keerthana : విజయ్‌ మంత్రివర్గంలో ఒకే ఒక మహిళా మంత్రి...ఆమె బ్యాక్‌గ్రౌండ్‌ తెలిస్తే షాక్‌ ...

తమిళనాడు సీఎం గా 'దళపతి' జోసెఫ్ విజయ్ ప్రమాణ స్వీకారం చేశారు. కాగా, ఆయన కేబినెట్‌లో చోటు దక్కించుకున్న ఏకైక యువ మహిళా మంత్రి కీర్తన. కేవలం 29 ఏళ్ల వయస్సులోనే ఎమ్మెల్యేగా గెలిచి, విజయ్ తొలి కేబినెట్‌లో మంత్రిగా చోటు దక్కించుకున్న పిన్న వయస్కురాలు కీర్తన.

New Update
FotoJet - 2026-05-10T131511.255

Keerthana becomes young woman minister in Vijay's cabinet

keerthana : తమిళనాడు నూతన ముఖ్యమంత్రిగా 'దళపతి' జోసెఫ్ విజయ్ ప్రమాణ స్వీకారం చేసి సరికొత్త సంచలనానికి తెరలేపగా, ఆయన కేబినెట్‌లో చోటు దక్కించుకున్న ఏకైక యువ మహిళా మంత్రి ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాలతో పాటు దేశవ్యాప్తంగా హాట్ టాపిక్‌గా మారారు. ఆమెనే కీర్తనా సంపత్. కేవలం 29 ఏళ్ల వయస్సులోనే తొలిసారి ఎమ్మెల్యేగా గెలిచి, ఏకంగా విజయ్ తొలి కేబినెట్‌లోనే మంత్రిగా చోటు దక్కించుకుని అత్యంత పిన్న వయస్కురాలైన మంత్రిగా సరికొత్త రికార్డు సృష్టించారు.

రాజకీయ వ్యూహకర్తగా తెరవెనుక చక్రం తిప్పిన స్థాయి నుంచి నేడు ప్రత్యక్ష రాజకీయాల్లో మంత్రి పీఠాన్ని అధిరోహించే వరకు సాగిన కీర్తనా సంపత్ విజయ ప్రస్థానానికి సంబంధించిన విషయాలకోసం శోధిస్తున్నారు. నిజానికి కీర్తన  ఎలాంటి రాజకీయ నేపథ్యం లేని మధ్యతరగతి కుటుంబం నుంచి వచ్చారు. కీర్తనా సంపత్ తమిళనాడులోని విరుద్ నగర్ జిల్లా చత్రరెడ్డియపట్టి అనే గ్రామానికి చెందిన ఒక సాధారణ మధ్యతరగతి కుటుంబంలో జన్మించారు.

 స్థానికంగానే డిగ్రీ వరకు చదువుకున్న కీర్తన, ఆ తర్వాత పుదుచ్చేరి (పాండిచ్చేరి) విశ్వవిద్యాలయం నుండి ఎమ్మెస్సీ స్టాటిస్టిక్స్ (M.Sc. Statistics) పూర్తి చేశారు.చదువు పూర్తయిన తర్వాత ఆమె డేటా అనలిస్ట్‌గా తన వృత్తిపరమైన కెరీర్‌ను ప్రారంభించారు. డేటాను విశ్లేషించడంలో ఆమెకున్న ప్రతిభే ఆమెను రాజకీయ వ్యూహాల వైపు నడిపించింది.రాజకీయాల్లోకి రాకముందు కీర్తన ప్రముఖ ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిశోర్‌కు చెందిన ఐప్యాక్ (I-PAC) బృందంలో చేరారు.గోవా, పశ్చిమ బెంగాల్ రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లో తెరవెనుక ఉండి పార్టీల గెలుపు కోసం వ్యూహాలు రచించడంలో ఆమె కీలక పాత్ర పోషించారు.
 
2021 తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో డీఎంకే (DMK) పార్టీ ఘనవిజయం సాధించడం వెనుక ఐప్యాక్ టీమ్ తరఫున కీర్తన కూడా పొలిటికల్ కన్సల్టెంట్‌గా గట్టిగా శ్రమించారు.ఐప్యాక్ ప్రస్థానం తర్వాత కీర్తన హైదరాబాద్ వేదికగా తెలుగుదేశం పార్టీ (TDP) సోషల్ మీడియా విభాగానికి లీడ్‌గా బాధ్యతలు చేపట్టారు.ఆధునిక సాంకేతికతను, సోషల్ మీడియా ట్రెండ్స్‌ను ఉపయోగించి రాజకీయ ప్రచారాలను ఎలా నడపాలో ఇక్కడ ఆమె విజయవంతంగా చేసి చూపించారు.

