/rtv/media/media_files/2026/04/06/himanth-2026-04-06-07-17-43.jpg)
అస్సాం సీఎం హిమంత బిస్వ శర్మ భార్య రినికి శర్మపై కాంగ్రెస్ పార్టీ సంచలన ఆరోపణలు చేసింది. ఆమెకు మూడు వేర్వేరు దేశాల పాస్‌పోర్టులు ఉన్నాయని, విదేశాల్లో భారీగా ఆస్తులు కూడబెట్టారని కాంగ్రెస్ నేత పవన్ ఖేరా ఆరోపించారు. అయితే ఈ ఆరోపణలను ముఖ్యమంత్రి తీవ్రంగా ఖండించారు. ఇవన్నీ కేవలం రాజకీయ కక్షతో చేస్తున్న తప్పుడు ప్రచారమని, దీనిపై పవన్ ఖేరాపై కోర్టులో పరువు నష్టం దావా వేస్తానని ఆయన స్పష్టం చేశారు.
34 బిలియన్ డాలర్ల బడ్జెట్‌తో
ఒక మీడియా సమావేశంలో మాట్లాడిన పవన్ ఖేరా.. రినికి శర్మకు యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (UAE), ఈజిప్ట్, ఆంటిగ్వా దేశాల పాస్‌పోర్టులు ఉన్నాయని కొన్ని పత్రాలను విడుదల చేశారు. దుబాయ్‌లో ఆమెకు ఖరీదైన ఆస్తులు ఉన్నాయని, అమెరికాలోని వ్యోమింగ్‌లో దాదాపు 34 బిలియన్ డాలర్ల బడ్జెట్‌తో ఒక కంపెనీని కూడా నడుపుతున్నారని ఆయన పేర్కొన్నారు. దేశంలో రెండు పౌరసత్వాలకు అవకాశం లేదని, మరి ఆమెకు ఇన్ని పాస్‌పోర్టులు ఎలా వచ్చాయని ఆయన ప్రశ్నించారు. ఈ ఆస్తుల వివరాలను ఎన్నికల అఫిడవిట్‌లో ఎందుకు చూపలేదని ప్రశ్నిస్తూ, సీఎంను పదవి నుండి తొలగించాలని డిమాండ్ చేశారు.
ఈ ఆరోపణలపై ఎక్స్ వేదికగా స్పందించిన ముఖ్యమంత్రి.. కాంగ్రెస్ పార్టీ ఓటమి భయంతోనే ఇలాంటి పిచ్చి ఆరోపణలు చేస్తోందని మండిపడ్డారు. పవన్ ఖేరా చూపించిన పత్రాలన్నీ ఫోర్జరీ చేసినవని, వాటిలో ఎన్నో తప్పులు ఉన్నాయని ఆయన ఎండగట్టారు. పాస్‌పోర్టులలో పేర్లు తప్పుగా ఉన్నాయని, ఫోటోలు కూడా సరిగ్గా లేవని ఆయన వేలెత్తి చూపారు. డిజిటల్ టెక్నాలజీ ఉపయోగించి తప్పుడు పత్రాలు సృష్టించారని, సత్యం త్వరలోనే బయటపడుతుందని ఆయన ధీమా వ్యక్తం చేశారు.
తమ కుటుంబంపై ఇటువంటి అసత్య ప్రచారాలు చేసినందుకు గాను 48 గంటల్లో పవన్ ఖేరాపై క్రిమినల్, సివిల్ పరువు నష్టం దావా వేస్తామని సీఎం ప్రకటించారు. అబద్ధాలు ప్రచారం చేసే వారు కచ్చితంగా జైలుకు వెళ్తారని ఆయన హెచ్చరించారు. అస్సాం అసెంబ్లీ ఎన్నికల ముందు చోటు చేసుకున్న ఈ పరిణామం ఇప్పుడు దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది.
Follow Us