/rtv/media/media_files/2025/08/17/rahul-gandhi-2025-08-17-18-19-48.jpg)
Rahul Gandhi
మహిళా రిజర్వేషన్ బిల్లు అమలు దిశగా ప్రభుత్వం వేసిన అడుగుకు లోక్‌సభలో గట్టి ఎదురుదెబ్బ తగిలింది. 2029 సాధారణ ఎన్నికల నుండి మహిళా కోటాను అమలు చేయాలనే లక్ష్యంతో ప్రవేశపెట్టిన రాజ్యాంగ సవరణ బిల్లు శుక్రవారం నాటి ఓటింగ్‌లో వీగిపోయింది. ప్రతిపక్ష పార్టీలన్నీ ఏకతాటిపైకి వచ్చి బిల్లుకు వ్యతిరేకంగా ఓటు వేయడంతో, చట్టం ఆమోదం పొందేందుకు కావాల్సిన మూడింట రెండొంతుల మెజారిటీ లభించలేదు.
ఈ ఫలితంపై స్పందించిన లోక్‌సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ, రాజ్యాంగ సూత్రాలపై జరుగుతున్న దాడిని తాము విజయవంతంగా అడ్డుకున్నామని ప్రకటించారు. ఇది నిజమైన మహిళా రిజర్వేషన్ బిల్లు కాదని, దేశంలోని రాజకీయ, ఎన్నికల నిర్మాణాలను మార్చేందుకు చేస్తున్న ప్రయత్నమని ఆయన విమర్శించారు.
ప్రభుత్వానికి సూటి సవాల్
అదే సమయంలో రాహుల్ గాంధీ ప్రభుత్వానికి ఒక సూటి సవాల్ విసిరారు. "మీకు నిజంగా మహిళా రిజర్వేషన్లు తీసుకురావాలని ఉంటే, 2023లో ఆమోదించిన పాత మహిళా బిల్లును తీసుకురండి, దానిని నేటి నుండే అమలు చేయండి. దానికి ప్రతిపక్షాలన్నీ పూర్తి మద్దతు ఇస్తాయి. మహిళా బిల్లు తక్షణమే అమలు అయ్యేలా మేము బాధ్యత తీసుకుంటాం" అని ప్రధాని మోదీని ఉద్దేశించి ఆయన వ్యాఖ్యానించారు. నియోజకవర్గాల పునర్విభజనతో ముడిపెట్టడం వల్లనే ప్రస్తుత బిల్లును వ్యతిరేకించాల్సి వచ్చిందని ఆయన స్పష్టం చేశారు.
కాంగ్రెస్ ఎంపీ ప్రియాంక గాంధీ వాద్రా కూడా ఈ పరిణామంపై తీవ్రంగా స్పందించారు. ఈ బిల్లును అడ్డుకోవడం ప్రజాస్వామ్య విలువల విజయమని ఆమె అభివర్ణించారు. మహిళా కోటాను నియోజకవర్గాల పునర్విభజనతో, లింక్ చేయడం వల్లనే ఈ బిల్లు ఆమోదయోగ్యం కాకుండా పోయిందని ఆమె పేర్కొన్నారు. లోపభూయిష్టమైన ప్రతిపాదనను తిరస్కరించడం సమర్థనీయమని చెబుతూ, హత్రాస్, ఉన్నావో, మణిపూర్ వంటి ఘటనల్లో మహిళలపై జరుగుతున్న అన్యాయాలపై చర్యలు తీసుకోని వారు, ఇప్పుడు మహిళా హక్కుల గురించి మాట్లాడటం విడ్డూరంగా ఉందని ప్రభుత్వంపై మండిపడ్డారు.
శుక్రవారం లోక్‌సభలో జరిగిన ఓటింగ్‌లో బిల్లుకు అనుకూలంగా 298 ఓట్లు రాగా, వ్యతిరేకంగా 230 ఓట్లు వచ్చాయి. అయితే రాజ్యాంగ సవరణ బిల్లు ఆమోదం పొందాలంటే హాజరైన సభ్యులలో కనీసం మూడింట రెండొంతుల మంది మద్దతు ఉండాలి, ఆ సంఖ్య లేకపోవడంతో బిల్లు వీగిపోయినట్లు స్పీకర్ ఓం బిర్లా ప్రకటించారు. ఈ బిల్లు వీగిపోవడంతో, దీనికి అనుబంధంగా ఉన్న కేంద్రపాలిత ప్రాంతాల చట్టాల సవరణ బిల్లు, పునర్విభజన బిల్లులను ముందుకు తీసుకెళ్లే ఉద్దేశం ప్రభుత్వానికి లేదని పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి కిరణ్ రిజిజు వెల్లడించారు.
Follow Us