రాష్ట్రపతిని కలిసిన విపక్ష ‘ఇండియా’ కూటమి సభ్యులు.... ఆ అంశంపై జోక్యం చేసుకోవాలని విజ్ఞప్తి...!

New Update
రాష్ట్రపతిని కలిసిన విపక్ష ‘ఇండియా’ కూటమి సభ్యులు.... ఆ అంశంపై జోక్యం చేసుకోవాలని విజ్ఞప్తి...!

ప్రతిపక్ష ఇండియా కూటమి నేతలు బుధవారం రాష్ట్రపతి ద్రౌపది ముర్మును కలిశారు. గడిచిన కొన్ని వారాల్లో మణిపూర్ లో పరిస్థితి తీవ్ర దశకు చేరుకుందని రాష్ట్రపతికి నేతలు తెలిపారు. రాష్ట్రంలో శాంతి భద్రతలు పూర్తిగా నశించాయని ఆవేదన వ్యక్తం చేశారు. అందువల్ల మణిపూర్ సమస్య పరిష్కారం కోసం జోక్యం చేసుకోవాలని రాష్ట్రపతిని కోరారు. మణిఫూర్‌లో శాంతి భద్రతలను పునరుద్దరించేలా చూడాలని రాష్ట్రపతికి విజ్ఞప్తి చేశారు.

ఈ సందర్బంగా రాష్ట్రపతికి విపక్ష నేతలు ఒక మెమోరాండం అందజేశారు. మణిపూర్‌లో నెలకొన్న పరిస్థితులపై పార్లమెంట్ లో ప్రధాని మోడీ ప్రస్తావించేలా సూచించాలని మెమోరాండంలో కోరారు. సభలో మణిపూర్ అంశంపై చర్చకు అనుమతించేలా చూడాలన్నారు. మణిపూర్ లో ఇప్పుడు తీవ్రమైన పరిస్థితులు నెలకొన్నాయని చెప్పారు.

సోషల్ మీడియాలో మణిపూర్ మహిళల వీడియోలను చూసి దేశం మొత్తం షాక్ కు గురైందన్నారు. మణిపూర్ లో శాంతి భద్రతలు కాపాడటంలో పోలీసులు, పాలకులు విఫలమయ్యారని చెప్పేందుకు ఆ వీడియోలే నిదర్శనమన్నారు. ఆ దారుణంపై విచారణ చేపట్టి, నిందితులను అరెస్టు చేయడంలో రెండు నెలల ఆలస్యం జరిగిందన్నారు. దీంతో సమస్య మరింత తీవ్రంగా మారిందన్నారు.

మణిపూర్ లో హింస ప్రభావం చాలా తీవ్రంగా వుందన్నారు. రాష్ట్రంలో హింసాత్మక ఘటనల్లో సుమారు 200 మంది ప్రాణాలు కోల్పోయారన్నారు. 500 మందికి పైగా గాయపడ్డారని, 5000 ఇండ్లు కాలి బూడిదయ్యాయన్నారు. సుమారు 60 వేల మంది నిరాశ్రయులయ్యారని, వాళ్లంతా ఇప్పుడు పునరావాస కేంద్రాల్లో బిక్కు బిక్కు మంటు బతుకుతున్నారని చెప్పారు. మణిపూర్ అంశంపై చర్చించాలన్న తమ డిమాండ్లను ఉభయ సభలు తిరస్కరించాయన్నారు. అందుకే పార్లమెంట్ లో ఆ అంశంపై అనుమతించేలా చూడాలని రాష్ట్రపతిని విపక్ష సభ్యులు కోరారు.

Advertisment
Advertisment
తాజా కథనాలు