/rtv/media/media_files/2026/06/04/up-doctor-2026-06-04-17-14-58.jpg)
ఉత్తరప్రదేశ్‌లోని ముజఫర్‌నగర్ ప్రభుత్వ ఆసుపత్రిలో మానవత్వాన్ని మరువచేసే దారుణమైన సంఘటన వెలుగులోకి వచ్చింది. లంచం డబ్బులు ఇవ్వలేదనే కోపంతో.. ఒక ప్రభుత్వ డాక్టర్ చిన్నారికి ఆపరేషన్ చేసి అతికించిన కాలును మళ్లీ విరగ్గొట్టినట్లు ఆరోపణలు వస్తున్నాయి. ఆపరేషన్ చేయడానికి సదరు డాక్టర్ మొత్తం రూ.25 వేల లంచం డిమాండ్ చేయగాల.. ఆ తల్లి ఎలాగోలా కష్టపడి రూ.8 వేల చెల్లించింది. మిగతా డబ్బులు ఇవ్వలేనని చెప్పడంతో, చెకప్ పేరుతో పిలిపించి ఆ డాక్టర్ ఈ ఘాతుకానికి ఒడిగట్టాడు.
బాధిత బాలిక వయసు 14 ఏళ్లు కాగా, ఆమె మానసిక వికలాంగురాలు కావడం గమనార్హం. ఒంటరి మహిళ అయిన ఆ తల్లి ఆర్థిక పరిస్థితిని చూసి, సదరు బాలికకు ఉచితంగా వైద్యం అందించాలని జిల్లా అధికారులు ఆసుపత్రికి ముందే ఆదేశాలు ఇచ్చారు. చీఫ్ మెడికల్ ఆఫీసర్ స్పష్టమైన ఆదేశాలు ఇచ్చినప్పటికీ.. ఆ డాక్టర్ మాత్రం కుటుంబం నుండి రూ. 25 వేలు లంచం ఇవ్వాల్సిందేనని పట్టుబట్టడం గమనార్హం.
14 ఏళ్ల కూతురితో కలిసి
బాధిత మహిళను రేష్మాగా గుర్తించారు. తన 14 ఏళ్ల కూతురితో కలిసి ఆమె న్యాయం చేయాలంటూ జిల్లా కలెక్టరేట్‌కు చేరుకోవడంతో ఈ దారుణం వెలుగులోకి వచ్చింది. రేష్మా తెలిపిన వివరాల ప్రకారం.. సుమారు నెల క్రితం జిల్లా ఆసుపత్రిలో ఆమె కూతురి కుడి కాలుకు సర్జరీ జరిగింది. ఆ సమయంలోనే ఆసుపత్రి సిబ్బంది రూ. 25 వేలు లంచం అడిగారు. తాను వితంతువునని, అంత డబ్బు ఇచ్చుకోలేనని చెప్పడంతో వారు వైద్యం చేయడానికి నిరాకరించారు. దీంతో ఆమె జిల్లా మేజిస్ట్రేట్ ని ఆశ్రయించగా.. ఆయన జోక్యం చేసుకుని ఉచిత వైద్యం అందించాలని సీఎంఓను ఆదేశించారు. అయినా సరే, ఆసుపత్రి సిబ్బంది రేష్మా దగ్గర నుండి రూ. 8 వేలు వసూలు చేశారు. మిగతా డబ్బులు తర్వాత ఇచ్చుకోవచ్చని నమ్మబలికారు.
ఆపరేషన్ తర్వాత ఫాలో-అప్ చెకప్ కోసం ఆసుపత్రికి వెళ్లినప్పుడు పరిస్థితి మరింత ఘోరంగా మారింది. సర్జరీ చేసిన డాక్టర్ ఆ చిన్నారిని పరీక్షించడానికి లోపలికి పిలిచాడు. చెకప్ నెపంతో ఆ డాక్టర్ బాలిక మోకాలిని బలవంతంగా వెనక్కి వంచాడని రేష్మా ఆరోపించింది. దీంతో ఆ చిన్నారి నొప్పితో గట్టిగా కేకలు వేసిందని, అదే సమయంలో కాలు లోపల విరిగినట్లు పెద్ద శబ్దం వచ్చిందని రేష్మా కన్నీరు పెట్టుకుంది. ఆ తర్వాత చిన్నారి కాలు పరిస్థితి మరింత దారుణంగా తయారైంది.
ఈ విషయంపై ఆసుపత్రి అధికారులకు ఫిర్యాదు చేసినా వారు పట్టించుకోలేదు. ఈ తీవ్రమైన ఆరోపణలపై ముజఫర్‌నగర్ చీఫ్ మెడికల్ ఆఫీసర్ సునీల్ తివారీ స్పందించారు.ఈ వ్యవహారంపై పూర్తి స్థాయిలో సునిశిత విచారణ జరుపుతామని, వైద్యుడి నిర్లక్ష్యం లేదా తప్పు ఉన్నట్లు తేలితే కఠిన చర్యలు తీసుకుంటామని ఆయన హామీ ఇచ్చారు.
Follow Us