Pahalgam Terror Attack : పహల్గాం దాడికి ఏడాది పూర్తి...ప్రతి భారతీయుడి కళ్లలో రక్తంప్రవహించిన రోజు

జమ్మూ కాశ్మీర్‌లోని పహల్గాం సమీపంలో పర్యాటకులపై జరిగిన ఆ కిరాతక దాడి నేటికి సరిగ్గా ఏడాది పూర్తి చేసుకుంది. 2025, ఏప్రిల్ 22న జరిగిన ఆ రక్తపాతం దేశాన్నికలిచివేసింది. దానికి ప్రతిస్పందనగా భారత్ 'ఆపరేషన్ సిందూర్' వంటి భారీ ప్రతీకార చర్యకు దిగాల్సి వచ్చింది.

New Update
pahalgam attack

pahalgam attack

Pahalgam Terror Attack : జమ్మూ కాశ్మీర్‌లోని పహల్గాం సమీపంలో పర్యాటకులపై జరిగిన ఆ కిరాతక దాడి నేటికి సరిగ్గా ఏడాది పూర్తి చేసుకుంది. 2025, ఏప్రిల్ 22న జరిగిన ఆ రక్తపాతం దేశాన్ని ఎంతలా కలిచివేసిందంటే, దానికి ప్రతిస్పందనగా భారత్ 'ఆపరేషన్ సిందూర్' వంటి భారీ ప్రతీకార చర్యకు దిగాల్సి వచ్చింది.

 
ఆ రోజు ఏం జరిగింది? (ఏప్రిల్ 22, 2025)..

ఉదయం 11:30 - ప్రశాంతమైన లోయలో అలజడి:

పహల్గాంకు అతి సమీపంలో ఉన్న బైసరాన్ వ్యాలీ  లో వందలాది మంది పర్యాటకులు ప్రకృతిని ఆస్వాదిస్తున్నారు. కొందరు గుర్రపు స్వారీ చేస్తున్నారు, మరికొందరు ఫోటోలు దిగుతున్నారు. సరిగ్గా అదే సమయంలో అదనపు బలగాల ముసుగులో (సైనిక దుస్తుల్లో) ఐదుగురు ముష్కరులు అక్కడికి చేరుకున్నారు. తమ దగ్గర ఉన్న ఏకే-47 తుపాకులతో ఉగ్రవాదులు ఒక్కసారిగా పర్యాటకులపై విచక్షణారహితంగా కాల్పులు జరిపారు. పర్యాటకులు ప్రాణభయంతో పరుగులు తీస్తుంటే, ఉగ్రవాదులు వెంబడించి మరీ కాల్పులు జరపడం ఆనాటి దారుణానికి పరాకాష్ట. ఉగ్రవాదులు పర్యాటకుల మతాన్ని అడిగి తెలుసుకుని మరీ కాల్పులు జరిపినట్లు ప్రత్యక్ష సాక్షులు తెలిపారు. “నువ్వు హిందువా? ముస్లిం హా?” అని అడిగారు. ఒకవేళ ముస్లిం అయితే.. కల్మా చదువమన్నారు. అంతేకాదు.. కొందరి ప్యాంట్లు విప్పి మరీ చెక్ చేశారు. హిందువులపై విచక్షణారహితంగా కాల్పులు జరిపారు. 

ఈ కాల్పుల్లో 26 మంది ప్రాణాలు కోల్పోయారు. వీరిలో 25 మంది భారతీయ పర్యాటకులు కాగా, ఒకరు నేపాలీ పౌరుడు. దాదాపు 20 మందికి పైగా తీవ్రంగా గాయపడ్డారు. మృతుల్లో మహిళలు, చిన్న పిల్లలు కూడా ఉండటం దేశవ్యాప్తంగా ఆగ్రహావేశాలకు దారితీసింది.దాడి జరిగిన కొద్దిసేపటికే 'ది రెసిస్టెన్స్ ఫ్రంట్' (TRF) ఈ ఘాతుకానికి బాధ్యత వహించింది. కాశ్మీర్‌లో పర్యాటక రంగం పుంజుకోవడం, సాధారణ స్థితి నెలకొనడం ఇష్టం లేని సరిహద్దు అవతలి శక్తులు ఈ పన్నాగం పన్నాయని నిఘా వర్గాలు ధ్రువీకరించాయి.

కర్ణాటకలోని శివమొగ్గకు చెందిన మంజునాథ్ అనే పర్యాటకుడిని ఉగ్రవాదులు పహల్గామ్‌లో కాల్చి చంపారు. ఈ దాడి సమయంలో అతని భార్య పల్లవి, కుమారుడు అక్కడే ఉన్నారు. భర్తను చంపిన తర్వాత, తనను కూడా చంపమని పల్లవి వేడుకోగా.. ఉగ్రవాదులు తనను చంపకుండా, “వెళ్లి మీ మోడీకి చెప్పుకో” అని వ్యాఖ్యానించారు. ఈ మారణకాండ జరిగిన వెంటనే కేంద్ర ప్రభుత్వం అత్యున్నత స్థాయి సమీక్ష నిర్వహించింది. "రక్తం చిందించిన వారిని వదిలిపెట్టం" అని ప్రధాని హెచ్చరించారు.

