/rtv/media/media_files/2026/04/21/dahood-2026-04-21-10-26-46.jpg)
పెళ్లి విందులు ఆ ఇళ్లలో తీవ్ర విషాదాన్ని నింపాయి. వేడుకల్లో వడ్డించిన ఆహారం కలుషితం కావడంతో గుజరాత్, ఉత్తరాఖండ్ రాష్ట్రాల్లో వందలాది మంది అతిథులు ప్రాణాపాయ స్థితిలో ఆసుపత్రుల్లో చేరారు. కేవలం కొన్ని గంటల వ్యవధిలోనే ఆనందమయమైన వాతావరణం కాస్తా ఆర్తనాదాలతో నిండిపోయింది. గుజరాత్‌లోని దాహోద్ జిల్లాలో సుమారు 400 మంది, ఉత్తరాఖండ్‌లోని తెహ్రీ జిల్లాలో డజన్ల కొద్దీ ప్రజలు తీవ్ర అస్వస్థతకు గురయ్యారు.
VIDEO | Gujarat: Over 400 fall ill after suspected food poisoning at wedding in Dahod's Abhlod, several hospitalised, probe underway by health officials.#Gujarat#Dahod
— Press Trust of India (@PTI_News) April 21, 2026
(Full video available on PTI Videos - https://t.co/n147TvrpG7) pic.twitter.com/lO4CZ1wOzQ
వికారం, వాంతులు, కడుపునొప్పి
గుజరాత్‌లోని దాహోద్ జిల్లా, అభ్లోడ్ గ్రామంలో నిర్వహించిన ఒక వివాహ వేడుక ఒక్కసారిగా గందరగోళానికి దారితీసింది. వేడుక ముగిసిన కొన్ని గంటలకే భోజనం చేసిన అతిథులలో వికారం, వాంతులు, కడుపునొప్పి, కళ్లు తిరగడం వంటి లక్షణాలు కనిపించాయి. సుమారు 400 మందికి పైగా అస్వస్థతకు గురవడంతో స్థానికంగా భయాందోళనలు నెలకొన్నాయి. వెంటనే రంగంలోకి దిగిన ఆరోగ్య శాఖ అధికారులు పరిస్థితిని సమీక్షిస్తున్నారు. బాధితులను వివిధ ఆసుపత్రులకు తరలించి చికిత్స అందిస్తున్నారు. ఆహార పదార్థాల నమూనాలను సేకరించి విచారణ చేపట్టారు.
మరోవైపు ఉత్తరాఖండ్‌లోని తెహ్రీ జిల్లా బాద్‌షాహీతౌల్ ప్రాంతంలో జరిగిన వివాహ వేడుకలోనూ కలుషిత ఆహారం కలకలం రేపింది. ధర్సాల్, జుగాడ్ గ్రామాలకు చెందిన మహిళలు, చిన్న పిల్లలు ఎక్కువగా ఈ ప్రమాదానికి గురయ్యారు. బుధవారం 15 మంది, గురువారం మరో 20 మంది వరుసగా ఆసుపత్రుల్లో చేరారు. వీరంతా వాంతులు, విరేచనాలు, కడుపునొప్పితో బాధపడుతున్నట్లు వైద్యులు తెలిపారు.
జిల్లా ఆసుపత్రి చీఫ్ మెడికల్ సూపరింటెండెంట్ డాక్టర్ అమిత్ రాయ్ మాట్లాడుతూ.. ప్రస్తుతం రోగులందరి పరిస్థితి స్థిరంగా ఉందని, వైద్య సిబ్బంది వారిని నిరంతరం పర్యవేక్షిస్తున్నారని తెలిపారు. కొందరు ప్రాథమిక చికిత్స అనంతరం డిశ్చార్జ్ కాగా, మరికొందరు అబ్జర్వేషన్‌లో ఉన్నారు.
ఫుడ్ సేఫ్టీ డిపార్ట్‌మెంట్ ఈ ఘటనలపై లోతైన విచారణ ప్రారంభించింది. వివాహ వేడుకల్లో ఉపయోగించిన గోధుమ పిండి, పప్పులు, శెనగపిండి, నూడుల్స్ వంటి పదార్థాల నమూనాలను సేకరించి ల్యాబొరేటరీ పరీక్షలకు పంపారు. నివేదిక వచ్చిన తర్వాత బాధ్యులపై చర్యలు తీసుకుంటామని అధికారులు పేర్కొన్నారు.
Follow Us