/rtv/media/media_files/2026/04/17/amit-shah-2026-04-17-18-50-42.jpg)
లోక్‌సభలో మహిళా రిజర్వేషన్లు, డీలిమిటేషన్ బిల్లులపై సుదీర్ఘంగా చర్చ జరుగుతోంది. ఈ సందర్భంగా కేంద్ర హోంమంత్రి అమిత్ షా మాట్లాడుతూ.. మహిళలకు మేలు చేసేందుకే ఈ బిల్లులను తెచ్చామని స్పష్టం చేశారు.మహిళా బిల్లుపై సభలో అందరూ తమ అభిప్రాయాలు చెప్పేందుకు స్పీకర్ పూర్తి అవకాశం ఇచ్చారని అమిత్ షా గుర్తుచేశారు. విపక్ష కూటమి అయిన ఇండియా సభ్యులు పైకి మద్దతిస్తున్నామని చెబుతూనే, రకరకాల కారణాలు వెతుకుతూ ఈ బిల్లులను అడ్డుకుంటున్నారని ఆయన విమర్శించారు. విపక్షాలకు మహిళా సాధికారతపై చిత్తశుద్ధి లేదని, వారిది మహిళా వ్యతిరేక ఆలోచనా విధానమని మండిపడ్డారు.
దేశంలోని వివిధ నియోజకవర్గాల్లో ఓటర్ల సంఖ్యలో ఉన్న భారీ తేడాలను సరిదిద్దడానికే ఈ సవరణలు చేస్తున్నామని అమిత్ షా వివరించారు. ఒకచోట లక్షల్లో ఓటర్లు ఉంటే, మరోచోట వేలల్లోనే ఉన్నారని.. దీనివల్ల ఎంపీలు ప్రజల సమస్యలను సరిగ్గా పట్టించుకోలేకపోతున్నారని ఆయన అభిప్రాయపడ్డారు. ఓటర్ల సంఖ్య సమానంగా ఉంటేనే నిధులు సరిగ్గా ఖర్చవుతాయని, అందుకే ఈ మార్పులు అవసరమని చెప్పారు. ఈ చర్చలో మొత్తం 130 మంది ఎంపీలు పాల్గొనగా, అందులో 56 మంది మహిళా ఎంపీలు తమ గళాన్ని వినిపించారు.
1970 తర్వాత లోక్‌సభ సీట్లు పెంచలేదని, జనాభా పెరిగినప్పుడు దానికి తగ్గట్లుగా నియోజకవర్గాల సంఖ్య పెరగాలని షా వివరించారు. ఎస్సీ, ఎస్టీల జనాభా పెరిగినప్పుడు చట్టసభల్లో వారి ప్రాతినిధ్యం కూడా పెరగాలి కదా అని ప్రశ్నించారు. జనాభా లెక్కలకు, నియోజకవర్గాల పునర్విభజనకు లింకు పెట్టింది కాంగ్రెస్ పార్టీనే అని ఆయన స్పష్టం చేశారు.
2029 ఎన్నికల నాటికి మహిళలకు 33 శాతం రిజర్వేషన్లు అమలు చేయాలన్నదే ప్రధాని మోదీ బలమైన సంకల్పమని అమిత్ షా తెలిపారు. డీలిమిటేషన్ ప్రక్రియలో భాగంగా ప్రతి నియోజకవర్గంలో ప్రజల అభిప్రాయాలను సేకరిస్తామని చెప్పారు. ప్రభుత్వంపై నమ్మకం ఉంచాలని, ఏవైనా చిన్న చిన్న లోటుపాట్లు ఉంటే సరిదిద్దుకోవడానికి సిద్ధంగా ఉన్నామని విపక్షాలకు పిలుపునిచ్చారు.
ఆమోదంపై తీవ్ర ఉత్కంఠ
ప్రస్తుతం ఈ బిల్లుల ఆమోదంపై తీవ్ర ఉత్కంఠ నెలకొంది. ఈ బిల్లులు చట్టం కావాలంటే సభలో మూడింట రెండొంతుల మెజారిటీ (కనీసం 360 ఓట్లు) తప్పనిసరి. ప్రస్తుతం అధికార ఎన్డీఏ కూటమికి 292 ఓట్ల బలం ఉండగా, విపక్షాలకు 233 మంది సభ్యులు ఉన్నారు. ప్రధాని మోదీ ఈ బిల్లులకు మద్దతు ఇవ్వాలని అందరినీ కోరుతుండగా, కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ మాత్రం డీలిమిటేషన్ బిల్లును ఎలాగైనా ఓడిస్తామని సవాల్ చేస్తున్నారు. రాత్రి 7 గంటల తర్వాత ఓటింగ్ జరిగే అవకాశం ఉండటంతో, ఫలితం ఎలా ఉంటుందనేది ఇప్పుడు అందరిలోనూ ఆసక్తి రేపుతోంది.
Follow Us