/rtv/media/media_files/2026/05/01/sri-lanka-2026-05-01-10-09-38.jpg)
శ్రీలంకు చెందిన ఇద్దరు అండర్ 19క్రికెటర్లను పోలీసులు అరెస్ట్ చేశారు. కొలంబోలోని ఓ హోటల్ లో మహిళలు స్నానం చేస్తున్న వీడియోలను రికార్డు చేశారన్న ఆరోపణలు వీరిపై ఉండటంతో పోలీసులు వెంటనే అదుపులోకి తీసుకున్నారు. ఆటగాళ్లు బస చేస్తున్న నరహెన్‌పిటలోని హోటల్‌లో ఈ సంఘటన జరిగినట్లు సమాచారం. బాత్‌రూమ్‌లో తమను ఎవరో వీడియో తీస్తున్నారని గుర్తించిన మహిళలు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో ఈ విషయం వెలుగులోకి వచ్చింది. దీంతో క్రికెటర్లను అదుపులోకి తీసుకున్నారు.
అయితే కోర్టు వారికి ఒక్కొక్కరికి 5 లక్షల శ్రీలంక రూపాయల వ్యక్తిగత బాండ్ మీద బెయిల్ మంజూరు చేసింది.ఆటగాళ్లను వారి తొలి విచారణ నిమిత్తం అలుత్కడే మేజిస్ట్రేట్ కోర్టు ముందు హాజరుపరిచారు. ఈ కేసు తదుపరి విచారణ మే 25న జరగనుంది.అయితే ఈ వీడియోలు ఆన్‌లైన్‌లో షేర్ చేశారా అనే విషయంపై నరహెన్‌పిట పోలీసులు ప్రస్తుతం దర్యాప్తు చేస్తున్నారు. మరోవైపు శ్రీలంక క్రికెట్ ఆ ఇద్దరు ఆటగాళ్లపై ఇంకా ఎలాంటి క్రమశిక్షణా చర్యను ప్రకటించలేదు.
క్రికెట్ బోర్డులో భారీ మార్పులు
మరోవైపు, శ్రీలంక క్రికెట్ బోర్డులో కూడా భారీ మార్పులు చోటుచేసుకున్నాయి. బుధవారం ప్రభుత్వం పాత ఆఫీస్ బేరర్లను తొలగించడంతో, ఏప్రిల్ 29న బోర్డు అధ్యక్షుడు శమ్మి సిల్వాతో పాటు ఎగ్జిక్యూటివ్ కమిటీ మొత్తం రాజీనామా చేసింది. ఈ నేపథ్యంలో బోర్డు వ్యవహారాలను పర్యవేక్షించేందుకు ప్రభుత్వం ఒక 'ట్రాన్స్‌ఫర్మేషన్ కమిటీ'ని నియమించింది. ఈ కమిటీలో మాజీ దిగ్గజ క్రికెటర్ కుమార సంగక్కర ప్రధాన ఆకర్షణగా నిలిచారు.
ఈ కమిటీలో సంగక్కరతో పాటు రోషన్ మహానామ, సిద్ధాత్ వెట్టిముని వంటి మాజీ క్రికెటర్లు ఉన్నప్పటికీ, మెజారిటీ సభ్యులు కార్పొరేట్, న్యాయ రాజకీయ రంగాలకు చెందినవారు కావడం విశేషం. మాజీ ఎంపీ ఎరాన్ విక్రమరత్నే ఈ కమిటీకి అధ్యక్షుడిగా వ్యవహరించనున్నారు. ఒకవైపు బోర్డు ప్రక్షాళన జరుగుతుండగా, మరోవైపు యువ క్రికెటర్లు ఇలాంటి అశ్లీల ఆరోపణలతో పట్టుబడటం శ్రీలంక క్రికెట్ ప్రతిష్టను దెబ్బతీసింది. ఇప్పటివరకు ఈ ఆటగాళ్లపై బోర్డు ఎలాంటి క్రమశిక్షణా చర్యలు ప్రకటించలేదు.
Follow Us