/rtv/media/media_files/2026/05/09/vck-vijay-2026-05-09-13-26-09.jpg)
తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల ఫలితాల తర్వాత అక్కడ ప్రభుత్వం ఏర్పాటుపై తీవ్ర ఉత్కంఠ నెలకొంది. దళపతి విజయ్ నేతృత్వంలోని టీవీకే పార్టీకి స్పష్టమైన మెజారిటీ రాకపోవడంతో.. కింగ్‌మేకర్‌గా మారిన విడుతలై చిరుతైగల్ కట్చి (VCK) మద్దతు ఇప్పుడు అత్యంత కీలకంగా మారింది. ఈ నేపథ్యంలో విజయ్ పార్టీ ముందు వీసీకే కొన్ని సంచలన డిమాండ్లు ఉంచడంతో ఈ పార్టీ ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారింది. ఈ నేపథ్యంలో అసలు వీసీకే పార్టీ నేపథ్యం ఏంటి?
కింగ్‌మేకర్‌గా మారిన VCK పూర్తి పేరు విడుతలై చిరుతైగల్ కట్చి. ఇది నేరుగా రాజకీయ పార్టీగా పుట్టలేదు. దళిత హక్కుల రక్షణ కోసం, ముఖ్యంగా ఉత్తర తమిళనాడులో దళితులపై జరుగుతున్న అణచివేతను ఎదిరించడానికి 1980ల చివరలో సామాజిక పోరాట యోధుడిగా పేరొందిన డాక్టర్ తోల్ తిరుమావళవన్ నేతృత్వంలో ఈ ఉద్యమం ఊపిరి పోసుకుంది. బాబాసాహెబ్ అంబేద్కర్ సామాజిక న్యాయ సిద్ధాంతాలు, పెరియార్ ఆత్మగౌరవ భావజాలాన్ని పునాదిగా చేసుకుని, 1989లో లిబరేషన్ పాంథర్స్ ఆవిర్భవించింది. ఆ తర్వాత, కేవలం ఉద్యమాలతోనే కాకుండా చట్టసభల్లో గళం విప్పితేనే అణగారిన వర్గాలకు పూర్తి న్యాయం జరుగుతుందన్న లక్ష్యంతో 1999 నుంచి ఈ సంస్థ ప్రత్యక్ష ఎన్నికల రాజకీయాల్లోకి అడుగుపెట్టింది. తమిళనాడులోని దళిత సామాజిక వర్గాలతో పాటు తమిళ జాతీయవాదం, శ్రీలంక తమిళుల హక్కులు, మైనారిటీల హక్కులపై వీసీకే నిరంతరం పోరాడుతోంది. ఈ పార్టీకి కేంద్ర ఎన్నికల సంఘం కుండ గుర్తు కేటాయించింది.
2026 ఏప్రిల్ లో జరిగిన ఎన్నికల హోరాహోరీ పోరులో భాగంగా వీసీకే రెండు అసెంబ్లీ స్థానాలను కైవసం చేసుకుంది. కట్టుమన్నార్ కోయిల్ (SC) నియోజకవర్గంలో వీసీకే అభ్యర్థి ఎల్.ఇ. జ్యోతిమణి తన సమీప పీఎంకే (PMK) అభ్యర్థి ఎ. శోజన్‌పై దాదాపు 33,000 పైచిలుకు ఓట్ల భారీ మెజారిటీతో ఘన విజయం సాధించారు. తిండివనం (SC) నియోజకవర్గంలో వీసీకే అభ్యర్థి వన్ని అరసు అత్యంత ఉత్కంఠభరితమైన పోరులో అన్నాడీఎంకే అభ్యర్థి పి. అర్జునన్‌పై కేవలం 734 ఓట్ల స్వల్ప మార్జిన్‌తో గెలుపొందారు. కేవలం రెండు సీట్లే అయినప్పటికీ.. రాష్ట్రంలో సుస్థిర ప్రభుత్వం ఏర్పాటు కావాలంటే వీసీకే మద్దతు అత్యంత కీలకం కావడంతో, ఇప్పుడు తమిళనాడు భవిష్యత్తును శాసించే శక్తిగా ఈ పార్టీ అవతరించింది.
డాక్టర్ తోల్ తిరుమావళవన్ ఎవరంటే ?
రాజకీయాల్లోకి రాకముందు తిరుమావళవన్ తమిళనాడు ప్రభుత్వ ఫోరెన్సిక్ విభాగంలో సైంటిఫిక్ అసిస్టెంట్‌గా ప్రభుత్వ ఉద్యోగం చేసేవారు. అయితే, దళిత హక్కుల కోసం పోరాడే దళిత పాంథర్స్ ఉద్యమ నాయకుడైన మలైచామి మరణం తర్వాత.. 1990 జనవరిలో తిరుమావళవన్ ఆ ఉద్యమ బాధ్యతలు స్వీకరించారు. ఆయన ఆ సంస్థకు కొత్త జెండాను రూపొందించి, దాని పేరును విడుతలై చిరుతైగల్ కట్చిగా మార్చారు. దళితుల హక్కుల కోసం తీవ్రంగా పోరాడటం, ఆయన ఇచ్చే పదునైన ఉపన్యాసాల వల్ల ఉద్యమం బలంగా విస్తరించింది. రాజకీయ కార్యకలాపాలు పెరగడంతో 1997లో ఆయన తన ప్రభుత్వ ఉద్యోగానికి రాజీనామా చేసి పూర్తిస్థాయి రాజకీయాల్లోకి వచ్చారు.
తమిళనాడులో కూటమి ప్రభుత్వాలు ఏర్పడాలని, అధికారం కేవలం ఒకే పార్టీ చేతుల్లో కాకుండా అన్ని సామాజిక వర్గాలకు భాగస్వామ్యం దక్కాలని ఆయన దశాబ్దాలుగా బలంగా వాదిస్తున్నారు. 2001లో మంగళూరు నియోజకవర్గం నుండి మొదటిసారి ఎమ్మెల్యేగా గెలిచారు. చిదంబరం (SC) లోక్‌సభ నియోజకవర్గం నుండి 2009, 2019, 2024 ఎన్నికల్లో ఎంపీగా విజయం సాధించి పార్లమెంట్‌లో అడుగుపెట్టారు. దళిత, మైనారిటీ గళాన్ని ఢిల్లీ స్థాయిలో బలంగా వినిపించారు. కేవలం రాజకీయాలకే పరిమితం కాలేదు. తమిళంలో ఎన్నో పుస్తకాలు రాశారు. అలాగే కొన్ని తమిళ సినిమాల్లో కీలక పాత్రల్లో కూడా నటించారు.
Follow Us