Tirupati Laddu: అయోధ్యకు తిరుమల లడ్డూ ఎఫెక్ట్... కొత్తగా ప్రసాదం ఇలా!

తిరుపతి దేవస్థానంలో లడ్డూ వివాదం ఎఫెక్ట్ యూపీలోని పలు ఆలయాలకు తాకింది. పురాతన పద్ధతుల్లో ప్రసాదాలు చేయాలని మధురలోని ధర్మ రక్షా సంఘం నిర్ణయం తీసుకుంది. పండ్లు తదితర సహజసిద్ధమైన పదార్థాలతో ప్రసాదం తయారు చేయాలని పలు ఆలయాల నిర్వాహకులు నిర్ణయించారు.

New Update
Tirumala Laddu -1

UP News: తిరుపతి దేవస్థానంలో లడ్డూ వివాదం ప్రభావం ఉత్తరప్రదేశ్‌లోని ప్రధాన ఆలయాల్లోనూ కనిపిస్తోంది. బయటి ఏజెన్సీల నుంచి ప్రసాదం తీసుకోకుండా నిషేధం విధించాలని అయోధ్యలోని రామ మందిరం ప్రధాన పూజారి డిమాండ్ చేశారు. మధురలోని ఓ దేవాలయం కూడా స్వీట్లకు బదులుగా పండ్లు, పువ్వులను భక్తులకు ఇవ్వాలని నిర్ణయించింది. అంతేకాకుండా ప్రయాగ్‌రాజ్‌లోని మూడు పెద్ద ఆలయాల్లో కూడా ప్రసాదం నిబంధనలు మార్చారు.

తిరుమల లడ్డూ ప్రసాదంలో కల్తీ జరుగుతోందన్న ఆరోపణలతో ఉత్తరప్రదేశ్‌లోని ఆలయాల్లో అలర్ట్‌ ప్రకటించారు. అయోధ్య, ప్రయాగ్‌రాజ్, మధురలోని పెద్ద దేవాలయాల ప్రసాదం నియమాలలో కూడా మార్పులు చేస్తున్నారు. అయోధ్యలోని రామజన్మభూమి ఆలయ ప్రధాన పూజారి సత్యేంద్రదాస్, బయటి ఏజెన్సీలు తయారు చేసిన ప్రసాదాన్ని పూర్తిగా నిషేధించాలని డిమాండ్ చేశారు. ఆలయ నైవేద్యాలలో ఉపయోగించే నెయ్యి స్వచ్ఛతపై ఆందోళన వ్యక్తం చేసిన ఆయన, ఆలయ అర్చకుల పర్యవేక్షణలో అన్ని ప్రసాదాలను సిద్ధం చేయాలని కోరారు.

దేశవ్యాప్తంగా విక్రయించే నూనె, నెయ్యి నాణ్యతను క్షుణ్ణంగా తనిఖీ చేయాల్సిన అవసరాన్ని సత్యేంద్ర దాస్ నొక్కి చెప్పారు. తిరుమల నైవేద్యాల్లో కొవ్వు, చేపనూనె వినియోగిస్తున్నారనే ఆరోపణలపై దేశవ్యాప్తంగా వివాదం పెరుగుతోందని ఆయన అన్నారు. ప్రసాదంలో అనుచితమైన పదార్థాలు కలిపి ఆలయాలను అపవిత్రం చేసేందుకు అంతర్జాతీయ కుట్ర జరుగుతోందని ఆరోపించారు. ప్రయాగ్‌రాజ్‌లోని అలోప్ శంకరీ దేవి, హనుమాన్, మంకమేశ్వర్‌తో సహా అనేక దేవాలయాలు ప్రసాదం విషయంలో ఆంక్షలు విధించాయి. భక్తులు బయటి నుంచి తయారుచేసిన స్వీట్లు, ఇతర వస్తువులను ప్రసాదంగా తీసుకురాకుండా నిషేధించారు.

పురాతన పద్ధతుల్లో ప్రసాదాలు చేయాలని మధురలోని ధర్మ రక్షా సంఘం నిర్ణయం తీసుకుంది. అంటే స్వీట్లకు బదులు పండ్లు, పూలు, ఇతర సహజసిద్ధమైన పదార్థాలతో చేసిన ప్రసాదాన్ని చేర్చనున్నారు. ధర్మ రక్షా సంఘం జాతీయ అధ్యక్షుడు సౌరభ్ గౌర్, ప్రసాద వ్యవస్థలో గణనీయమైన సంస్కరణల తేవాల్సి ఉందని డిమాండ్‌ చేశారు. స్వచ్ఛమైన, సాత్విక ప్రసాదంతో పాటు సాంప్రదాయ పద్ధతులను తిరిగి తీసుకురావాలని మత పెద్దలు, పలు సంస్థలు ఏకాభిప్రాయానికి వచ్చాయి.

పండ్లు, డ్రైఫ్రూట్స్..

లలితా దేవి ఆలయంలో భక్తులు కొబ్బరికాయలు, పండ్లు, డ్రై ఫ్రూట్స్ మాత్రమే తీసుకురావాలని నిర్వాహకులు ఆదేశాలు జారీ చేశారు. మరోవైపు విచారణలో మిఠాయిల స్వచ్ఛత తేటతెల్లం అయ్యేంత వరకు వాటిని ఆలయంలో సమర్పించేందుకు అనుమతించబోమని మంకమేశ్వర ఆలయానికి చెందిన మహంత్ శ్రీధరణంద్ బ్రహ్మచారి జీ మహారాజ్ అన్నారు. భక్తులను బయటి నుంచి మిఠాయిలు, ప్రసాదాలు తీసుకురావడాన్ని అనుమతించబోమని ఆలోప్‌ శాంకరీ దేవి ఆలయ ప్రధాన పోషకుడు, శ్రీ పంచాయతీ అఖారా మహానిర్వాణి కార్యదర్శి యమునా పురి మహారాజ్‌ తెలిపారు.

స్వయంగా లడ్డూ ప్రసాదాన్ని తయారు చేయాలని సంగం ఒడ్డున ఉన్న బడే హనుమాన్ ఆలయ సంరక్షకుడు బల్బీర్ మహారాజ్ నిర్ణయించారు. కారిడార్ నిర్మాణం పూర్తయిన తర్వాత ప్రసాదం తయారీని మొదలుపెడతామని చెప్పారు. ఇలా అనేక ఆలయాల్లో ప్రసాదం నిబంధనలు మారుస్తున్నారు. తిరుమల ఘటనతో అన్ని యూపీలోని అన్ని ఆలయాల నిర్వాహకులు అప్రమత్తమయ్యారు. ఏదేమైనా తిరుమల లడ్డూ ప్రకంపనలు దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించాయి.

Advertisment
Advertisment
తాజా కథనాలు