Olympic Games Paris 2024: ఈ సారి గోల్డ్ కొడతారా.. టీమిండియా హాకీ జట్టుపై కోటి ఆశలు! ఈ ఒలింపిక్స్‌లో భారత్ హాకీ జట్టు కచ్చితంగా గోల్డ్ లేదా సిల్వర్ గెలుచుకుంటుందని అభిమానులు ఎన్నో ఆశలు పెట్టుకున్నారు. భారత జట్టులో అనుభవజ్ఞులు, యువ ఆటగాళ్లు ఉండడంతో అంచనాలు భారీగా పెరిగిపోయాయి. By Nikhil 24 Jul 2024 in ఇంటర్నేషనల్ నేషనల్ New Update షేర్ చేయండి ఆగస్టు 5, 2021..! 41 ఏళ్ల సుదీర్ఘ నిరీక్షణకు భారత హాకీ జట్టు తెరదించిన రోజు అది.. టోక్యో ఒలింపిక్స్ కాంస్య పతక పోరులో జర్మనీని ఓడించిన టీమిండియా మెన్స్ టీమ్ 1980 తర్వాత ఒలింపిక్స్‌లో పతకాన్ని గెలుచుకుంది. ఇది జరిగి మూడేళ్లు గడిచినా ఇప్పటికీ అభిమానులు ఆ స్వీట్ విక్టరీని గుర్తు చేసుకుంటూనే ఉన్నారు. ఇంతలోనే ప్యారీస్ ఒలింపిక్స్ వచ్చేశాయి. ఈ మూడేళ్లలో టీమిండియా హాకీ జట్టు ప్రయాణం పడుతూ లేస్తూ సాగింది. అయితే ఈసారి భారత్ జట్టు కచ్చితంగా గోల్డ్ లేదా సిల్వర్ గెలుచుకుంటుందని అభిమానులు ఎన్నో ఆశలు పెట్టుకున్నారు. ఒలింపిక్స్‌లో ఏదైనా గేమ్ నుంచి ఒక్క గోల్డ్ గెలిస్తేనే ప్రపంచాన్నే ఓడించనంతా సంబరపడిపోయే దేశం మనది. అలాంటిది ఒక గేమ్‌లో టీమిండియా ఏకంగా ఎనిమిది సార్లు గోల్డ్ గెలిచిందని తెలుసా? దాదాపు 50ఏళ్ల పాటు హాకీలో ఇండియా తిరుగులేని ఆధిపత్యం చెలాయించింది. అయితే మారిన రూల్స్‌తో పాటు దేశంలో హాకీకి ప్రభుత్వాల నుంచి అండ లేకపోవడంతో ఈ ఆట పతకాల వేటలో భారత్ క్రమక్రమంగా పతనమవతూ వచ్చింది. ఓ సమయంలో పరిస్థితి ఎంత దిగజారిందంటే అసలు ఒలింపిక్స్‌లో ఆడేందుకే భారత జట్టు కనీసం అర్హత సాధించలేనంతగా..! అయితే ఇంత పతనమైనా తర్వాత గోడకేసి కొట్టిన బంతిలా లేచింది టీమిండియా. అందుకే గత టోక్యో ఒలింపిక్స్‌లో మూడోస్థానంలో నిలవగలిగింది. భారత జట్టు ఇటీవలి కాలంలో ఆశించిన స్థాయిలో ఆడలేదనే చెప్పాలి. బ్రిటన్, జర్మనీ లాంటి జట్లపై ఓడిపోయింది. అయితే ఒలింపిక్స్‌లో భారత్‌గ్రూ ప్‌లో ఉన్న అర్జెంటీనాపై టీమిండియా ఆధిపత్యం చెలాయించింది. ఇక హాంగ్‌జౌ ఆసియా క్రీడల్లో