అమెరికా - భారత్ ఒప్పందంతో వీటి ధరలు భారీగా తగ్గనున్నాయ్

భారత్, అమెరికా ఒప్పందంపై కేంద్ర వాణిజ్య మరియు పరిశ్రమల శాఖ మంత్రి పీయూష్ గోయల్ కీలక ప్రకటన చేశారు. ఈ ఒప్పందంతో భారతీయ ఎగుమతిదారులకు అగ్రరాజ్యంలో భారీ మార్కెట్ లభిస్తుందని, మన రైతుల ప్రయోజనాలకు ఎలాంటి హాని కలగకుండా రక్షణ కల్పించామని ఆయన స్పష్టం చేశారు.

New Update
US offers Venezuelan oil to India as Russian crude imports fall

US offers Venezuelan oil to India as Russian crude imports fall

భారత్, అమెరికా మధ్య కుదిరిన చారిత్రాత్మక వాణిజ్య ఒప్పందంపై కేంద్ర వాణిజ్య మరియు పరిశ్రమల శాఖ మంత్రి పీయూష్ గోయల్ కీలక ప్రకటన చేశారు. ఈ డీల్ 2026 మార్చిలో చట్టబద్దం కానుంది. ఈ ఒప్పందంతో భారతీయ ఎగుమతిదారులకు అగ్రరాజ్యంలో భారీ మార్కెట్ లభిస్తుందని, మన రైతుల ప్రయోజనాలకు ఎలాంటి హాని కలగకుండా రక్షణ కల్పించామని ఆయన స్పష్టం చేశారు. శనివారం న్యూఢిల్లీలో జరిగిన మీడియా సమావేశంలో ఆయన ఈ వివరాలు వెల్లడించారు.

అమెరికా మార్కెట్‌లో భారత్‌కు పెద్ద పీట

ఈ ఒప్పందంలో భాగంగా అమెరికా తన 'మోస్ట్ ఫేవరెడ్ నేషన్' ఫ్రేమ్‌వర్క్ కింద భారతీయ ఎగుమతిదారులకు అపారమైన అవకాశాలను కల్పించింది. దీనివల్ల సుమారు 30 ట్రిలియన్ డాలర్ల అంతర్జాతీయ మార్కెట్ భారతీయ ఉత్పత్తులకు అందుబాటులోకి వస్తుందని గోయల్ తెలిపారు. గతంలో ఉన్న 50% టారీఫ్‌లను  18 శాతానికి తగ్గించారు. ఇది పొరుగు దేశాలైన చైనా, వియత్నాం, బంగ్లాదేశ్ కంటే తక్కువ.దీంతో జెనరిక్ మందులు, రత్నాలు, వజ్రాలు, విమాన విడిభాగాలు, స్మార్ట్‌ఫోన్ల వంటి కీలక వస్తువులపై టారీఫ్‌లు లేవు. ప్రతిపక్షాల విమర్శలను తిప్పికొట్టిన గోయల్, వ్యవసాయ రంగాన్ని ఈ ఒప్పందంలో ఎలా కాపాడారో వివరించారు. 

సున్నా సుంకం ఎగుమతులు: భారతీయ రైతులు పండించే మసాలా దినుసులు, టీ, కాఫీ, జీడిపప్పు, మామిడి, అరటి వంటి ఉత్పత్తులను అమెరికాకు ఎటువంటి సుంకం లేకుండా ఎగుమతి చేసుకోవచ్చు.
దిగుమతులపై రక్షణ: అమెరికా నుంచి వచ్చే వ్యవసాయ ఉత్పత్తులపై భారత్ ఎటువంటి రాయితీలు ఇవ్వలేదు. గోధుమలు, వరి, మొక్కజొన్న, సోయా, పాల ఉత్పత్తులు (చీజ్, పాలు), మాంసం వంటి సున్నితమైన రంగాలకు పూర్తి రక్షణ కల్పించామని మంత్రి స్పష్టం చేశారు.
జీఎం పంటలకు నో: ముఖ్యంగా జన్యుమార్పిడి పంటలను భారత్‌లోకి అనుమతించబోమని, ఇది మన గ్రామీణ జీవనోపాధిని కాపాడటంలో రాజీలేని నిర్ణయమని ఆయన పేర్కొన్నారు.

ఈ ఒప్పందం వల్ల టెక్స్‌టైల్స్, లెదర్, హ్యాండీక్రాఫ్ట్స్ వంటి రంగాల్లో లక్షలాది కొత్త ఉద్యోగాలు వస్తాయని, ముఖ్యంగా మహిళలు, యువతకు ఇది గొప్ప అవకాశమని గోయల్ అన్నారు. 'వికసిత్ భారత్ 2047' లక్ష్య సాధనలో ఈ వాణిజ్య ఒప్పందం ఒక మైలురాయిగా నిలుస్తుందని ఆయన ధీమా వ్యక్తం చేశారు. ప్రధాని మోదీ, అమెరికా అధ్యక్షుడు ట్రంప్ మధ్య ఉన్న సన్నిహిత సంబంధాల వల్లే ఈ ఫ్యూచర్ డిఫైనింగ్ డీల్ సాధ్యమైందని ఆయన కొనియాడారు.

ఈ ఒప్పందంలో అత్యంత ముఖ్యమైంది మెడికల్ ప్రాడక్ట్స్‌పై టారీఫ్‌లు తొలగింపు. క్యాన్సర్, గుండె సంబంధిత వ్యాధులు, న్యూరో చికిత్సల్లో వాడే కీలకమైన మందులపై భారతదేశం సున్నా సుంకాన్ని విధించనుంది. దీనివల్ల ప్రాణాంతక వ్యాధులకు చికిత్స పొందే రోగులకు మందుల ధరలు తగ్గి భారీ ఉపశమనం లభిస్తుంది. అలాగే, దేశీయంగా కొరత ఉన్న కొన్ని వైద్య పరికరాలకు కూడా మినహాయింపులు ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించింది. అమెరికా నుండి దిగుమతి అయ్యే డ్రై ఫ్రూట్స్, కెమికల్స్, కాస్మోటిక్స్ పై పన్నులు తగ్గనున్నాయి.  వచ్చే ఐదేళ్లలో అమెరికా నుంచి సుమారు 500 బిలియన్ డాలర్ల విలువైన కొనుగోళ్లు జరపాలని భారత్ లక్ష్యంగా పెట్టుకుంది. ఇందులో ఇంధన ఉత్పత్తులు, విమానాలు, వాటి విడిభాగాలు, అలాగే విలువైన లోహాలు, కోకింగ్ బొగ్గు, లెటెస్ట్ టెక్నాలజీ ప్రాడక్ట్స్ ఉన్నాయి.

Advertisment
తాజా కథనాలు