/rtv/media/media_files/2026/05/04/vijay-father-2026-05-04-15-15-40.jpg)
తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో దళపతి విజయ్ నేతృత్వంలోని టీవీకే సాధించిన చారిత్రాత్మక విజయంపై ఆయన తండ్రి, ప్రముఖ దర్శకుడు ఎస్.ఏ. చంద్రశేఖర్ స్పందించారు. తన కుమారుడి నమ్మకం, తెగువపై ఆయన చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
ఎన్నికల ఫలితాల కౌంటింగ్ ప్రారంభానికి ముందే విజయ్, ఆయన తండ్రి ఎస్.ఏ. చంద్రశేఖర్ తిరుత్తణిలోని సుబ్రమణ్యస్వామి ఆలయాన్ని సందర్శించి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఫలితాలు వెలువడి, విజయ్ పార్టీ 109 స్థానాల్లో ఆధిక్యంతో దూసుకుపోతున్న తరుణంలో ఎస్.ఏ.సి తన ఆనందాన్ని పంచుకున్నారు.
"ఒక తండ్రిగా నేను చాలా గర్వపడుతున్నాను. గత రెండేళ్లుగా తనలో ఉన్న ఆత్మవిశ్వాసాన్ని నేను గమనిస్తూనే ఉన్నాను. నేను తమిళనాడు ముఖ్యమంత్రిని అవుతానని వాడు నాతో గర్వంగా చెప్పాడు. ఆ విషయంలో వాడికి ఒక్క శాతం కూడా సందేహం లేదని చంద్రశేఖర్ పేర్కొన్నారు. రాజకీయాల్లోకి వచ్చేటప్పుడే విజయ్ ఒక స్పష్టమైన నిర్ణయం తీసుకున్నారని ఆయన తండ్రి వెల్లడించారు. నేను నా సొంత కాళ్లపై నిలబడతానని, ఎవరితోనూ పొత్తు పెట్టుకోనని విజయ్ ఖరాఖండిగా చెప్పారట.
తమిళ ప్రజలు విజయ్‌ను కేవలం ఒక నాయకుడిగా చూడటం లేదు. మహిళలు తమ కొడుకుగా, యువత తమ అన్నగా, వృద్ధులు తమ మనవడిగా భావిస్తున్నారు. ఈ బంధమే వాడిని ఈరోజు ఈ స్థానంలో నిలబెట్టిందని ఆయన చెప్పుకొచ్చారు.
నివాసంలో పండగ వాతావరణం
మరోవైపు విజయ్ విజయం ఖాయమవగానే ఆయన నివాసంలో పండగ వాతావరణం నెలకొంది. కుటుంబ సభ్యులు ఒకరినొకరు హత్తుకుని, ఆనందబాష్పాలతో సంబరాలు చేసుకుంటున్న వీడియోలు ఇప్పుడు నెట్టింట హల్ చల్ చేస్తున్నాయి. విజయ్ తల్లి శోభ కూడా తన కుమారుడి ఎదుగుదల చూసి మురిసిపోతున్నారు. విజయ్ నివాసం వద్ద భద్రతను కట్టుదిట్టం చేశారు. వేలాది మంది అభిమానులు, పార్టీ కార్యకర్తలు తమిళనాడు తదుపరి ముఖ్యమంత్రి విజయ్ అంటూ నినాదాలు చేస్తూ అక్కడికి చేరుకుంటున్నారు.
Follow Us