/rtv/media/media_files/2026/03/09/cbi-summons-vijay-again-for-questioning-in-karur-stampede-probe-on-tuesday-2026-03-09-15-08-50.jpg)
CBI summons Vijay again for questioning in Karur stampede probe on Tuesday
తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల బరిలో నిలిచిన నటుడు విజయ్ నామినేషన్ల వ్యవహారం గందరగోళంగా మారింది. ఆయన రెండు నియోజకవర్గాల (పెరంబూర్, తిరుచ్చి ఈస్ట్) నుంచి పోటీ చేస్తుండగా, అక్కడ సమర్పించిన పత్రాల్లో భారీగా వ్యత్యాసాలు ఉండటంతో ప్రత్యర్థి పార్టీలు విమర్శలకు పదును పెట్టాయి.
ఆస్తుల లెక్కల్లో అయోమయం:
గత నెల 30న పెరంబూర్ అభ్యర్థిగా విజయ్ వేసిన నామినేషన్ అఫిడవిట్‌లో తన చరాస్తుల విలువ రూ. 404 కోట్లుగా పేర్కొన్నారు. అయితే, ఏప్రిల్ 4న దాఖలు చేసిన అదనపు (సప్లిమెంటరీ) అఫిడవిట్‌లో ఈ విలువ రూ. 410 కోట్లుగా చూపించారు. కేవలం ఐదు రోజుల వ్యవధిలోనే ఆస్తుల విలువలో ఆరు కోట్ల రూపాయల తేడా రావడం చర్చనీయాంశమైంది. అలాగే పెరంబూర్‌లో తన స్థిరాస్తుల విలువ రూ. 115 కోట్లుగా చూపగా, తిరుచ్చిలో సమర్పించిన అఫిడవిట్‌లో అది రూ. 220 కోట్లుగా ఉండటం గమనార్హం.
కేవలం ఆస్తులే కాదు, వ్యక్తిగత వివరాల్లోనూ తప్పులు దొర్లాయి. పెరంబూర్ అఫిడవిట్‌లో తన వయస్సు 52 ఏళ్లు అని పేర్కొన్న విజయ్, తిరుచ్చి ఈస్ట్ పత్రాల్లో మాత్రం 51 ఏళ్లు అని రాశారు. వీటితో పాటు, పెరంబూర్ నామినేషన్ వేసే సమయంలో తనపై ఎలాంటి క్రిమినల్ కేసులు లేవని పేర్కొన్నారు. కానీ, తిరుచ్చి ఈస్ట్ అఫిడవిట్‌లో మాత్రం తనపై రెండు కేసులు ఉన్నట్లు వెల్లడించారు. ఇందులో ఒకటి 2025లో మదురైలో నమోదైన పాత కేసు కాగా, రెండోది ఇటీవల ప్రచారం సమయంలో నిబంధనల ఉల్లంఘనపై నమోదైనది.
వరుసగా తప్పులు బయటపడటంతో విజయ్ శనివారం నాడు పెరంబూర్‌లో అదనపు అఫిడవిట్‌ను దాఖలు చేసి ఈ తప్పులను సరిదిద్దుకునే ప్రయత్నం చేశారు. తనకు పాత కేసుల గురించి సమాచారం లేదని, అందుకే ముందుగా పేర్కొనలేదని ఆయన వివరణ ఇచ్చారు.
విజయ్ లాంటి స్టార్ హీరో, ఒక పార్టీ అధినేత అయ్యి ఉండి.. కీలకమైన అఫిడవిట్లను ఇంత నిర్లక్ష్యంగా, తప్పుల తడకగా ఎలా దాఖలు చేస్తారని డీఎంకే వంటి పార్టీలు ప్రశ్నిస్తున్నాయి. ఇది ఉద్దేశపూర్వకంగా సమాచారాన్ని దాచడమేనని ఆరోపిస్తున్నాయి. ఎన్నికల అధికారులు ఈ నామినేషన్లపై ఎలాంటి నిర్ణయం తీసుకుంటారోనన్న ఉత్కంఠ ఇప్పుడు తమిళనాడు అంతటా నెలకొంది.
Follow Us