MK Stalin : విజయ్ సర్కార్ మూడు నెలలు కూడా ఉండదు..  స్టాలిన్ సంచలన వ్యాఖ్యలు!

తమిళనాడు సీఎం విజయ్ నేతృత్వంలోని తమిళగ వెట్రి కజగం ప్రభుత్వం మూడు నెలల కంటే ఎక్కువ కాలం అధికారంలో కొనసాగేలా కనిపించడం లేదని డీఎంకే అధ్యక్షుడు, మాజీ సీఎం ఎం.కె. స్టాలిన్ సంచలన వ్యాఖ్యలు చేశారు.

New Update
vijay party

తమిళనాడు సీఎం విజయ్ నేతృత్వంలోని తమిళగ వెట్రి కజగం ప్రభుత్వం మూడు నెలల కంటే ఎక్కువ కాలం అధికారంలో కొనసాగేలా కనిపించడం లేదని డీఎంకే అధ్యక్షుడు, మాజీ సీఎం ఎం.కె. స్టాలిన్ సంచలన వ్యాఖ్యలు చేశారు. తమిళనాడు రాజకీయాల్లో సుమారు 60 ఏళ్ల తర్వాత డీఎంకే, ఏఐఏడీఎంకే కాకుండా ప్రత్యామ్నాయ పార్టీగా టీవీకే సరికొత్త ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన సంగతి తెలిసిందే.

ఈ నేపథ్యంలో, వీసీకే మాజీ ఎమ్మెల్యే పనైయూర్ బాబు తన మద్దతుదారులతో కలిసి డీఎంకే పార్టీలో చేరిన ఒక కార్యక్రమంలో స్టాలిన్ మాట్లాడారు.ప్రస్తుతం అధికారంలో ఉన్న ప్రభుత్వం ఎలాంటిదో నేను ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. వారు బాధ్యతలు చేపట్టినప్పుడు.. నేను ఒక ఆరు నెలల పాటు వారిపై ఎలాంటి విమర్శలు చేయనని చెప్పాను. కానీ, ప్రస్తుత పరిస్థితులు చూస్తుంటే ఆరు నెలల కంటే ముందే నేను నోరు విప్పాల్సి వస్తుందేమోననే భయం వేస్తోందని స్టాలిన్ అన్నారు.

మూడు నెలలైనా నిలబడుతుందా?

ప్రభుత్వంపై విమర్శలను ప్రస్తావిస్తూ.. ఇప్పటికే ఈ ప్రభుత్వంపై చాలా మంది మాట్లాడుకుంటున్నారు, విమర్శలు కూడా రోజురోజుకూ పెరుగుతున్నాయి. ఇప్పుడు ప్రశ్న ఆరు నెలలు, ఐదు నెలలు లేదా నాలుగు నెలల గురించి కాదు.. అసలు ఈ ప్రభుత్వం మరో మూడు నెలలైనా నిలబడుతుందా? లేదా? అనేదే అసలు ప్రశ్న అంటూ స్టాలిన్ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఇలాంటి రాజకీయ పరిస్థితుల్లోనే మీరంతా ఈరోజు మన ఉద్యమంలో భాగమయ్యారని చెప్తూ, పార్టీని బలోపేతం చేసేందుకు కొత్తగా చేరిన వారంతా సహకరించాలని కోరారు.

ఇదే సమయంలో, కొత్తగా డీఎంకే పార్టీలోకి వచ్చిన కార్యకర్తలకు స్టాలిన్ ఒక కీలక సూచన చేశారు. తాము గతంలో పనిచేసిన పార్టీలపై అనవసర విమర్శలు చేయవద్దని హితవు పలికారు. డీఎంకే వ్యవస్థాపకుడు సి.ఎన్. అన్నాదురై చెప్పిన ఒక ప్రసిద్ధ వ్యాఖ్యను గుర్తు చేస్తూ.. ప్రత్యర్థి తోటలోని మల్లెపూవు కూడా సువాసననే ఇస్తుంది అని అన్నా చెప్పారు. కాబట్టి మనం ఎవరినీ తక్కువ అంచనా వేయాల్సిన అవసరం లేదని స్టాలిన్ వ్యాఖ్యానించారు.

Advertisment
తాజా కథనాలు