చేసింది. ఈ ఓవర్‌లో చివరి బంతిని నో-బాల్‌గా ప్రకటించడంపై కెప్టెన్ తిలక్ వర్మ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. 17 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన భారత్ 'ఏ' జట్టు తరఫున వైభవ్ సూర్యవంశీ, సూర్యాంశ్ షెడ్గే విఫలమయ్యారు.

ఈ సూపర్ ఓవర్‌లో సూర్యవంశీకి స్ట్రైక్ ఇవ్వకపోవడం భారత్ చేసిన వ్యూహాత్మక తప్పిదంగా కనిపిస్తోంది. ఫలితంగా శ్రీలంక 'ఏ' జట్టు 7 పరుగుల తేడాతో విజయం సాధించింది. మ్యాచ్ ముగిసిన అనంతరం మైదానంలో వాతావరణం వేడెక్కింది. వైభవ్ సూర్యవంశీ ప్రత్యర్థి జట్టు ఆటగాడితో వాగ్వాదానికి దిగి, ఆవేశంగా గొడవకు దిగడంతో ఈ ఉత్కంఠభరితమైన మ్యాచ్ ఒక చేదు అనుభవంతో ముగిసింది.

Advertisment
తాజా కథనాలు