/rtv/media/media_files/2026/06/16/gayathri-2026-06-16-21-07-08.jpg)
radha gayathri
Crime News : ఉత్తరాఖండ్‌లోని ప్రముఖ పర్యాటక హిల్ స్టేషన్ ముస్సోరీ (Mussoorie)లో దారుణ ఉదంతం వెలుగుచూసింది. భర్తతో కలిసి సరదాగా గడిపేందుకు విహారయాత్ర (హనీమూన్)కు వెళ్లిన 27 ఏళ్ల తెలుగు సాఫ్ట్‌వేర్ ఉద్యోగిని హోమ్‌స్టే గదిలోనే అనుమానాస్పద స్థితిలో శవమై తేలింది. రక్తం, మూత్రం మడుగులో ఆమె వివస్త్రగా పడి ఉండటం స్థానికంగా తీవ్ర కలకలం రేపింది. మృతురాలిని పి. రాధా గాయత్రిగా పోలీసులు గుర్తించారు.
పోలీసుల ప్రాథమిక దర్యాప్తు వివరాల ప్రకారం.. ఆంధ్రప్రదేశ్‌లోని విశాఖపట్నం (Vizag) నగరానికి చెందిన పి. రాధా గాయత్రి, శ్రీచరణ్‌లకు 2025 నవంబర్ 8న వివాహం జరిగింది. రాధా గాయత్రి ఢిల్లీలోని కిద్వాయ్ నగర్ ఈస్ట్‌లో నివసిస్తూ గురుగ్రామ్‌లోని ఒక ప్రముఖ ఐటీ సంస్థలో సాఫ్ట్‌వేర్ ఇంజినీర్‌గా పనిచేస్తున్నారు. భర్త శ్రీచరణ్ పుణెలోని మరో ఐటీ సంస్థలో ఉద్యోగం చేస్తున్నాడు. పెళ్లయిన ఏడు నెలల తర్వాత వీరిద్దరూ కలిసి సెలవులు గడిపేందుకు జూన్ 13న ఢిల్లీ నుంచి బయలుదేరి మొదట రిషికేష్ చేరుకున్నారు. ఆ మరుసటి రోజు, అంటే జూన్ 14న రాత్రి ఆలస్యంగా ముస్సోరీలోని తిప్రీధర్ ప్రాంతంలో ఉన్న 'కియానా హోమ్‌స్టే'కు చేరుకున్నారు. అందులోని 'బ్లిస్' అనే రూమ్‌లో రాత్రి 11:30 గంటల ప్రాంతంలో వారు చెక్-ఇన్ అయ్యారు.
జూన్ 15 (సోమవారం) ఉదయం హోమ్‌స్టేలో ఒక మహిళ స్పృహ లేకుండా పడి ఉందంటూ అక్కడి సిబ్బంది ముస్సోరీ పోలీసులకు సమాచారం అందించారు. దీంతో పోలీసులు 108 అంబులెన్స్‌తో సహా ఘటనా స్థలానికి చేరుకోగా, అంబులెన్స్ సిబ్బంది ఆమెను పరీక్షించి అప్పటికే మరణించినట్లు ధృవీకరించారు.భర్త శ్రీచరణ్ పోలీసులకు ఇచ్చిన స్టేట్‌మెంట్ ప్రకారం.. రూమ్‌కి వచ్చిన తర్వాత రాత్రి ఇద్దరూ కలిసి మద్యం సేవించారని, తెల్లవారుజామున 3:30 గంటల సమయంలో నిద్రపోయారని తెలిపాడు. ఉదయం తను నిద్రలేచి చూసేసరికి భార్య గాయత్రి ఒంటిపై బట్టలు లేకుండా (నగ్నంగా), ముక్కు నుంచి రక్తం కారుతూ, మూత్రం, రక్తం మడుగులో నేలపై అపస్మారక స్థితిలో పడి ఉందని పేర్కొన్నాడు.
రంగంలోకి ఫోరెన్సిక్ టీమ్.. దర్యాప్తు ముమ్మరం చేసిన పోలీసులు
ఘటనా స్థలాన్ని పరిశీలించిన పోలీసులకు గదిలోని పరుపు (బెడ్‌షీట్)పై భారీగా రక్తపు మరకలు కనిపించాయి. అలాగే ఆ రూమ్ నుండి రెండు ఖాళీ మద్యపు సీసాలను, తినుబండారాలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. వివాహమై కేవలం ఏడు నెలలు మాత్రమే కావడం, మరణం సంభవించిన తీరు అత్యంత భీతిగొలిపేలా ఉండటంతో ఈ కేసుపై అనేక అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఇది అతిగా మద్యం సేవించడం వల్ల జరిగిన ప్రమాదమా? లేక దీని వెనుక ఏదైనా పథకం ప్రకారం జరిగిన హత్య లేదా కుట్ర ఉందా? అనే కోణంలో ఉత్తరాఖండ్ పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు.
ప్రస్తుతం బాధితురాలి మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం డెహ్రాడూన్‌లోని 'కరోనేషన్ ఆసుపత్రి'కి తరలించారు. కేసు తీవ్రత, అనుమానాలను దృష్టిలో ఉంచుకుని, పోస్టుమార్టాన్ని నిపుణులైన వైద్యుల ప్రత్యేక ప్యానెల్‌చే నిర్వహించాలని, ఈ ప్రక్రియ మొత్తాన్ని పూర్తిగా వీడియో రికార్డింగ్ (Video Recording) చేయాలని పోలీసులు ఆసుపత్రి వర్గాలను అభ్యర్థించారు. విహార యాత్రకు వెళ్లిన నూతన వధువు ఇలా అనుమానాస్పద స్థితిలో మృతి చెందడం విశాఖపట్నంలోని వారి కుటుంబ సభ్యులను తీవ్ర దిగ్భ్రాంతికి, విషాదంలోకి నెట్టింది.
Follow Us