పోలీస్‌స్టేషన్‌ సాక్షిగా ప్రేమజంటపై తల్లిదండ్రుల దాడి

పెద్దలను ఎదిరించి ప్రేమ పెళ్లి చేసుకున్న ఓ జంటకు చేదు అనుభవం ఎదురైంది. ఈ ఘటన జోగుళాంబ గద్వాల జిల్లా కేంద్రంలో చోటు చేసుకుంది. గద్వాలకు చెందిన ప్రశాంత్, మండలంలోని పూడూరుకు చెందిన శిరీష ఐదేళ్లుగా ప్రేమించుకుంటున్నారు. ఇరువురి ఇళ్లలో పెద్దలను ఒప్పించి పెళ్లి చేసుకోవాలనుకున్నారు. అయితే తమ తల్లిదండ్రుల నుంచి రక్షణ కోరుతూ పోలీస్‌ స్టేషన్‌కు వెళ్లగా యువతి కుటుంబీకులు పోలీస్‌ స్టేషన్‌లోనే వారిపై దాడికి పాల్పడ్డారు.

New Update
పోలీస్‌స్టేషన్‌ సాక్షిగా ప్రేమజంటపై తల్లిదండ్రుల దాడి

యువకుడు ప్రశాంత్‌ తల్లిదండ్రులు రెండు నెలల క్రితం ఇద్దరికీ వివాహం చేద్దామని యువతి తల్లిదండ్రులతో మాట్లాడగా.. ఇద్దరి కులాలు వేరు కావడంతో అభ్యంతరం వ్యక్తం చేశారు. దాంతో మేజర్లయిన ప్రేమికులు ఈ నెల 8న ఎవరికీ చెప్పకుండా వెళ్లిపోయారు. 9న కర్నూలు జిల్లా పాలబుగ్గ సమీపంలోని ఆలయంలో పెళ్లి చేసుకున్నారు. అనంతరం ఇంటికి వచ్చేందుకు, తమ ఇద్దరికి ప్రాణరక్షణ కల్పించాలంటూ గద్వాల రూరల్‌ పోలీస్‌స్టేషన్‌కు మంగళవారం చేరుకున్నారు. చేరుకున్నాక అమ్మాయి తల్లిదండ్రులు బలవంతంగా అమ్మాయిని లాక్కెళ్లే ప్రయత్నం చేశారు.

పోలీసులు ఇరువురి కుటుంబసభ్యులను స్టేషన్‌కు పిలిపించి నచ్చజెప్పారు. అయితే యువతి కుటుంబసభ్యులు బలవంతంగా ఆమెను లాక్కెళ్లే ప్రయత్నం చేశారు. ఈ క్రమంలో తోపులాట జరగ్గా.. ఆమె కుటుంబసభ్యులు పోలీస్‌స్టేషన్‌లోని ఫర్నిచర్‌ ధ్వంసం చేసి యువకుడి కుటుంబసభ్యులపై దాడికి పాల్పడ్డారు. పోలీసు సిబ్బంది అడ్డుకోగా.. వెంటనే రక్షణ కోసం సమీపంలోని ఎస్పీ కార్యాలయానికి రోడ్డు వెంట ఆ ప్రేమజంట పరుగులు తీసింది. ఇదంతా ఇప్పుడు హాట్ టాఫిక్‌గా మారింది. అంతేకాకుండా ఇది చూసిన పలువురు ఇద్దరు ఇష్టపడి పెళ్లి చేసుకున్నాక ఇంకా తల్లిదండ్రుల అభ్యంతరం ఏంటని నిలదీశారు.

ఎస్పీ సృజన వద్దకు వెళ్లి జరిగిన విషయం అంతా వివరించగా వెంటనే ఎస్పీ వాళ్లిద్దరూ మేజర్లు కావడంతో వారికి రక్షణ కల్పించే బాధ్యత పోలీస్‌ శాఖపై ఉందన్నారు. భవిష్యత్‌లో వారిపై దాడి చేయడం, అవమానపర్చడం, విడదీసే ప్రయత్నం వంటివి చేస్తే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని ఎస్పీ హెచ్చరించారు. అనంతరం ఇరువురి కుటుంబ సభ్యులను పట్టణ పోలీస్‌స్టేషన్‌కు తీసుకెళ్లి కౌన్సెలింగ్‌ ఇప్పించారు. ఈ ఘటనపై న్యాయపరమైన చర్యలు తీసుకుంటామని ఎస్పీ ఆ జంటకు హామీ ఇచ్చారు.

Advertisment
Advertisment
తాజా కథనాలు