BIG BREAKING : బిగ్ షాక్.. రిటైర్మెంట్ ప్రకటించిన శ్రీకర్ భరత్!

ఆంధ్రా రంజీ జట్టు కెప్టెన్, టీమిండియా వికెట్ కీపర్ కేఎస్ భరత్ (32) అంతర్జాతీయ క్రికెట్‌కు రిటైర్మెంట్ ప్రకటించారు. ఇండియా తరఫున ఆడటం తన జీవితంలోనే అత్యంత గౌరవప్రదమైన విషయమని పేర్కొన్నాడు.

New Update
ks bharat

ఆంధ్రా రంజీ జట్టు కెప్టెన్, టీమిండియా వికెట్ కీపర్ కేఎస్ భరత్ (32) అంతర్జాతీయ క్రికెట్‌కు రిటైర్మెంట్ ప్రకటించారు. ఇండియా తరఫున ఆడటం తన జీవితంలోనే అత్యంత గౌరవప్రదమైన విషయమని పేర్కొన్నాడు.

 రిటైర్మెంట్ ప్రకటిస్తూ భరత్ తన ఇన్‌స్టాగ్రామ్‌లో రాసుకొస్తూ.. "ఎంతో గర్వంతో, అంతకు మించిన కృతజ్ఞతతో అంతర్జాతీయ క్రికెట్‌కు రిటైర్మెంట్ ప్రకటిస్తున్నాను. నా దేశానికి ప్రాతినిధ్యం వహించడం నా జీవితంలోనే అతిపెద్ద గౌరవం. ఈ ప్రయాణంలో ఎన్నో సవాళ్లు ఎదురయ్యాయి, కానీ భారత్ తరఫున టెస్టు మ్యాచ్‌ల్లో బరిలోకి దిగిన ప్రతి క్షణం నా కష్టానికి తగిన ప్రతిఫలాన్ని ఇచ్చింది. మా నలుగురి కుటుంబం గత రెండు దశాబ్దాలుగా ఒకే కలను శ్వాసించింది. నా వెన్నంటి నిలిచిన నా సోదరి, అమ్మ, నాన్నలకు నా హృదయపూర్వక ధన్యవాదాలు. వారి ప్రేమ, క్రమశిక్షణ, కష్టానికి ప్రతిరూపమే ఈరోజు నేను" అని ఎంతో ఎమోషనల్ అయ్యారు.

తన కెరీర్‌లో అత్యంత కీలక పాత్ర పోషించిన ముగ్గురు దిగ్గజాలకు భరత్ ప్రత్యేకంగా థాంక్స్ చెప్పారు. ఐపీఎల్‌లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు తరఫున తనకు తొలి అవకాశం ఇచ్చి, ప్రపంచానికి తన టాలెంట్ తెలిసేలా చేసిన తొలి ఐపీఎల్ కెప్టెన్ విరాట్ కోహ్లీకి కృతజ్ఞతలు తెలిపారు. అలాగే తను ఎంతో విలువైన టెస్టు అరంగేట్రం చేసిన సమయంలో కెప్టెన్‌గా ఉన్న రోహిత్ శర్మకు, ఇండియా-ఏ జట్టు నుండి జాతీయ జట్టు వరకు తనకు అండగా నిలిచి మార్గనిర్దేశం చేసిన కోచ్ రాహుల్ ద్రవిడ్‌కు భరత్ ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేశారు. వీటితో పాటు తనకు చిన్నప్పటి నుండి సహకరించిన బీసీసీఐ, ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్, వీడీసీఏ,  గ్రౌండ్స్ మెన్ అందరికీ పేరుపేరునా కృతజ్ఞతలు చెప్పుకొచ్చారు.

టెస్టుల్లో అరంగేట్రం

2023లో ఆస్ట్రేలియాపై జరిగిన ప్రతిష్టాత్మక బోర్డర్-గవాస్కర్ ట్రోఫీలో కేఎస్ భరత్ టెస్టుల్లో అరంగేట్రం చేశారు. భరత్, చివరిగా ఫిబ్రవరి 2024లో విశాఖపట్నంలో ఇంగ్లాండ్‌పై తన చివరి టెస్ట్ మ్యాచ్ ఆడారు. భారత్ తరఫున మొత్తం 7 టెస్ట్ మ్యాచ్‌లు ఆడిన భరత్.. 20.09 సగటుతో 221 పరుగులు చేశారు. వికెట్ కీపర్‌గా 18 క్యాచ్‌లు, ఒక స్టంపింగ్ నమోదు చేశారు.

అంతర్జాతీయ స్థాయిలో బ్యాటింగ్‌లో పెద్దగా రాణించలేకపోయినా, దేశవాళీ క్రికెట్‌లో మాత్రం భరత్‌కు తిరుగులేని రికార్డు ఉంది. 113 ఫస్ట్‌క్లాస్ మ్యాచ్‌ల్లో 36.53 సగటుతో ఏకంగా 6,102 పరుగులు చేశారు. ఇందులో 11 సెంచరీలు, 34 అర్ధసెంచరీలు ఉన్నాయి. ముఖ్యంగా 2014-15 రంజీ ట్రోఫీలో గోవాపై 308 పరుగులు సాధించి, రంజీల చరిత్రలోనే ట్రిపుల్ సెంచరీ కొట్టిన తొలి వికెట్ కీపర్ బ్యాటర్‌గా రికార్డు సృష్టించారు. లిస్ట్-ఏ లో 83 మ్యాచ్‌లాడి 2,692 పరుగులు చేశారు.

Advertisment
తాజా కథనాలు