Nindha : నింద మూవీ రివ్యూ.. వరుణ్ సందేశ్ సందేశాత్మక చిత్రం ఎలా ఉందంటే..?

వరుణ్ సందేశ్ హీరోగా యధార్థ సంఘటనల ఆధారంగా తెరకెక్కిన తాజా చిత్రం నింద. ప్రమోషనల్ కంటెంట్ తో మంచి హైప్ తెచ్చుకున్న ఈ మూవీ నేడు థియేటర్స్ లో రిలీజ్ అయింది. ఈ సినిమా ప్రేక్షకులను ఏ మేర మెప్పించిందో ఈ సమీక్షలో తెలుసుకుందాం.

New Update
Nindha : నింద మూవీ రివ్యూ.. వరుణ్ సందేశ్ సందేశాత్మక చిత్రం ఎలా ఉందంటే..?

Nindha Movie Review : సినిమాల మీద ప్యాషన్‌తో అమెరికాలో ఉద్యోగం మానేసి సినిమాను నిర్మిస్తూ దర్శకత్వం వహించాడు రాజేష్ జగన్నాథం. వరుణ్ సందేశ్‌ను మెయిన్ లీడ్‌గా పెట్టి నింద అనే చిత్రాన్ని తీశాడు రాజేష్ జగన్నాథం. ఈ చిత్రం జూన్ 21న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. కాండ్రకోట మిస్టరీ అంటూ తీసిన ఈ చిత్రం ఎలా ఉందో ఓ సారి చూద్దాం.

కథ
బాలరాజు (ఛత్రపతి శేఖర్)కు మంజు (క్యూ మధు)ని రేప్ అండ్ మర్డర్ చేశారన్న కేసులో ఉరి శిక్ష పడుతుంది. కానీ ఆ శిక్ష వేసిన జడ్జ్ (తనికెళ్ల భరణి)కి మాత్రం అతను తప్పు చేయలేదనిపిస్తుంది. కానీ సాక్ష్యాధారాలన్నీ కూడా బాలరాజు నేరస్థుడని చెబుతాయి. దీంతో ఉరి శిక్ష విధిస్తాడు. ఇక ఆ జడ్జ్ కొడుకు వివేక్ (వరుణ్ సందేశ్) మానవ హక్కుల కమిషన్‌లో పని చేస్తుంటాడు. ఈ కేసు గురించి చెప్పడంతో.. అసలు నేరస్థుడ్ని పట్టుకునేందుకు బయల్దేరుతాడు. వివేక్ చేసిన ఈ ప్రయాణంలో ఎదుర్కొన్న సవాళ్లు ఏంటి? అసలు నేరస్థుడిని కనిపెడతాడా? ఈ కేసు వెనకాలున్న అసలు కోణం ఏంటో తెలుసుకుంటాడా? అన్నది కథ.

నటీనటులు
వరుణ్ సందేశ్‌కు ఇలాంటి పాత్ర చాలా కొత్త. ఇంత వరకు మనం వరుణ్ సందేశ్‌ను లవర్ బాయ్ ఇమేజ్‌లోనే చూశాం. కానీ ఇందులో వరుణ్ సందేశ్ చాలా సీరియస్‌గా కనిపిస్తాడు. ఎంతో సెటిల్డ్‌గా నటిస్తాడు. వివేక్ పాత్రకు సరిగ్గా సరిపోయాడు. ఇక బాలరాజుగా ఛత్రపతి శేఖర్ తన అనుభవాన్ని చూపించాడు. క్యూ మధు, అన్నీ, శ్రేయ రాణి పాత్రలు బాగుంటాయి. జడ్జ్‌గా తనికెళ్ల భరణి, మైమ్ మధు ఇలా ఇతర పాత్రలన్నీ కూడా బాగుంటాయి.

విశ్లేషణ
కాండ్రకోట మిస్టరీ బేస్డ్ సినిమా అని, యధార్థ సంఘటనల ఆధారంగా తీసిన చిత్రమని ముందు నుంచీ హైప్ పెంచేశారు. దానికి తగ్గట్టుగానే టీజర్, ట్రైలర్‌లు మరింత ఆసక్తిని పెంచేశాయి. దానికి తోడు వరుణ్ సందేశ్‌కు ఇది చాలా కొత్త పాత్ర.. కొత్త సినిమా. దీంతో ఆడియెన్స్‌లో ఇంట్రెస్ట్ ఏర్పడింది. నింద మూవీకి రిలీజ్ కంటే ముందే పాజిటివ్ వైబ్ ఏర్పడింది. ఆ పాజిటివ్ వైబ్ సినిమాలోనూ కనిపించింది. సినిమా ప్రారంభం కాస్త స్లోగా అనిపిస్తుంది.. కానీ నెమ్మదిగా పుంజుకుంటుంది.

ఏ తప్పు చేయకపోయినా, ఎవరో చేసిన తప్పుకు అమాయకులు బలై.. జైలుకు వెళ్లే సీన్లు, కథలు ఇది వరకు మనం ఎన్నో చూశాం. ఈ నింద కూడా అలాంటి కథతోనే ఉంటుంది. పాయింట్ పాతదే అయినా కథనంలో ఓ కొత్తదనం చూపించాడు. ట్విస్టులు బాగుంటాయి. ఫస్ట్ హాఫ్ అంతా వివేక్ కొంతమందిని కిడ్నాప్ చేసి వాళ్ళని భయపెట్టి వాళ్ళతో మాట్లాడటమే సాగుతుంది. అలా ఫస్ట్ హాఫ్ కొంత బోరింగ్‌గా అనిపించొచ్చు. ఇంటర్వెల్ కార్డ్ కూడా చాలా సింపుల్‌గానే అనిపిస్తుంది.

ఇక సినిమాకు సెకండ్ హాఫ్ బలంగా నిలుస్తుంది. ద్వితీయార్దంలో కథ ఆసక్తిగా సాగుతుంది. అసలు బాలరాజు, మంజు ఎవరు? వాళ్ళ కథలేంటి? వివేక్ కిడ్నాప్ చేసిన వాళ్ళ కథలేంటి?ఇలా ఒక్కో చిక్కు ముడు విప్పుతూ ముందుకు కథను తీసుకెళ్తారు. క్రైమ్, సస్పెన్స్ థ్రిల్లర్ సినిమాలు రెగ్యులర్‌‌గా చూసేవాళ్లకు మాత్రం ట్విస్ట్ అర్థమైపోతుంది. క్లైమాక్స్‌లో ఊహించని ఎండింగ్ ఇచ్చాడు దర్శకుడు. తప్పు చేయని వాడికి శిక్ష పడకూడదు అనే పాయింట్‌ను డైరెక్టర్ బాగానే అల్లుకున్నాడు.

టెక్నికల్‌గా చూసుకుంటే.. విజువల్స్ బాగుంటాయి. తక్కువ లొకేషన్స్‌లో చక్కగా చిత్రీకరించారు. ఆర్ఆర్ బాగుంటుంది. పాటలు, మాటలు బాగుంటాయి. స్క్రీన్ ప్లే చాలా కొత్తగా ఉంటుంది. నిర్మాణ విలువలు గొప్పగా అనిపిస్తాయి. కొత్త నిర్మాత అయినా, మొదటి సినిమానే అయినా అద్భుతంగా తెరకెక్కించి నిర్మించాడు.

రేటింగ్ : 3

Advertisment
Advertisment
తాజా కథనాలు