పరువునష్టం కేసులో రాహుల్ గాంధీకి చుక్కెదురు పరువు నష్టం కేసులో కాంగ్రెస్ అధినేత రాహుల్ గాంధీకి గుజరాత్ హైకోర్టు షాక్ ఇచ్చింది. అయితే గతంలో మోదీపై చేసిన వ్యాఖ్యలను పరిగణలోకి తీసుకొని తనపై నమోదైన పరువు నష్టం కేసులో ఇరుక్కున్న సంగతి తెలిసిందే. అయితే ఆ కేసును నిలిపివేసేందుకు గుజరాత్ హైకోర్టు ససేమిర అంటూ తన అప్పీల్‌ను తిరస్కరించింది. కింది స్థాయి కోర్టు తీర్పును సమర్థిస్తూ స్టే పిటీషన్‌ని కొట్టిపారేసింది. By Shareef Pasha 07 Jul 2023 in రాజకీయాలు Scrolling New Update షేర్ చేయండి ప్రధాని మోదీ ఇంటిపేరుపై కాంగ్రెస్ నేత రాహుల్ చేసిన వ్యాఖ్యలు అప్పట్లో తీవ్ర దుమారం రేపాయి. దీనికి సంబంధించిన పరువు నష్టం కేసులో కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీకి ఎదురుదెబ్బ తగిలింది. తనకు విధించిన రెండేళ్ల శిక్షను నిలిపివేయాలంటూ వేసిన స్టే పిటిషన్‌ను గుజరాత్ హైకోర్టు కొట్టేసింది. ఈ కేసులో సెషన్స్ కోర్టు ఇచ్చిన తీర్పును ఉన్నత న్యాయస్థానం సమర్థించింది. ‘రాహుల్ ఇప్పటికే దేశవ్యాప్తంగా 10 కేసులను ఎదుర్కొంటున్నారు. ఇక ఈ కేసులో ఆయనకు కిందికోర్టు శిక్ష విధించడం సరైనదే, న్యాయపరమైనదే. ఈ శిక్షను నిలిపివేసేందుకు ఎలాంటి కారణాలు కన్పించట్లేదు. అందుకే పిటిషనర్ అభ్యర్థనను కొట్టివేస్తున్నాం’’అని హైకోర్టు జస్టిస్ హేమంత్ ప్రచక్ తీర్పు వెలువరించారు. రాహుల్‌పై అనర్హత వేటు జైలు శిక్షపై స్టే ఇవ్వకపోవడంతో రాహుల్‌పై అనర్హత వేటు కొనసాగుతుంది. వచ్చే ఏడాది లోక్‌సభ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో గుజరాత్ హైకోర్టు తీర్పు కాంగ్రెస్ పార్టీకి పెద్ద ఎదురుదెబ్బనే చెప్పాలి. అయితే ఇదిలా ఉంటే.. ఈ కేసులో రాహుల్ ఇప్పుడే జైలుకు వెళ్లే ఛాన్స్ లేనట్లు తెలుస్తోంది. శిక్ష అమలును హోల్డ్ చేస్తూ గతంలో న్యాయస్థానం ఆయనకు కాస్త ఊరటనిచ్చింది. కాగా.. గుజరాత్ హైకోర్టు తీర్పుపై రాహుల్ గాంధీ సుప్రీంకోర్టుకు వెళ్లనున్నట్లు కాంగ్రెస్ వర్గాలు వెల్లడించాయి. తీవ్ర దుమారం రేపిన రాహుల్ చేసిన వ్యాఖ్యలు అయితే రాహుల్ మోదీని ఏమన్నాడంటే..దొంగలందరికీ మోదీ అనే ఇంటిపేరే ఎందుకు ఉంటుందో?’అంటూ 2019 లోక్‌సభ ఎన్నికల ప్రచారం సందర్భంగా కర్ణాటకలోని కోలార్‌లో రాహుల్ చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపిన విషయం తెలిసిందే. ఈ వ్యాఖ్యలకు గానూ గుజరాత్ భాజపా ఎమ్మెల్యే పూర్ణేశ్ మోదీ సూరత్ న్యాయస్థానంలో పరువునష్టం దావా వేశారు. దీనిపై విచారణ చేపట్టిన ట్రయల్ కోర్టు ఆయనకు రెండేళ్ల జైలు శిక్ష విధిస్తూ ఈ ఏడాది మార్చిలో తీర్పు వెలువరించింది. ప్రజా ప్రాతినిధ్య చట్టం 1951 ప్రకారం, పార్లమెంటు సభ్యులు ఏదైనా కేసులో దోషిగా తేలి.. కనీసం రెండేళ్ల శిక్ష పడితే అనర్హత వేటు పడుతుంది. దీంతో ట్రయల్ కోర్టు తీర్పు వెలువర్చిన 24 గంటల్లోనే రాహుల్‌పై అనర్హత వేటు వేస్తూ లోక్‌సభ సచివాలయం నిర్ణయం తీసుకుంది. దీంతో ఆయన లోక్‌సభ సభ్యత్వం రద్దయింది. రాహుల్‌కు నిరాశే కాగా.. ట్రయల్ కోర్టు తీర్పుపై రాహుల్ సూరత్ సెషన్స్ కోర్టును ఆశ్రయించారు. రెండేళ్ల జైలు శిక్షను నిలుపుదల చేయాలని.. అలాగే తనను దోషిగా తేలుస్తూ ఇచ్చిన తీర్పును సైతం నిలిపివేయాలంటూ రెండు పిటిషన్లు దాఖలు చేశారు. వీటిపై ఏప్రిల్‌లో విచారణ జరిపిన సెషన్స్ కోర్టు ఆయనకు బెయిల్ మంజూరు చేసింది. అయితే, జైలు శిక్షపై స్టే ఇచ్చేందుకు మాత్రం నిరాకరించింది. దీంతో ఆయన గుజరాత్ హైకోర్టును ఆశ్రయించగా.. అక్కడ కూడా రాహుల్‌కు నిరాశే ఎదురైంది. #NULL మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి