/rtv/media/media_files/2026/03/10/mishra-2026-03-10-14-54-35.jpg)
టీమిండియా మాజీ క్రికెటర్ అమిత్ మిశ్రా చిక్కుల్లో పడ్డారు. అతనితో పాటుగా,అతని కుటుంబంపై వరకట్న వేధింపులు, ఆత్మహత్యకు ప్రేరేపించడం వంటి అభియోగాలు మోపుతూ ఆయన భార్య గరిమా తివారీ ఉత్తరప్రదేశ్ లోని కాన్పూర్ కోర్టులో ఫిర్యాదు చేశారు. పెళ్లి తర్వాత తన భర్త, అత్తమామల నుండి నిరంతరం శారీరక, మానసిక వేధింపులను ఎదుర్కొంటున్నానని ఆరోపిస్తూ ఆమె తన ఫిర్యాదులో వెల్లడించారు. అమిత్ మిశ్రాతో పాటుగా అతని తల్లి బీనా మిశ్రా, తండ్రి శశికాంత్ మిశ్రా, సోదరుడు అమర్ మిశ్రా, వదిన రీతు మిశ్రా, సోదరి స్వాతి మిశ్రా పేర్లను కూడా అందులో చేర్చారు.
35 ఏళ్ల మోడల్ గరిమా తివారీకి అమిత్ మిశ్రాతో 2019లో ఇన్‌స్టాగ్రామ్ ద్వారా పరిచయం మొదలైంది. దాదాపు మూడేళ్ల పాటు ప్రేమలో ఉన్న వీరిద్దరూ 2021 ఏప్రిల్ 26న కాన్పూర్ క్లబ్‌లో పెళ్లి చేసుకున్నారు. ప్రస్తుతం రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో ఆఫీసర్‌గా పనిచేస్తున్న అమిత్ మిశ్రా, పెళ్లయిన కొద్దిరోజులకే తన అసలు స్వరూపాన్ని బయటపెట్టారని గరిమా తన ఫిర్యాదులో ఆరోపించారు. హోండా సిటీ కారుతో పాటు రూ. 10 లక్షల అదనపు కట్నం కావాలని అమిత్ కుటుంబం తన పుట్టింటి వారిని వేధించినట్లు ఆమె ఫిర్యాదులో పేర్కొన్నారు. తన కుటుంబ సభ్యులు రూ. 2.5 లక్షలు ఇచ్చినప్పటికీ వారి వేధింపులు ఏ మాత్రం ఆగలేదని ఆవేదన వ్యక్తం చేశారు.
మద్యం తాగి తనను కొట్టేవాడని
ఇక తన భర్త అమిత్ తరచూ మద్యం తాగి తనను కొట్టేవాడని, బూతులు తిడుతూ కొన్నిసార్లు భోజనం కూడా పెట్టకుండా ఉంచేవాడని గరిమా సంచలన ఆరోపణలు చేశారు. తాను మోడలింగ్ ద్వారా సంపాదించిన డబ్బును కూడా అమిత్ లాగేసుకునేవాడని, విడాకులు ఇస్తానని బెదిరిస్తూ తీవ్రంగా ఇబ్బంది పెట్టేవాడని ఆమె తెలిపారు. ఈ వేధింపులు భరించలేక తాను తీవ్రమైన డిప్రెషన్‌లోకి వెళ్ళిపోయానని, ఒకానొక దశలో ఫినాయిల్ తాగి ఆత్మహత్యకు కూడా ప్రయత్నించి ఆసుపత్రి పాలయ్యానని ఆమె వివరించారు. ఈ క్రమంలోనే తన కెరీర్‌ను కూడా వదులుకోవాల్సి వచ్చిందని చెప్పారు.
అమిత్ మిశ్రా తనకున్న పలుకుబడిని ఉపయోగించి పోలీసులపై ఒత్తిడి తీసుకురావడంతో, తాను ఎన్నిసార్లు ఫిర్యాదు చేసినా పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేయలేదని గరిమా ఆరోపించారు. దీంతో విసిగిపోయిన ఆమె చివరకు న్యాయం కోసం కోర్టును ఆశ్రయించాల్సి వచ్చింది. గరిమా తరపు న్యాయవాది కరీం అహ్మద్ సిద్ధిఖీ మాట్లాడుతూ, పోలీసులు స్పందించకపోవడం వల్లే తాము అదనపు సివిల్ జడ్జి కోర్టులో ఫిర్యాదు చేశామని తెలిపారు. ఇప్పటికే అమిత్ మిశ్రాపై ఆమె గృహహింస కేసు, అలాగే నెలకు రూ. 50 వేల భరణం, రూ. కోటి పరిహారం కోరుతూ మెయింటెనెన్స్ పిటిషన్ కూడా దాఖలు చేశారు.
Follow Us