రాష్ట్రంలో శాంతి భద్రతలకు భంగం వాటిల్లింది.. ప్రధానికి ఫిర్యాదు చేస్తాం

శుక్రవారం పుంగనూరులో జరిగిన ఘటన రాష్ట్ర వ్యాప్తంగా సంచలనంగా మారింది. ఈ ఘటనపై స్పందించిన టీడీపీ ఎంపీ.. రాష్ట్రంలో శాంతి భద్రతలు దెబ్బతిన్నాయన్నారు. పోలీసులు అధికార పార్టీకి తొత్తులుగా పని చేస్తున్నారని విమర్శించారు. మాజీ సీఎంకు భద్రత కల్పించడంలో పోలీసులు విఫలమయ్యారన్నారు.

New Update
రాష్ట్రంలో శాంతి భద్రతలకు భంగం వాటిల్లింది.. ప్రధానికి ఫిర్యాదు చేస్తాం

చిత్తూరు జిల్లా పుంగనూరులో శుక్రవారం జరిగిన ఘటన వల్ల రాష్ట్రంలో శాంతి భద్రతలకు భంగం వాటిల్లిందా..? రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళన చేస్తున్న ఇరు పార్టీ నేతలపై పోలీసులు ఎలాంటి కేసులు నమోదు చేశారు..? పోలీసులు అధికార పార్టీ నేతల చెప్పుచేతల్లో ఉన్నారని టీడీపీ నేతలు వాదిస్తున్నారు. ఈ ఘటనపై వారి ఇళ్లల్లో భయం పట్టుకుందా..? చంద్రబాబుపై అధికారులు ఎందుకు ఫైరయ్యారు. రక్షించాల్సిన వాళ్లే భయపడితే పరిస్థితి ఏంటి..? ఎంపీ కేశినేని ఎవరికి ఫిర్యాదు చేయబోతున్నారు..

పుంగనూరులో జరిగిన హింసాకాండ రాష్ట్ర వ్యాప్తంగా పాకింది. ఆంధ్రప్రదేశ్‌లోని ప్రతీ జిల్లాలో టీడీపీ, వైసీపీ మధ్య ఘర్షణలు కొనసాగుతున్నాయి. పోటా పోటీగా ధర్నాలు చేస్తున్న నేతలు.. ఎదురు పడితే దాడులు చేసేందుకు సైతం వెనుకాడటంలేదు. శుక్రవారం జరిగిన దాడిపై టీడీపీ ఎంపీ కేశినేని నాని స్పందించారు. రాష్ట్రంలో శాంతి భద్రతలకు భంగం వాటిల్లిందన్నారు. శాంతి భద్రతలు లేకుంటే అభివృద్ధి ఎలా జరుగుతుందని ప్రశ్నించారు. ప్రతిపక్ష నేత జిల్లాల్లో పర్యటించే స్వేచ్ఛ లేకుండా పోయిందని ఆయన ఆరోపించారు. టీడీపీ ఎంపీల బృందం సోమవారం ప్రధానిని కలుస్తామని, పుంగనూరు ఘటనతో పాటు రాష్ట్రంలో శాంతి భద్రతలపై చర్చిస్తామన్నారు. మరోవైపు ఈ ఘటనతో ప్రజల్లో వైసీపీపై వ్యతిరేకత ఏర్పడుతోందన్నారు. పోలీసులు వైసీపీ నేతలను ఎందుకని అడ్డుకోలేదని ఎంపీ ప్రశ్నించారు.

మరోవైపు టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడిపై ఏపీ పోలీసు అధికారుల సంఘం ఆగ్రహం వ్యక్తం చేసింది. పుంగనూరు ఘటనను ఏపీ పోలీసు అధికారుల సంఘం అధ్యక్షుడు శ్రీనివాస్‌రావు తీవ్రంగా ఖండించారు. మీ రాజకీయాల కోసం తమపై దాడులు చేయడం ఏంటని ఆయన ప్రశ్నించారు. పుంగనూరులో పోలీసులపై దాడికి పాల్పడినవారిని అరెస్ట్‌ చేయాలని శ్రీనివాస్‌రావు డీజీపీని కోరారు. శుక్రవారం జరిగిన దాడిలో కొందరు పోలీసులపై ఉద్దేశపూర్వకంగానే దాడి చేశారన్నారు. ఈ దాడితో తమ ఇళ్లల్లో భయం పట్గుకుందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. శాంతి భద్రతలు కాపాడాలని తాముచూస్తుంటే.. రాజకీయ పార్టీల నేతలు తమపై దాడి చేయడం ఏంటన్నారు. పుంగనూరు ఘటనలో 50 మంది పోలీసులు గాయపడ్డారని, ఇందులో 13 మంది ఆస్పత్రిలో చేరగా.. ముగ్గురి పరిస్థితి విషమంగా ఉందని వెల్లడించారు. 14 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉన్న చంద్రబాబు నాయుడు పోలీసులను అసభ్యకరంగా దూషించారన్నారు. డీఎస్పీ స్థాయి అధికారిని బట్టలిప్పాలనడం దుర్మార్గమన్నారు. పోలీసులు ఏ పార్టీకి అనుకూలంగా వ్యవహరించరన్నారు. టీడీపీ హయాంలో ఉన్న పోలీస్‌ వ్యవస్థలో తాము ఉన్నామన్న రాష్ట్ర పోలీస్‌ సంఘ అధ్యక్షుడు.. తాము ఎప్పుడూ సహనం కోల్పోలేదన్నారు. చంద్రబాబు మాటలు తమకు బాధ కల్గించాయని, చంద్రబాబును తక్షణమే అరెస్ట్‌ చేయాలని ఆయన డిమాండ్‌ చేశారు.

Advertisment
Advertisment
తాజా కథనాలు