Raghav Chadha : నమ్మకస్తుడే నమ్మకం కోల్పోయాడా?.. రాఘవ్ చద్దాను కేజ్రీవాల్‌ ఎందుకు పక్కన పెట్టారంటే?

రాజ్యసభలో ఆమ్ ఆద్మీ పార్టీ డిప్యూటీ లీడర్‌ పదవి నుండి రాఘవ్ చడ్డాను తొలగించి, ఆయన స్థానంలో అశోక్ మిట్టల్‌ను నియమించింది. రాజ్యసభ వెబ్‌సైట్‌లో కూడా ఈ మార్పును వెంటనే అమలు చేశారు

New Update
raghav

రాజ్యసభలో ఆమ్ ఆద్మీ పార్టీ డిప్యూటీ లీడర్‌ పదవి నుండి రాఘవ్ చడ్డాను తొలగించి, ఆయన స్థానంలో అశోక్ మిట్టల్‌ను నియమించింది. ఈ మేరకు పార్టీ నాయకత్వం రాజ్యసభ సెక్రటేరియట్‌కు అధికారికంగా లేఖ పంపడంతో, రాజ్యసభ వెబ్‌సైట్‌లో కూడా ఈ మార్పును వెంటనే అమలు చేశారు. పంజాబ్ రాష్ట్రానికి చెందిన ఈ ఇద్దరు నేతలలో చద్దాను తప్పించడం ఇప్పుడు  రాజకీయ వర్గాల్లో పెద్ద చర్చకు దారితీసింది. ప్రస్తుతం రాజ్యసభలో ఆమ్ ఆద్మీ పార్టీకి మొత్తం 10 మంది సభ్యులు ఉండగా, అందులో విభేదాల కారణంగా దూరంగా ఉంటున్న స్వాతి మలివాల్ కూడా ఒకరు.

కేజ్రీవాల్‌కు అత్యంత నమ్మకస్తుడిగా పేరున్న రాఘవ్ చద్దాకు మంచి పేరు ఉంది అలాంటిది ఆయనను ఇలా అకస్మాత్తుగా పదవి నుండి తొలగించడం, పార్టీ అగ్రనాయకత్వంతో ఆయనకు విభేదాలు ఉన్నాయనే వార్తలకు మరింత బలాన్ని చేకూర్చింది. గత కొంతకాలంగా పార్టీ కార్యక్రమాల్లో ఆయన చురుగ్గా కనిపించడం లేదు. జాతీయ ప్రతినిధిగా ఉన్నప్పటికీ పార్టీ సీనియర్లు లేవనెత్తుతున్న పలు అంశాలపై ఆయన మౌనంగా ఉండటం, కేజ్రీవాల్ నిర్వహించే ముఖ్యమైన సమావేశాలకు దూరంగా ఉండటం చూస్తుంటే చద్దాను పార్టీ పక్కన పెట్టినట్లు స్పష్టమవుతోంది.

కేజ్రీవాల్ అరెస్ట్ సమయంలో

ముఖ్యంగా 2024 మార్చిలో లిక్కర్ పాలసీ కేసులో కేజ్రీవాల్ అరెస్ట్ అయిన సమయంలో రాఘవ్ చద్దా ఎక్కడా కనిపించకపోవడం పార్టీలో అసంతృప్తికి బీజం వేసింది. ఆ సమయంలో ఆయన చికిత్స కోసం విదేశాలకు వెళ్లారని పార్టీ సర్దిచెప్పే ప్రయత్నం చేసినప్పటికీ, ఆయన సుదీర్ఘ కాలం పాటు మౌనంగా ఉండటాన్ని కేజ్రీవాల్ జీర్ణించుకోలేకపోయినట్లు తెలుస్తోంది. ఇటీవలే ఈ కేసులో కేజ్రీవాల్, మనీష్ సిసోడియాలు కోర్టు ద్వారా విముక్తి పొందినప్పుడు కూడా చద్దా కనీసం ఒక్క ప్రకటన కూడా చేయకపోవడం గమనార్హం.

కేజ్రీవాల్ నిర్వహించిన విలేకరుల సమావేశంలో కానీ, జంతర్ మంతర్ వద్ద జరిగిన భారీ ర్యాలీలో కానీ రాఘవ్ చద్దా ఎక్కడా కనిపించలేదు. సాధారణంగా పార్లమెంటులో ప్రజల సమస్యలపై గళమెత్తే ఆయన, పార్టీ కీలక పరిణామాలపై స్పందించకపోవడం చర్చనీయాంశమైంది. ఈ పరిణామాల నేపథ్యంలో ఆయన తన ఎక్స్ ఖాతాలో ఒక ఆసక్తికరమైన వీడియోను పోస్ట్ చేశారు. సామాన్యుల పన్నుల భారం, గిగ్ వర్కర్ల హక్కులపై తాను గతంలో చేసిన ప్రసంగాలను క్రోడీకరిస్తూ ఆ వీడియోను ఉంచారు. దానికి దిష్టి తగలకుండా ఉండే (evil eye)' ఎమోజీని జోడించడం ద్వారా ఆయన పరోక్షంగా తన అసంతృప్తిని వెళ్లగక్కారు.

Advertisment
తాజా కథనాలు