AP: RTVతో సౌదీ బాధితురాలు.. దయచేసి 'నా భర్తను కూడా కాపాడండి'..మూడు నెలల నుంచి..

గల్ఫ్ దేశం వెళ్లి చిక్కుకుపోయిన ఏలూరు జిల్లా ఆగిరిపల్లికి చెందిన జుబేర్ భార్య మెహరున్నీసా సేఫ్‌గా ఇంటికి చేరుకున్నారు. సౌదీ రోడ్ల మీద ఏకాకిలా తిరుగుతున్న 'నా భర్తను కూడా కాపాడండి' అంటూ ఆమె మంత్రి లోకేష్ ను వేడుకున్నారు. ఏజెంట్‌ వల్లే తమ బతుకులు నాశనం అయ్యాయని వాపోయారు.

New Update
AP: RTVతో సౌదీ బాధితురాలు.. దయచేసి 'నా భర్తను కూడా కాపాడండి'..మూడు నెలల నుంచి..

వివరాల్లోకి వెళ్తే.. ఏలూరు జిల్లా ఆగిరిపల్లికి చెందిన జుబేర్, మెహరున్నీసా దంపతులు పొట్టకూటి కోసం గల్ఫ్ దేశం వెళ్లి చిక్కుకుపోయారు. ఏజెంట్లు మోసం చేయడంతో సౌదీలో కొన్ని నెలలుగా నరకయాతన అనుభవించారు. గత 9 నెలల క్రితం డ్రైవర్ గా పని చేసేందుకు జుబేర్ సౌదీ వెళ్లాడు. అయితే, తన యజమాని పాస్ పోర్ట్ తీసుకొని ఉద్యోగం ఇచ్చాడు. కొన్ని నెలలుగా జీతం ఇవ్వకుండా యజమాని తీవ్రంగా హింసించాడు. జీతం అడిగితే విచక్షణారహితంగా కొడుతున్నారని, కనీసం తిండి కూడా పెట్టడం లేదని జుబేర్ ఆవేదన వ్యక్తం చేస్తోన్నాడు.

తాను అనుభవిస్తోన్న నరకయాతనను ఓ వీడియో ద్వారా విజయవాడలోని బంధువులకు పంపాడు బాధితుడు జుబేర్. తన భార్యను కూడా ఉద్యోగం ఇస్తామని చెప్పి సౌదీ తీసుకెళ్లారని, అక్కడ నుంచి మస్కట్ పంపేసారని వీడియోలో చెప్పాడు. తనను, తన భార్య మెహరున్నీసాను కాపాడాలని వేడుకున్నాడు. స్థానిక మహిళా నాయకురాలి సాయంతో విజయవాడ సెంట్రల్ ఎమ్మెల్యే బోండా ఉమకు ఈ సమస్య తెలిసింది. వెంటనే స్పందించి మంత్రి నారా లోకేష్ కు ఫిర్యాదు చేశారు. మంత్రి నారా లోకేష్ చొరవతో జుబేర్ భార్య మెహరున్నీసాను ఇండియాకు తీసుకొచ్చారు. గత రాత్రి ఏలూరు జిల్లా ఆగిరిపల్లికి మెహరున్నీసా చెరుకుంది.

Also Read: కడపలో అమానుషం.. కుమార్తె చేతులపై వాతలు పెట్టిన కసాయి తల్లి..!

RTVతో జుబేర్ భార్య మెహరున్నీసా మాట్లాడుతూ కన్నీటిపర్యంతం చెందారు. 'నేను అసలు ఇండియాకు వస్తానని అస్సలు అనుకోలేదు. మూడు నెలల నుంచి నాకు నరకయాతన అంటే ఏంటో చూపించారు. ఇక్కడ మూర్తి అనే ఏజెంట్ ద్వారా ఉన్న ఇల్లు తాకట్టు పెట్టి రూ.3 లక్షలు కట్టి సౌదీ వెళ్ళాను. మొదట నన్ను నా భర్తకు దగ్గరగానే ఉద్యోగం ఇస్తామని చెప్పారు. తీరా అక్కడికి వెళ్ళాక నన్ను సౌదీ నుంచి మస్కట్ పంపేశారు. ఇదేంటీ అని అడిగితే తీవ్రంగా కొట్టి చిత్రహింసలు పెట్టేవారు. "నిన్ను మీ ఏజెంట్ మాకు అమ్మేశాడు. మేము చెప్పినట్టు చేయకపోతే నిన్ను చంపేస్తాం" అని బెదిరించేవారు.

'ఒక మహిళ అని కూడా లేకుండా చెప్పుకోలేని విధంగా హింసించారు. ఇంక నా జీవితం అయిపోయింది అనుకున్నాను. కానీ మంత్రి నారా లోకేష్ చొరవతో వాళ్లే నాకు టికెట్ వేసి ఇండియాకు పంపేశారు. నేను మళ్ళీ నా పిల్లల్ని చూస్తానని ఊహించలేదు. అక్కడ నాతోపాటు ఇంకా చాలా మంది తెలుగు అమ్మాయిలు కూడా ఉన్నారు. వాళ్ళందరి పరిస్థితి కూడా ఇదే. నా భర్త కూడా అన్ని చిత్రహింసలు పడుతున్నాడని నాకు ఇండియా వచ్చే వరకూ తెలియదు. ఇండియాకు వచ్చాక నా భర్తతో మాట్లాడాను. అక్కడ ఆయన పరిస్థితి చాలా ఘోరంగా ఉంది. గత రెండు వారాలుగా సౌదీ రోడ్ల మీద ఏకాకిలా తిరుగుతున్నాడు. దయచేసి నా భర్తను కూడా కాపాడాలని వేడుకుంటున్నాను. అలాగే అక్కడ నాలాగా ఇబ్బంది పడుతోన్న అమ్మాయిలను కూడా కాపాడి ఇండిమాకు తీసుకురావాలని ప్రభుత్వాన్ని వేడుకుంటున్నాను. ఏజెంట్ ల వల్లే మా బతుకులు నాశనం అయ్యాయి. అలాంటి ఏజెంట్ లను కఠినంగా శిక్షించాలి. మళ్ళీ ఇంకో అమ్మాయికి ఇలా జరగకుండా ఉండేలా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని ప్రార్ధిస్తున్నాను' అంటూ తన బాధను చెప్పుకొచ్చారు.

Advertisment
Advertisment
తాజా కథనాలు