నిజాంసాగర్‌ ప్రాజెక్టు నుంచి నీరు విడుదల చేసిన స్పీకర్‌ పోచారం

వర్షాలు ఆలస్యమైనప్పటికీ నిజాంసాగర్‌ ప్రాజెక్టు ఆయకట్టు రైతులకు కేసీఆర్‌ ప్రభుత్వం భరోసా కల్పించింది. ప్రాజెక్టు పరిధిలో సాగుకు రైతన్నలు సిద్ధమై, ఇప్పటికే నారుమళ్లు వేసుకున్న తరుణంలో ఇంకా వర్షాల జాడ లేకపోవడంతో ఆందోళన చెందుతున్నారు.

New Update
నిజాంసాగర్‌ ప్రాజెక్టు నుంచి నీరు విడుదల చేసిన స్పీకర్‌ పోచారం

Speaker Pocharam who released water from Nizamsagar project

సాగుకు ఇబ్బందిలేదు

నేడు వానాకాలం సీజన్‌ కోసం నిజాంసాగర్‌ ప్రాజెక్టు నుంచి 1500 క్యూసెక్కుల నీటిని స్పీకర్‌ పోచారం శ్రీనివాస్‌రెడ్డి విడుదల చేశారు. అనంతరం మాట్లాడుతూ సాగర్‌లో ప్రస్తుతం 5 టీఎంసీల నీరు ఉందని తెలిపారు. అవసరమైతే మరో 5 టీఎంసీల నీటిని కొండపోచమ్మ సాగర్ నుంచి తెప్పించి.. ఆయకట్టు కింద ఉన్న 1.5 లక్షల ఎకరాలకు నీరు అందిస్తామన్నారు. దీనికి సీఎం కేసీఆర్ ఇప్పటికే అంగీకరించారని స్పీకర్‌ వెల్లడించారు.

నిజాంసాగర్‌లో సరిపడా నీరు 

ఈనెల19న సీఎం కేసీఆర్‌ను కలిసిన స్పీకర్‌ పోచారం.. నిజాంసాగర్‌ ఆయకట్టు కింద నారు మడులు వేసుకున్నారని, ఇక్కడ ముందస్తు సాగు చేసుకుంటారని నీటిని విడుదల చేయాలని కోరారు. వెంటనే స్పందించిన సీఎం సాగర్‌ నుంచి నీటి విడుదలకు అంగీకరించారు. ప్రాజెక్టు ఆయకట్టు కింద బాన్సువాడ, బీర్కూర్‌, వర్ని, నిజాంసాగర్‌, నస్రుల్లాబాద్‌, కోటగిరి, చందూర్‌ మండలాల్లోని రైతులు వరి నారు పోసుకున్నారు. ఆయా భూములకు వరినాట్ల కోసం సాగర్‌ నుంచి ప్రధాన కాలువ ద్వారా నీటిని అందించనున్నారు. నాట్లతో పాటు 3 తడులకు సరిపడా నీరు నిజాంసాగర్‌లో ఉన్నందున 3 విడుతల్లో నీటని విడుదల చేయనున్నారు.

కొండపోచమ్మ సాగర్‌ నుంచి నీరు

ప్రస్తుతం నిజాంసాగర్‌లో 5 టీఎంసీల నీరు నిల్వ ఉంది. ఈ నీరు పంటల సాగుకు 3 తడుల కోసం సరిపోతుంది. ఒకవేళ వర్షాభావ పరిస్థితులు ఏర్పడిన పక్షంలో నిజాంసాగర్‌లో నీరు నిల్వ ఉండడం కష్టమే. దీంతో ముందస్తు జాగ్రత్తగా స్పీకర్‌ సీఎం దృష్టికి ఈ విషయం తీసుకెళ్లారు. వెంటనే స్పందించిన సీఎం నిజాంసాగర్‌కు కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారా కొండ పోచమ్మసాగర్‌ను నింపి అక్కడి నుంచి 5 టీఎంసీల నీటిని నిజాంసాగర్‌కు పంపిస్తామని హామీ ఇచ్చారు. కొండపోచమ్మసాగర్‌లో ప్రస్తుతం 9 టీఎంసీల నీరు ఉంది.

కాళేశ్వరం లిఫ్ట్‌ ద్వారా నీరు

అవసరమైతే ఇంకొన్ని టీఎంసీల నీటిని కాళేశ్వరం లిఫ్ట్‌ ద్వారా నింపేందుకు ప్రభుత్వం నిర్ణయించింది. దీంతో వానకాలంలో నిజాంసాగర్‌ ప్రాజెక్టు ఆయకట్టు పరిధిలోని భూ ములకు సరిపడా నీరు నిల్వ ఉంటుంది. మంజీరా పరీవాహక ప్రాంతాల్లో వర్షాలు పుష్కలంగా కురిసిన పక్షంలో నిజాంసాగర్‌లోకి నీరు వస్తుంది. లేని పక్షంలో కొండపోచమ్మ సాగర్‌ నుంచి నీరు రానున్నది. దీంతో రైతులు నిర్భయంగా పంటలను సాగు చేయడానికి సిద్ధమవుతున్నారు. ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటిమట్టం 17.80 టీఎంసీలు కాగా.. ప్రస్తుతం 4.94 టీఎంసీలు వద్ద ఉన్నదని డీఈఈ శ్రావణ్‌కుమార్‌ తెలిపారు.

Advertisment
Advertisment
తాజా కథనాలు