Rajesh Mehta : రూ. 15 కోట్ల భారీ స్కామ్.. సెబీ చేతిలో చిక్కిన గోల్డ్ కింగ్ రాజేష్ మెహతా!

దేశంలోనే అతిపెద్ద బంగారం ఎగుమతి సంస్థ అయిన రాజేష్ ఎక్స్‌పోర్ట్స్ లిమిటెడ్, దాని మేనేజింగ్ డైరెక్టర్ రాజేష్ మెహతాపై మార్కెట్ రెగ్యులేటర్ సెబీ తీవ్రమైన చర్యలు తీసుకుంది.

New Update
sebi

దేశంలోనే అతిపెద్ద బంగారం ఎగుమతి సంస్థ అయిన రాజేష్ ఎక్స్‌పోర్ట్స్ లిమిటెడ్, దాని మేనేజింగ్ డైరెక్టర్ రాజేష్ మెహతాపై మార్కెట్ రెగ్యులేటర్ సెబీ తీవ్రమైన చర్యలు తీసుకుంది. కంపెనీ లాభనష్టాల లెక్కల్లో భారీగా తప్పుడు సమాచారం చూపించడం, ప్రమోటర్లకు సంబంధించిన ఇతర సంస్థల ద్వారా కంపెనీ నిధులను దారి మళ్లించడం వంటి తీవ్రమైన ఆరోపణలపై సెబీ ఒక ఇంటర్రిమ్ ఆర్డర్ జారీ చేసింది. 

109 పేజీలతో కూడిన ఈ ఆర్డర్‌లో.. రాజేష్ ఎక్స్‌పోర్ట్స్ సంస్థ గత కొన్ని ఏళ్లుగా కావాలనే నకిలీ లావాదేవీలు సృష్టించిందని, అకౌంటింగ్ నిబంధనలను ఉల్లంఘించిందని సెబీ హోల్ టైమ్ మెంబర్ కమలేష్ చంద్ర వర్ష్ణే స్పష్టం చేశారు. ఈ కంపెనీ 2021 ఆర్థిక సంవత్సరం నుండి 2025 ఆర్థిక సంవత్సరం మధ్య కాలంలో ఏకంగా రూ. 15.15 కోట్ల మేర తప్పుడు రాబడిని చూపించింది. కంపెనీ మొత్తం బిజినెస్‌లో దాదాపు 99.8% శాతం రాబడి కేవలం పేపర్ల మీదే సృష్టించిన తప్పుడు లెక్కలని, ఇందులో ఎంతమాత్రం నిజం లేదని సెబీ తేల్చింది. ఈ లెక్కలు చూసే ఇన్వెస్టర్లు మోసపోయారని సెబీ ఆగ్రహం వ్యక్తం చేసింది.

ఎవరీ రాజేష్ మెహతా?

రాజేష్ మెహతా 1964 జూన్ 20న బెంగళూరులో జన్మించారు. ఇండియా బంగారం,  జ్యువెలరీ పరిశ్రమలో అత్యంత ప్రముఖ వ్యాపారవేత్తగా ఎదిగారు. బెంగళూరులోని సెయింట్ జోసెఫ్ స్కూల్‌లో చదువుకున్న ఆయన, ఉన్నత చదువులకు వెళ్లకుండా చిన్న వయసులోనే తండ్రి జ్యువెలరీ వ్యాపారంలోకి అడుగుపెట్టారు. 1980వ దశకంలో జ్యువెలరీ మార్కెట్ అంతా అసంఘటితంగా ఉన్న సమయంలో.. రాజేష్ మెహతా ఆయన సోదరుడు ప్రశాంత్ కలిసి తమ పెద్దన్నయ్య దగ్గర కేవలం రూ. 1,200 అప్పు తీసుకుని వెండి ఆభరణాల వ్యాపారాన్ని ప్రారంభించారు. ఆ చిన్న వ్యాపారమే కాలక్రమేణా సౌత్ ఇండియాలోనే కాకుండా గుజరాత్, ముంబై మార్కెట్లలో కూడా ఒక పెద్ద హోల్‌సేల్ వెండి వ్యాపార సామ్రాజ్యంగా మారింది.

ఆ తర్వాత 1995లో రాజేష్ ఎక్స్‌పోర్ట్స్ ఐపీఓ ద్వారా స్టాక్ మార్కెట్లోకి అడుగుపెట్టి రూ. 10 కోట్లు సేకరించింది. అక్కడనుంచి వెనక్కి తిరిగి చూసుకోకుండా బంగారం క్లీనింగ్ దగ్గరనుంచి, తయారీ, రిటైల్ బిజినెస్ వరకు అన్నింట్లోకి విస్తరించింది. 2015లో స్విట్జర్లాండ్‌కు చెందిన ప్రపంచంలోనే అతిపెద్ద గోల్డ్ రిఫైనరీ సంస్థ వాల్‌కంబిని $400 మిలియన్ల (దాదాపు రూ. 2600 కోట్లు) నగదు చెల్లించి కొనుగోలు చేయడంతో రాజేష్ మెహతా పేరు ప్రపంచవ్యాప్తంగా మార్మోగిపోయింది. ఫోర్బ్స్ లెక్కల ప్రకారం 2019 నాటికి ఆయన ఆస్తి విలువ దాదాపు 1.57 బిలియన్ డాలర్లుగా ఉంది.

ఈ స్కామ్ బయటకు రావడంతో రాజేష్ ఎక్స్‌పోర్ట్స్ షేర్లు మార్కెట్‌లో దారుణంగా పడిపోయాయి. ఈ ప్రభావం ప్రభుత్వ రంగ బీమా దిగ్గజం ఎల్‌ఐసీ పై కూడా పడింది. ఎందుకంటే రాజేష్ ఎక్స్‌పోర్ట్స్ కంపెనీలో LIC కి ఏకంగా 10.80% శాతం వాటా ఉంది. సెబీ ఆర్డర్ దెబ్బకు రాజేష్ ఎక్స్‌పోర్ట్స్ షేర్లు 5% పైగా పడిపోవడంతో, LIC షేర్లు కూడా 1% పైగా నష్టపోయాయి. లక్షలాది మంది ప్రజల సొమ్ము దాగి ఉన్న ఎల్‌ఐసీకి ఈ స్కామ్ పెద్ద తలనొప్పిగా మారింది. 

Advertisment
తాజా కథనాలు