/rtv/media/media_files/2026/04/10/woman-body-found-stuffed-inside-bed-box-in-outer-delhi-2026-04-10-21-07-59.jpg)
Septic Tank Workers Killed in Odisha
Odisha : ఒడిశాలోని కలహండి జిల్లాలో అత్యంత విషాదకర ఘటన చోటుచేసుకుంది. కొత్తగా నిర్మించిన సెప్టిక్ ట్యాంకులోని సెంటరింగ్ సామగ్రిని తొలగించేందుకు దిగి ఊపిరాడక ఒకే గ్రామానికి చెందిన ఆరుగురు వ్యక్తులు దుర్మరణం పాలయ్యారు. మరొకరి పరిస్థితి విషమంగా ఉంది. మృతుల్లో ముగ్గురు మేస్త్రీలు, ఒక కూలీతో పాటు ఇంటి యజమాని, ఆయన కుమారుడు కూడా ఉండటంతో గౌడ కార్లఖుంట గ్రామంలో తీవ్ర విషాదఛాయలు అలముకున్నాయి.
ప్రమాదం జరిగిందిలా..
గౌడ కార్లఖుంట గ్రామంలో కొత్తగా నిర్మించిన సెప్టిక్ ట్యాంక్ లోపల ఉన్న సెంటరింగ్ సామాగ్రిని తొలగించడానికి కూలీలు తొలుత లోపలికి దిగారు. అయితే ట్యాంక్ లోపల ఉన్న విషవాయువుల కారణంగా వారు ఊపిరాడక స్పృహ తప్పిపోయారు. లోపలికి వెళ్లిన వారు ఎంతకూ రాకపోవడంతో, వారిని రక్షించే ప్రయత్నంలో ఒకరి వెనుక ఒకరుగా ఇతరులు కూడా సెప్టిక్ ట్యాంక్‌లోకి దిగి స్పృహ కోల్పోయారు. ఈ క్రమంలోనే ముగ్గురు తాపీ మేస్త్రీలు, ఒక కూలీ, ఇంటి యజమాని నిమయ్ పాల్ (48), ఆయన కుమారుడు ఆకాశ్ పాల్ (28) అక్కడికక్కడే ప్రాణాలు విడిచారు.
సహాయక చర్యలు - బాధితుల గుర్తింపు
ప్రమాద సమాచారం అందుకున్న వెంటనే స్థానికులు, అధికారులు హుటాహుటిన ఘటనాస్థలికి చేరుకుని సహాయక చర్యలు ప్రారంభించారు. ట్యాంక్ నుంచి బాధితులను బయటకు తీసి, మదన్‌పుర్ రాంపుర్ సామాజిక ఆరోగ్య కేంద్రానికి తరలించగా.. అప్పటికే ఆరుగురు మరణించినట్లు వైద్యులు నిర్ధారించారు. పోలీసుల దర్యాప్తులో మృతుల వివరాలు ఇలా ఉన్నాయి. నిమయ్ పాల్ (48) – ఇంటి యజమాని (గౌడ కార్లఖుంట),ఆకాశ్ పాల్ (28) – యజమాని కుమారుడు (గౌడ కార్లఖుంట), అడల్ మాఝీ (55) – (గౌడ కార్లఖుంట),మిరోనోజ్ హతి (27) – (మటోగండ), చందా జల్ – (దుట గ్రామం), బిపుల్ జల్ (30) – (దుట గ్రామం).
ఈ ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన హతిఖోజ్ గ్రామానికి చెందిన కూలి పంకజ్ భోయిని(32)ని మొదట స్థానిక ఆసుపత్రికి తరలించారు. అయితే పరిస్థితి విషమించడంతో మెరుగైన చికిత్స కోసం కలహండి జిల్లా ఆస్పత్రికి తరలించినట్లు కేసింగ పోలీస్ ఎస్‌డీపీఓ సందీప్ మాఝీ తెలిపారు. మదన్‌పుర్ రాంపుర్ పోలీసులు ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. ఈ ఘోర దుర్ఘటనపై ఒడిశా ముఖ్యమంత్రి మోహన్ చరణ్ మాఝీ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు తన ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తూ, ముఖ్యమంత్రి సహాయ నిధి (సీఎంఆర్‌ఎఫ్) నుంచి ఒక్కో కుటుంబానికి రూ. 4 లక్షల చొప్పున ఎక్స్‌గ్రేసియా ప్రకటిస్తున్నట్లు ముఖ్యమంత్రి కార్యాలయం (సీఎంఓ) వెల్లడించింది.
మరోవైపు, మృతుల అంత్యక్రియల ఖర్చుల నిమిత్తం జిల్లా యంత్రాంగం తరపున తక్షణమే రూ. 30,000 చొప్పున ఆర్థిక సాయం విడుదల చేసినట్లు కలహండి జిల్లా కలెక్టర్ సచిన్ పవార్ తెలిపారు. భవిష్యత్తులో ఇటువంటి ప్రాణాంతక ప్రమాదాలు పునరావృతం కాకుండా ఉండేందుకు రాష్ట్ర ప్రభుత్వం అన్ని రకాల కఠిన చర్యలు తీసుకుంటుందని ఒడిశా మంత్రి పృథ్వీరాజ్ హరిచందన్ ఈ సందర్భంగా స్పష్టం చేశారు.
Follow Us