భారత్ ఫైనల్‌లో జపాన్‌ను 5-1తో ఓడించి స్వర్ణం గెలవడమే కాకుండా ప్యారిస్ ఒలింపిక్స్‌కు అర్హత సాధించింది. భారత జట్టులో అనుభవజ్ఞులు, యువ ఆటగాళ్లు ఉన్నారు. ఓవైపు గోల్‌కీపర్ పీఆర్ శ్రీజేష్, మన్‌ప్రీత్ సింగ్, కెప్టెన్ హర్మ్‌ప్రీత్ సింగ్ లాంటి వెటరన్ ఆటగాళ్లు ఉన్నారు. మాజీ కెప్టెన్లు శ్రీజేష్, మన్‌ప్రీత్‌లకు ఇది నాలుగో ఒలింపిక్స్. ఇటు సంజయ్, రాజ్ కుమార్ పాల్,సుఖ్‌జిత్ సింగ్ తమ డెబ్యూ ఒలింపిక్ గేమ్స్‌లో అద్భుతంగా రాణించేందుకు తహతహలాడుతున్నారు. ఇలా యువ, అనుభవజ్ఞులైన ఆటగాళ్ల కలయిక భారత్‌కు కచ్చితంగా ప్లస్ కానుంది. భారత హాకీ జట్టు పూల్-బీలో ఉంది. ఈ గ్రూప్‌లో భారత్‌తో పాటు న్యూజిలాండ్, అర్జెంటీనా, ఐర్లాండ్, బెల్జియం, ఆస్ట్రేలియా ఉన్నాయి. పూల్-ఎలో నెదర్లాండ్స్, జర్మనీ, బ్రిటన్, స్పెయిన్, దక్షిణాఫ్రికా, ఆతిథ్య దేశం ఫ్రాన్స్ ఉన్నాయి. న్యూజిలాండ్, అర్జెంటీనా, ఐర్లాండ్‌లతో మ్యాచ్‌లను కచ్చితంగా ఇండియా గెలిస్తే బెటర్. ఎందుకంటే బెల్జియం, ఆస్ట్రేలియాపై గెలవాలంటే చాలా కష్టపడాల్సి ఉంటుంది. జూలై 27న న్యూజిలాండ్‌తో జరిగే మ్యాచ్‌తో భారత హాకీ జట్టు ఒలింపిక్స్‌ను ప్రారంభించనుంది. ఆ తర్వాత జూలై 29న అర్జెంటీనాతో ఫైట్ చేయనుంది. జులై 30న ఐర్లాండ్‌తో, ఆగస్టు 1న బెల్జియంతో, ఆగస్టు 2న ఆస్ట్రేలియాతో భారత్ తలపడనుంది. మొదటి మూడు మ్యాచ్‌లు గెలిస్తే తర్వాత రౌండ్‌కు వెళ్లే అవకాశాలు చాలా ఎక్కువగా ఉన్నాయి. పారిస్ ఒలింపిక్స్ 2024 కోసం భారత హాకీ జట్టు గోల్‌కీపర్: పిఆర్ శ్రీజేష్. డిఫెండర్లు: జర్మన్‌ప్రీత్ సింగ్, అమిత్ రోహిదాస్, హర్మన్‌ప్రీత్ సింగ్, సుమిత్, సంజయ్. మిడ్‌ఫీల్డర్లు: రాజ్‌కుమార్ పాల్, షంషేర్ సింగ్, మన్‌ప్రీత్ సింగ్, హార్దిక్ సింగ్, వివేక్ సాగర్ ప్రసాద్. ఫార్వర్డ్: అభిషేక్, సుఖ్‌జిత్ సింగ్, లలిత్ కుమార్ ఉపాధ్యాయ్, మన్‌దీప్ సింగ్, గుర్జంత్ సింగ్. ప్రత్యామ్నాయ ఆటగాళ్లు: నీలకాంత్ శర్మ, జుగ్రాజ్ సింగ్, కృష్ణ బహదూర్ పాఠక్. #NULL మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి