/rtv/media/media_files/2026/04/16/vijay-2026-04-16-17-57-55.jpg)
తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో 108 స్థానాలను గెలుచుకుని టీవీకే (TVK) అతిపెద్ద పార్టీగా అవతరించిన సంగతి తెలిసిందే. ఫలితాలు వెలువడిన వెంటనే, ప్రోటోకాల్ ప్రకారం కాబోయే ముఖ్యమంత్రికి అందించే భద్రతను పోలీసు శాఖ ఏర్పాటు చేసింది. ఇందులో భాగంగా మే 4వ తేదీన విజయ్ నివాసానికి నాలుగు కాన్వాయ్ వాహనాలను పంపారు. అయితే ప్రభుత్వం పంపిన ఈ కాన్వాయ్ వాహనాలను విజయ్ సున్నితంగా తిరస్కరించారు.
ప్రజల తీర్పుతో ప్రభుత్వం ఏర్పడి, అధికారికంగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాతే ముఖ్యమంత్రి హోదాలో ఉండే భద్రతను, వాహనాలను స్వీకరిస్తానని ఆయన స్పష్టం చేసినట్లు పార్టీ వర్గాలు వెల్లడించాయి. మే 6వ తేదీన ప్రభుత్వం ఏర్పాటు చేసేందుకు అనుమతి కోరుతూ విజయ్ గవర్నర్ రాజేంద్ర విశ్వనాథ్ అర్లేకర్‌ను కలిశారు. లోక్ భవన్ వెళ్లిన సమయంలో కూడా ఆయన ప్రభుత్వ వాహనాన్ని వాడకుండా, తన సొంత కారులోనే వెళ్లి రావడం విశేషం.
STORY | Vijay says no to CM convoy before swearing-in: TVK
— Press Trust of India (@PTI_News) May 7, 2026
TVK chief Vijay declined to accept the police convoy vehicles provided to Tamil Nadu chief minister as per protocol until his swearing-in, the party said on Thursday.
READ: https://t.co/ZrXwIjy2YY
(PTI File Photo) pic.twitter.com/sC6ChpdUKd
విజయ్ వ్యక్తిగత అభ్యర్థన మేరకు కాన్వాయ్ వాహనాలను వెనక్కి తీసుకున్నట్లు పోలీస్ ఉన్నతాధికారులు తెలిపారు. అయితే, పనైయూర్‌లోని ఆయన నివాసం వద్ద, గవర్నర్ నివాసం వద్ద భద్రతను మాత్రం యధావిధిగా కొనసాగిస్తున్నట్లు పోలీసులు తెలిపారు. సాధారణంగా ఎన్నికల్లో గెలవగానే అధికార హోదాను అనుభవించాలని నేతలు తహతహలాడుతుంటారు. కానీ, ప్రమాణ స్వీకారానికి ముందే హంగూ ఆర్భాటాలకు దూరంగా ఉండాలని విజయ్ తీసుకున్న నిర్ణయం ఆయన అభిమానుల్లో, రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశమైంది.
గవర్నర్ తో భేటీ
మరోవైపు ఈరోజు ఉదయం 11 గంటలకు విజయ్ మరోసారి గవర్నర్ రాజేంద్ర విశ్వనాథ్ అర్లేకర్‌తో భేటీ కానున్నారు. ఈసారి ఆయన ఒంటరిగా కాకుండా, 118 మంది ఎమ్మెల్యేల మద్దతు పత్రాలతో వెళ్తుండటం హాట్ టాపిక్‌గా మారింది. టీవీకేకి ఉన్న 108 మంది కాకుండా, మిగిలిన 10 మంది ఎమ్మెల్యేల మద్దతును ఆయన ఎక్కడి నుంచి కూడగట్టారనేది ఇప్పుడు మిస్టరీగా మారింది. ఈ భేటీ తర్వాత విజయ్ మీడియాతో మాట్లాడి పూర్తి వివరాలు వెల్లడించే అవకాశం ఉంది.
రాష్ట్రంలో నెలకొన్న ఉత్కంఠ పరిస్థితుల దృష్ట్యా గవర్నర్ తన కేరళ పర్యటనను అత్యవసరంగా రద్దు చేసుకున్నారు. మరోవైపు, టీవీకే ఎమ్మెల్యేలను ప్రలోభాలకు గురికాకుండా చూసేందుకు వారిని రిసార్టులకు తరలించినట్లు వార్తలు వచ్చాయి. ఇప్పుడు ఆ ఎమ్మెల్యేలంతా రిసార్ట్ నుంచి నేరుగా చెన్నైలోని టీవీకే కేంద్ర కార్యాలయానికి చేరుకుంటున్నారు. అక్కడి నుంచి విజయ్‌తో కలిసి రాజ్‌భవన్‌కు వెళ్లనున్నారు.
Follow Us