/rtv/media/media_files/2026/05/08/vijay-2026-05-08-07-53-40.jpg)
తమిళనాడు ఎన్నికల ఫలితాలు వచ్చి మూడు రోజులవుతున్నా, కొత్త ప్రభుత్వం ఎవరిదనే దానిపై సస్పెన్స్ వీడలేదు. 108 సీట్లు సాధించి అతిపెద్ద పార్టీగా నిలిచిన నటుడు విజయ్ తమిళగ వెట్రి కళగం (TVK), అధికారం కోసం చేస్తున్న ప్రయత్నాలు ఇప్పుడు ఒక కొత్త మలుపు తిరిగాయి. ఈ పరిస్థితిని చూస్తుంటే 2013లో ఢిల్లీలో ఆమ్ ఆద్మీ పార్టీ ఎదుర్కొన్న సవాళ్లు ఇప్పుడు విజయ్ ముందు కనిపిస్తున్నట్లు రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.
విజయ్ పార్టీ (108)కి కాంగ్రెస్ (5) మద్దతు ఇచ్చినా, మ్యాజిక్ ఫిగర్ 118కి మరో ఆరుగురు ఎమ్మెల్యేల బలం అవసరం. కేవలం అతిపెద్ద పార్టీ అన్న కారణంతో తమను ఆహ్వానించాలని విజయ్ కోరుతున్నప్పటికీ, గవర్నర్ మాత్రం ముందు 118 మంది మద్దతు లేఖలు చూపండి.. ఆ తర్వాతే ప్రమాణ స్వీకారం అని కరాఖండీగా చెబుతున్నారు. ఈ విషయంలో టీవీకేకు మద్దతుగా విసీకే, లెఫ్ట్ పార్టీలు నిలిచినా, అవి ఇంకా అధికారికంగా మద్దతు లేఖలు ఇవ్వకపోవడం ఉత్కంఠను పెంచుతోంది. ప్రస్తుత తమిళనాడు పరిస్థితి 2013 ఢిల్లీ అసెంబ్లీ సంక్షోభాన్ని గుర్తుకు తెస్తోంది.
అప్పుడు ఢిల్లీలో 70 సీట్లలో బీజేపీకి 31 వచ్చాయి. కానీ మెజారిటీ లేదని వారు ప్రభుత్వం ఏర్పాటు చేయలేదు. అప్పుడు 28 సీట్లున్న కేజ్రీవాల్ పార్టీకి, 8 సీట్లున్న కాంగ్రెస్ బయట నుంచి మద్దతు ఇచ్చింది. పాత ద్రవిడ పార్టీలకు ప్రత్యామ్నాయంగా వచ్చిన విజయ్ పార్టీకి ఇప్పుడు ఇతరుల మద్దతు అనివార్యమైంది. ఢిల్లీలో కేజ్రీవాల్ ఎలాగైతే కాంగ్రెస్‌తో కలిసి వెళ్లాల్సి వచ్చిందో, ఇప్పుడు విజయ్ కూడా కాంగ్రెస్, ఇతర చిన్న పార్టీలపై ఆధారపడాల్సిన పరిస్థితి ఏర్పడింది.
ఢిల్లీలో కేజ్రీవాల్ ప్రభుత్వం కేవలం 49 రోజులు మాత్రమే నడిచింది. జన్ లోక్‌పాల్ బిల్లు ఆమోదం పొందకపోవడంతో కేజ్రీవాల్ తన పదవికి రాజీనామా చేశారు. దీంతో ప్రభుత్వం కూలిపోయింది. తిరిగి జరిగిన ఎన్నికల్లో ఆమ్ ఆద్మీ పార్టీ మెజారిటీతో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది.
ఇప్పుడు విజయ్ ముందు 3 దారులు
- ఒకటి విసీకే, లెఫ్ట్ పార్టీలు, ముస్లిం లీగ్ వంటి పార్టీలను తన వైపు తిప్పుకోవడం.
- రెండోది ఒకవేళ బీజేపీ కూటమి నుంచి అన్నాడీఎంకే బయటకు వస్తే, వారితో కలిసి ప్రభుత్వం ఏర్పాటు చేయడం లేదా బయట నుంచి మద్దతు పొందడం.
- డీఎంకే-అన్నాడీఎంకేలు కలిసి కుమ్మక్కైతే, తమ 108 మంది ఎమ్మెల్యేలతో రాజీనామా చేయించి మళ్లీ ఎన్నికలకు వెళ్లి ప్రజా తీర్పు కోరడం.
తమిళనాడు భవిష్యత్తు ఇప్పుడు చిన్న పార్టీల నిర్ణయం మీదే ఆధారపడి ఉంది. విజయ్ ఢిల్లీ ఫార్ములాను అనుసరించి మద్దతుతో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తారా? లేక మెజారిటీ నిరూపించుకోలేక ఢిల్లీ మాదిరిగానే మధ్యంతర ఎన్నికలకు వెళ్తారా? అన్నది మరో రెండు రోజుల్లో తేలిపోనుంది. మొత్తానికి ద్రవిడ కోటలో విజయ్ సృష్టించిన ఈ మార్పు, తమిళ రాజకీయ చరిత్రలో ఒక కొత్త అధ్యాయానికి నాంది పలికినట్లే!
Follow Us