Tamil Nadu CM Vijay : తెలంగాణ సీఎం రేవంత్‌ను కాపీ కొడుతున్న తమిళనాడు నూతన సీఎం విజయ్? నెట్టింట హాట్ టాపిక్!

తమిళనాడు నూతన ముఖ్యమంత్రిగా 'తమిళగ వెట్రి కళగం' (TVK) అధినేత జోసెఫ్ విజయ్ ప్రమాణ స్వీకారం చేశారు. ఈ సందర్భంగా విజయ్ చేసిన ప్రసంగం తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి మార్క్‌ను పొలిఉండటంతో నెట్టింట వైరల్ గా మారుతోంది.

New Update
FotoJet - 2026-05-10T113113.495

Revanth Mark's rule in Tamil Nadu

Tamil Nadu CM Vijay : తమిళనాడు నూతన ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన 'తమిళగ వెట్రి కళగం' (TVK) అధినేత జోసెఫ్ విజయ్.. బాధ్యతలు స్వీకరించిన తొలిరోజే తన పదునైన ప్రసంగంతో రాజకీయ ప్రకంపనలు సృష్టించారు. అయితే, ఆయన చేసిన ఈ తొలి ప్రసంగం ఇప్పుడు కేవలం తమిళనాడులోనే కాకుండా తెలుగు రాష్ట్రాల్లోనూ, ముఖ్యంగా సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్స్‌పై హాట్ టాపిక్‌గా మారింది. విజయ్ మాట్లాడిన విధానం, ఆయన ప్రకటించిన విధానాలు సరిగ్గా గతంలో తెలంగాణ ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి బాధ్యతలు స్వీకరించినప్పుడు చేసిన వ్యాఖ్యలను, అవలంబించిన వ్యూహాలను పోలి ఉండటంతో.. "తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డిని తమిళనాడు సీఎం విజయ్ కాపీ కొడుతున్నారా?" అంటూ నెటిజన్లు ఆసక్తికరమైన చర్చకు తెరలేపారు.

ముఖ్యమంత్రి విజయ్ చేసిన ప్రసంగంలో రేవంత్ రెడ్డి మార్క్‌ను గుర్తుకుతెచ్చిన ప్రధాన అంశాలు కొన్ని...

ఆర్థిక వాస్తవాలు – 'శ్వేతపత్రం' అస్త్రం

తమిళనాడు ఆర్థిక పరిస్థితి అత్యంత దారుణంగా తయారైందని, రాష్ట్రం ప్రస్తుతం దాదాపు పది లక్షల కోట్ల అప్పుల ఊబిలో కూరుకుపోయిందని విజయ్ ఆందోళన వ్యక్తం చేశారు. గత ప్రభుత్వాల వైఫల్యాలను ఎండగట్టేందుకు, పారదర్శకతను నిరూపించేందుకు త్వరలోనే రాష్ట్ర ఆర్థిక స్థితిగతులపై తాము 'శ్వేతపత్రం' (White Paper) విడుదల చేస్తామని ప్రకటించారు.

రేవంత్ రెడ్డి కనెక్షన్: తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రాగానే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సైతం గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో జరిగిన అప్పులు, ఆర్థిక విధ్వంసాన్ని ప్రజల ముందుంచడానికి విద్యుత్, ఆర్థిక తదితర శాఖలపై వరుసగా శ్వేతపత్రాలను విడుదల చేసిన సంగతి తెలిసిందే. సరిగ్గా అదే బాటలో విజయ్ నడవడం గమనార్హం.

"నేను దేవదూతను కాను.. మీ ఇంటి అన్నను, తమ్ముడిని"

తన ప్రసంగంలో విజయ్ అత్యంత వినమ్రంగా నడుచుకుంటూ ప్రజలతో నేరుగా కనెక్ట్ అయ్యే ప్రయత్నం చేశారు. "నేనేమీ పైనుంచి ఊడిపడ్డ దేవదూతను కాను.. మీలాంటి సామాన్యుడిని. మిమ్మల్ని పాలించే పాలకుడిగా కాకుండా, మీకు తోడుండే ఒక అన్నగా, తమ్ముడిగా ఉంటా" అంటూ ఉద్వేగభరిత వ్యాఖ్యలు చేశారు.

 తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా ప్రమాణ స్వీకారం చేసిన నాటి నుంచి నేటి వరకు నిరంతరం ఇదే నినాదాన్ని వాడుతున్నారు. "నన్ను ముఖ్యమంత్రిగా చూడకండి.. సచివాలయంలో కూర్చున్న మీ ఇంటి అన్నగా, తమ్ముడిగా భావించండి" అంటూ ఆయన ప్రజలకు కనెక్ట్ అయిన తీరును, ఇప్పుడు విజయ్ వ్యాఖ్యలు తు.చ. తప్పకుండా గుర్తుచేశాయి.

 ప్రజాధనం రక్షణ – పారదర్శక పాలన

అధికారంలోకి రావడం కోసం సాధ్యం కాని అబద్ధపు హామీలను ఇవ్వబోనని విజయ్ స్పష్టం చేశారు. ప్రజాధనంలో ప్రతి పైసాను ప్రజల కోసమే ఖర్చు పెడతామని, దోపిడీకి తావులేకుండా నిష్పక్షపాతమైన, అవినీతి రహిత పాలనను అందిస్తామని హామీ ఇచ్చారు.

గత ప్రభుత్వాల దుబారా ఖర్చులను నివారించి, ప్రజాధనాన్ని కాపాడుతామని, గ్యారెంటీల అమలులో పారదర్శకత పాటిస్తామని రేవంత్ రెడ్డి నిరంతరం చెప్పే మాటలకు ఇది కార్బన్ కాపీగా అనిపిస్తోందని నెటిజన్లు పోల్చి చూపిస్తున్నారు.

చీకటి రాజకీయాలకు స్వస్తి

రాష్ట్ర ప్రయోజనాల విషయంలో గానీ, రాజకీయ నిర్ణయాల విషయంలో గానీ తెరవెనుక రాజీ పడే ప్రసక్తే లేదని విజయ్ తెగేసి చెప్పారు. "ఎవరికీ తెలియకుండా చీకటి గదుల్లో ఒప్పందాలు చేసుకునే చీకటి రాజకీయాలు నేను చేయను. నా నిర్ణయాలన్నీ బహిరంగంగా, ప్రజల ముందే ఉంటాయి" అని ప్రకటించారు.

 రేవంత్ రెడ్డి సైతం గత పాలకుల రహస్య జీవోల సంస్కృతిని తప్పుబడుతూ, తమ ప్రభుత్వంలో ప్రతి ఫైలు, ప్రతి నిర్ణయం ప్రజల ముందు బహిరంగంగానే ఉంటుందని ప్రకటించి సంచలనం సృష్టించారు.

కార్యకర్తలే కొండంత బలం

ఈ చారిత్రాత్మక విజయానికి, కొత్త ప్రభుత్వ ఏర్పాటుకు రాత్రింబగళ్లు కష్టపడిన పార్టీ కార్యకర్తలే అసలైన మూలస్తంభాలని, వారి బలమే తనను ఈ పీఠంపై కూర్చోబెట్టిందని విజయ్ కొనియాడారు.

 సుదీర్ఘ కాలం ప్రతిపక్షంలో ఉండి, అనేక కష్టనష్టాల ఎదుర్కొని అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ విజయానికి కార్యకర్తలే నిజమైన సైనికులని రేవంత్ రెడ్డి ఎల్లప్పుడూ కీర్తిస్తుంటారు. అదే తరహా గుర్తింపును విజయ్ కూడా తన కార్యకర్తలకు ఇచ్చారు.

నెట్టింట జోరుగా సాగుతున్న విశ్లేషణలు

కొత్తగా బాధ్యతలు చేపట్టిన ఇద్దరు యువ నేతల ఆలోచనా విధానాలు, ప్రజాకర్షక నినాదాలు ఒకేలా ఉండటం యాదృచ్ఛికమే అయినప్పటికీ.. విజయ్ తన తొలి ప్రసంగం కోసం రేవంత్ రెడ్డి అనుసరించిన 'సక్సెస్ ఫార్ములా'ను క్షుణ్ణంగా అధ్యయనం చేశారనే చర్చ గట్టిగా సాగుతోంది.

సినిమా గ్లామర్ పక్కన పెట్టి సామాన్యుడిగా ప్రజల్లోకి వెళ్లాలనే విజయ్ తపన, రేవంత్ రెడ్డి సాధించిన రాజకీయ విజయాల వ్యూహాన్ని గుర్తుచేస్తుండటంతో.. ఈ ఇద్దరు ముఖ్యమంత్రుల భవిష్యత్తు దూకుడు ఎలా ఉండబోతోందనేది ఇప్పుడు రాజకీయ విశ్లేషకుల్లో ఆసక్తి రేకెత్తిస్తోంది.

Advertisment
తాజా కథనాలు