/rtv/media/media_files/2026/06/06/cockroach-janta-party-2026-06-06-10-35-45.jpg)
Cockroach Janata Party
Cockroach Janata Party : జాతీయ స్థాయి ప్రవేశ, నియామక పరీక్షల్లో జరిగిన అక్రమాలకు బాధ్యత వహిస్తూ కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ తక్షణమే తన పదవికి రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ శనివారం ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద భారీ నిరసన ప్రదర్శన జరిగింది. 'కాక్రోచ్ జనతా పార్టీ' (సీజేపీ) ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ ధర్నాకు దేశంలోని వివిధ రాష్ట్రాల నుంచి వందలాది మంది యువత, విద్యార్థులు తరలివచ్చారు. వందల మంది పోలీసుల భారీ మోహరింపు నడుమ, విద్యావ్యవస్థలో అవకతవకలపై యువత గళమెత్తారు. కేంద్ర మంత్రి ప్రధాన్ రాజీనామా చేయాల్సిందేనని నినాదాలు చేస్తూ జంతర్ మంతర్ పరిసరాలను హోరెత్తించారు.
భారీ ఎత్తున జరిగిన ఈ నిరసనపై కేంద్ర ప్రభుత్వం నుంచి ఎలాంటి స్పందన రాకపోవడంతో కాక్రోచ్ జనతా పార్టీ వ్యవస్థాపకుడు అభిజిత్ దిప్కే తీవ్రంగా స్పందించారు. ఇవాళ జరిగింది కేవలం ఒక 'ట్రైలర్' మాత్రమేనని ఆయన అభివర్ణించారు. కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ స్వయంగా 7 రోజుల్లోగా రాజీనామా చేయాలని, లేనిపక్షంలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఆయన్ను కేబినెట్ నుంచి తొలగించాలని డిమాండ్ చేశారు. ఒకవేళ ఈ వారం రోజుల్లో కేంద్రం స్పందించకపోతే, ఈ ఆందోళనను దేశవ్యాప్తంగా ఉధృతం చేస్తామని సీజేపీ అల్టిమేటం జారీ చేసింది. ప్రస్తుతానికి తమకు ఎన్నికలలో పోటీ చేసే ప్రణాళికలు లేవని, విద్యా వ్యవస్థను కాపాడటమే తమ తక్షణ ప్రాధాన్యతని పార్టీ అధికార ప్రతినిధి సౌరవ్ దాస్ స్పష్టం చేశారు.
ఈ నిరసన ప్రదర్శనలో పాల్గొన్న యువత వినూత్నంగా ప్రవర్తించారు. చాలా మంది యువతీ యువకులు కాక్రోచ్ (బొద్దింక) మాస్కులను ధరించి, చేతుల్లో పూలను పట్టుకుని శాంతియుతంగా నిరసన తెలిపారు. 'భారత్ మాతా కీ జై' అంటూ దేశభక్తి నినాదాలు చేశారు. ఈ ధర్నాకు ప్రముఖ లద్దాఖ్ సామాజిక కార్యకర్త సోనమ్ వాంగ్‌చుక్ స్వయంగా హాజరై సంఘీభావం ప్రకటించారు. ఆయనతో పాటు సీపీఐ (ఎంఎల్) లిబరేషన్, సీపీఐ వంటి లెఫ్ట్ పార్టీల నాయకులు కూడా నిరసనలో పాల్గొన్నారు. అయితే, సాయంత్రం వేళకు సీజేపీ అధినేత అభిజిత్ దిప్కే స్వల్ప అనారోగ్యానికి గురికావడంతో 3.30 గంటల ప్రాంతంలో ధర్నాను ముగించారు.
అమెరికా నుంచి భారతదేశానికి వచ్చి ఈ ఆన్‌లైన్ ఉద్యమ వేదికగా ధర్నాకు నాయకత్వం వహించిన అభిజిత్ దిప్కే యువతను ఉద్దేశించి ఉద్వేగభరితంగా మాట్లాడారు. కేంద్ర ప్రభుత్వం తమ సోషల్ మీడియా ఖాతాలను తొలగిస్తోందని, ఖాతాలను తొలగించగలరు కానీ తమ పోరాటాన్ని ఆపలేరని హెచ్చరించారు. "సరైన కారణం కోసం నా స్వేచ్ఛను త్యాగం చేయడానికి సిద్ధపడే వచ్చా. జైలుకు వెళ్తామనే భయంతో చాలా మంది అమ్ముడుపోయారు, కానీ ఈ దేశ యువత, విద్యార్థులు అమ్ముడుపోరు" అని స్పష్టం చేశారు. రాజకీయాల గురించి మాట్లాడితే అరెస్ట్ చేస్తారేమోనని తన తల్లితో పాటు దేశంలోని ప్రతి తల్లి భయపడుతోందని, కానీ ఇకపై తాము భయపడేది లేదని యువత కేరింతల మధ్య దిప్కే ప్రకటించారు. అలాగే, మత రాజకీయాలను వ్యతిరేకిస్తూ గాంధీజీ, అంబేడ్కర్ ల ఆశయాలతో ముందుకు సాగాలని పిలుపునిచ్చారు.
ఈ కాక్రోచ్ జనతా పార్టీ నిరసన ప్రదర్శనపై రాజకీయ వర్గాల్లో భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్), సమాజ్ వాదీ పార్టీ (ఎస్పీ), తృణమూల్ కాంగ్రెస్ (టిఎమ్‌సి), శివసేన (యూబీటీ), లెఫ్ట్ పార్టీలు ఈ నిరసనకు పూర్తి మద్దతు ప్రకటించాయి. అయితే, విపక్షాల కూటమిలోనే భిన్న స్వరాలు వినిపించాయి. ఈ సీజేపీ నిరసన అంతా 'ఆప్' (AAP) సృష్టించిన వ్యూహమేనని కాంగ్రెస్ పార్టీలోని ఒక వర్గం నేతలు వ్యాఖ్యానించడం రాజకీయంగా చర్చనీయాంశంగా మారింది.
బీజేపీ కౌంటర్: విదేశాల నుంచి ప్రతికూల రాజకీయం
మరోవైపు ఈ నిరసనలపై భారతీయ జనతా పార్టీ (బీజేపీ) తీవ్రంగా స్పందించింది. దేశ యువతను తప్పుదోవ పట్టించి, వారిని ప్రతికూల రాజకీయాల వైపు మళ్లించేందుకు కొన్ని శక్తులు కుట్రలు పన్నుతున్నాయని బీజేపీ నేత నితిన్ నబీన్ ఆరోపించారు. రాంచీలో జరిగిన మేధావుల చర్చా వేదికలో అభిజిత్ దిప్కే పేరు ఎత్తకుండా పరోక్షంగా విమర్శలు గుప్పించారు. కొందరు విదేశాల్లో కూర్చుని భారత యువతకు దిశానిర్దేశం చేయాలని చూస్తున్నారని మండిపడ్డారు. ప్రజాస్వామ్యంలో ప్రజలకు నిరసన తెలిపే హక్కు ఉందని, కానీ అది నియమ నిబంధనల పరిధిలోనే ఉండాలని సూచించారు. పొరుగు దేశాల్లో జరిగినట్లుగా వ్యవస్థకు వ్యతిరేకంగా చేసే ఇలాంటి ప్రచారాలు దేశ యువత భవిష్యత్తుకు మంచిది కాదని ఆయన హితవు పలికారు.
Follow Us