 హైదరాబాద్‌లో సుదీర్ఘ కాలం పనిచేసిన క్రమంలో ఆమెకు తెలుగు భాషపై అద్భుతమైన పట్టు లభించింది. స్వచ్ఛంగా తెలుగు మాట్లాడటమే కాకుండా తెలుగు సంస్కృతిని కూడా ఆకళింపు చేసుకున్నారు. దీంతో ఆమెను తెలుగువారంతా 'తెలుగు బిడ్డ'గా ఆత్మీయంగా పిలుచుకుంటున్నారు. అనేక రాష్ట్రాల్లో పెద్ద పెద్ద రాజకీయ నాయకుల గెలుపు కోసం వ్యూహాలు రచించిన కీర్తన, తన సొంత జిల్లా అయిన విరుద్ నగర్‌లో నెలకొన్న మౌలిక సమస్యలను చూసి చలించిపోయారు.  విరుద్ నగర్ జిల్లాలో తాగునీటి ఎద్దడి, అధ్వానపు రోడ్లు, యువతకు ఉపాధి లేకపోవడం వంటి ప్రధాన సమస్యల పరిష్కారం కోసం తన చేతిలో ఉన్న లీడ్ పొలిటికల్ కన్సల్టెంట్ ఉద్యోగాన్ని వదిలేసి ప్రజాసేవలోకి వచ్చారు. స్థానిక సమస్యలపై ఆమె సామాజిక మాధ్యమాల వేదికగా చేసిన పోరాటాలు, వినూత్న ప్రచారాలు లక్షలాది మంది యువతను ఆకట్టుకున్నాయి. ఈ క్రమంలోనే ఆమెకు సోషల్ మీడియాలో భారీ స్థాయిలో ఫాలోవర్లు ఏర్పడ్డారు.
 
కీర్తనా సంపత్ ప్రతిభ, ప్రజల్లో ఆమెకున్న ఆదరణ గురించి తెలుసుకున్న 'తమిళగ వెట్రి కళగం' (TVK) అధినేత విజయ్.. ఆమెకు ప్రతిష్టాత్మకమైన శివకాశి (Sivakasi) అసెంబ్లీ నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యే టికెట్ కేటాయించారు. శివకాశి నియోజకవర్గంలో తెలుగు మాట్లాడే ప్రజలు (తెలుగు ఓటర్లు) అత్యధిక సంఖ్యలో ఉన్నారు. ప్రచార బరిలో దిగిన కీర్తన ఇతర సాంప్రదాయ పార్టీల కంటే భిన్నంగా డిజిటల్ ప్రచారాన్ని వాడుకుంటూనే.. స్థానిక తెలుగు ఓటర్లతో నేరుగా కనెక్ట్ అవ్వడానికి తెలుగులో ప్రసంగించారు. ఆమె ఆత్మీయంగా తెలుగులో మాట్లాడిన తీరు అక్కడి ఓటర్లను ఎంతగానో ఆకట్టుకుంది. భారీ మెజారిటీతో విజయం సాధించిన కీర్తనా సంపత్.. శివకాశి నియోజకవర్గ చరిత్రలోనే గెలిచిన తొలి మహిళా ఎమ్మెల్యేగా రికార్డు సృష్టించారు.

ఆదివారం చెన్నైలోని నెహ్రూ ఇండోర్ స్టేడియంలో జరిగిన చారిత్రాత్మక వేడుకలో ముఖ్యమంత్రి విజయ్ సమక్షంలో ఆమె మంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. విజయ్ నూతన మంత్రివర్గంలో చోటు దక్కించుకున్న ఏకైక మహిళా ప్రతినిధి కీర్తన కావడం విశేషం. అతి తక్కువ కాలంలోనే ఒక సాధారణ మధ్యతరగతి డేటా అనలిస్ట్ స్థాయి నుంచి.. స్వయంకృషితో, సాంకేతికతను ఆయుధంగా మలచుకుని తమిళనాడు కేబినెట్‌లో మంత్రి పీఠం వరకు చేరిన కీర్తనా సంపత్ ప్రస్థానం నేటి తరం యువతకు, ముఖ్యంగా మహిళలకు గొప్ప స్ఫూర్తిదాయకం.

Advertisment
తాజా కథనాలు