/rtv/media/media_files/2026/02/15/usa-2026-02-15-19-55-46.jpg)
USA vs NAM
USA vs NAM: చెన్నైలోని చిదంబరం స్టేడియం వేదికగా జరిగిన టీ20 ప్రపంచకప్ 2026 గ్రూప్-ఎ మ్యాచ్‌లో అమెరికా (USA) అద్భుత విజయాన్ని అందుకుంది. నమీబియాపై 31 పరుగుల తేడాతో గెలుపొంది, సూపర్-8 రేసులో తన ఆశలను సజీవంగా ఉంచుకుంది. అమెరికా బ్యాటర్ల మెరుపు ఇన్నింగ్స్‌లు, అద్బుతమైన బౌలింగ్ ఈ విజయంలో కీలక పాత్ర పోషించాయి.
ముందుగా టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న అమెరికా నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 199 పరుగుల భారీ స్కోరు సాధించింది. అమెరికా ఇన్నింగ్స్‌లో సంజయ్ కృష్ణమూర్తి (33 బంతుల్లో 68 నాటౌట్; 4 ఫోర్లు, 6 సిక్సర్లు) విధ్వంసకర ఇన్నింగ్స్‌తో ఆకట్టుకోగా, కెప్టెన్ మోనాంక్ పటేల్ (30 బంతుల్లో 52) అర్ధ సెంచరీతో రాణించాడు. వీరిద్దరి ధాటికి అమెరికా తన టీ20 ప్రపంచకప్ చరిత్రలోనే అత్యధిక స్కోరును నమోదు చేసింది. నమీబియా బౌలర్లలో విల్లెమ్ మైబర్గ్, గెర్హార్డ్ ఎరాస్మస్ చెరో రెండు వికెట్లు పడగొట్టారు.
Imran Khan: ఇమ్రాన్ ఖాన్‌కు సీరియస్.. జైలు నుంచి రహస్యంగా ఆస్పత్రికి తరలింపు
168 పరుగులకే పరిమితం
అనంతరం 200 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన నమీబియా 20 ఓవర్లలో 6 వికెట్లు కోల్పోయి 168 పరుగులకే పరిమితమైంది. ఓపెనర్ లారెన్ స్టీన్‌క్యాంప్ (58) అర్ధ సెంచరీతో పోరాడినప్పటికీ, మిగిలిన బ్యాటర్లు విఫలమవడంతో నమీబియాకు ఓటమి తప్పలేదు. అమెరికా బౌలర్లలో షాడ్లీ వాన్ షాక్‌విక్ 2 వికెట్లు తీయగా, సౌరభ్ నేత్రావల్కర్, అలీ ఖాన్ తలా ఒక వికెట్ సాధించారు. ఈ విజయంతో అమెరికా గ్రూప్-ఎలో 4 పాయింట్లతో నిలిచింది. ఇప్పుడు అమెరికా సూపర్-8కు చేరాలంటే భారత్ లేదా పాకిస్థాన్ తమ తదుపరి మ్యాచ్‌ల్లో ఓడిపోవాల్సి ఉంటుంది. ఇక టీ20 ప్రపంచ కప్ నుంచి నమీబియా నిష్క్రమించింది.
Follow Us