పహల్గాం దాడిని తీవ్రంగా పరిగణించిన భారత్ ప్రతిచర్యలు ప్రారంభించింది. ప్రధాని మోదీ నేతృత్వంలో సుమారు రెండు గంటల పాటు జరిగిన సీసీఎస్ ( భద్రతా వ్యవహారాల క్యాబినెట్ కమిటీ) సమావేశంలో పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు.భారత్, పాకిస్తాన్ మధ్య ఉన్న 1960 నాటి సింధు జలాల ఒప్పందాన్ని తక్షణం తాత్కాలిక నిలుపుదల చేస్తున్నట్లు ప్రకటించారు. సీమాంతర ఉగ్రవాదానికి పాకిస్తాన్ మద్దతు నిలిపివేసేంత వరకు ఇది అమలవుతుంది. పాకిస్తాన్ పౌరులను భారత్‌లోకి అనుమతించేది లేదని కేంద్రం స్పష్టం చేసింది. గతంలో పాకిస్తానీయులకు జారీచేసిన ప్రత్యేక వీసాలు వెంటనే రద్దవుతాయని, ప్రత్యేక వీసా కింద భారత్‌లో ఉన్న పాకిస్తానీయులు 48 గంటల్లో దేశం విడిచి వెళ్లాలని ఆదేశించింది.

ఢిల్లీలోని పాకిస్తాన్ హైకమిషన్‌లో ఉన్న రక్షణ, సైనిక, నేవీ, వైమానిక సలహాదారులు వారం రోజుల్లోనే దేశం విడిచి వెళ్లాలని ఆదేశించింది. అలాగే పాకిస్తాన్‌ రాజధాని ఇస్లామాబాద్‌లో ఉన్న భారత హైకమిషన్ కార్యాలయంలో ఉన్న ఇదే హోదా గల భారత ఉద్యోగులను వెనక్కు పిలిపించింది.పాకిస్తాన్ సరిహద్దులో ఉన్న అటారీ చెక్‌పోస్ట్‌ను మూసివేస్తున్నట్టు ప్రకటించింది. భారత్ వైపు నుంచి సరైన పత్రాలతో వెళ్లినవారు కూడా ఈ ఏడాది మే 1 లోపు తిరిగి రావాలని తెలిపింది.పహల్గాం కాల్పుల అనుమానితుల చిత్రాలను భద్రతా సంస్థలు విడుదల చేశాయి. కాల్పుల్లో ముగ్గురు పాల్గొన్నట్టు భద్రతాదళాలు అనుమానిస్తున్నాయని పీటీఐ తెలిపింది.

ఈ క్రమంలోనే 2025, మే 7న 'ఆపరేషన్ సిందూర్' పేరుతో సరిహద్దు అవతల ఉన్న 9 ఉగ్రవాద స్థావరాలను భారత వైమానిక దళం, సైన్యం ధ్వంసం చేశాయి. ఈ ఆపరేషన్‌లో పహల్గాం దాడికి ప్లాన్ చేసిన కీలక ఉగ్రవాద నేతలు హతమయ్యారు. లష్కరే తోయిబా (LeT) ప్రధాన కార్యాలయం మురిద్కే, జైషే మహ్మద్ (JeM) కేంద్రం బహావల్పూర్‌తో పాటు పలు లాంచ్ ప్యాడ్‌లను ధ్వంసం చేశారు. ఈ ఆపరేషన్‌లో సుమారు 100 మందికి పైగా ఉగ్రవాదులు హతమైనట్లు రక్షణ శాఖ వెల్లడించింది. ఎక్కడా పాక్ సైనిక స్థావరాలను గానీ, సామాన్య పౌరులను గానీ లక్ష్యంగా చేసుకోకుండా కేవలం ఉగ్రవాద మౌలిక సదుపాయాలనే భారత్ ధ్వంసం చేసింది.

ఆపరేషన్ సిందూర్ పేరుతో అర్ధరాత్రి పాకిస్తాన్‌‌పై భారత్ క్షిపణి దాడులు చేసింది. మంగళవారం(మే 6) అర్ధరాత్రి దాటిన తరువాత 1.44 గంటలకు భారత రక్షణ మంత్రిత్వ శాఖ పత్రిక ప్రకటన విడుదల చేసింది.''పాకిస్తాన్, పాకిస్తాన్ ఆక్రమిత కశ్మీర్‌లోని ఉగ్రవాద స్థావరాలను ఈ ఆపరేషన్ లక్ష్యంగా చేసుకుంది. ఈ స్థావరాల నుంచే భారత్‌పై ఉగ్రవాద దాడులకు ప్రణాళిక వేసి అమలు చేశారు. మొత్తం తొమ్మిది ప్రాంతాలను లక్ష్యంగా చేసుకున్నాం'' అని ఆ ప్రకటనలో తెలిపింది.పహల్గాం దాడిలో భర్తలను కోల్పోయిన మహిళలకు గౌరవంగా ఆపరేషన్ సిందూర్ అన్న పేరును స్వయంగా ప్రధాని నరేంద్రమోదీ పెట్టారని న్యూస్ ఏజెన్సీ పీటీఐ తెలిపింది.

పాకిస్తాన్‌పై దాడుల వివరాలను భారత విదేశీ వ్యవహారాల శాఖ కార్యదర్శి విక్రమ్ మిస్రీ మీడియాకు వివరించారు. కల్నల్ సోఫియా ఖురేషి, వింగ్ కమాండర్ వ్యోమిక సింగ్‌తో కలిసి మీడియాకు వివరాలు తెలియజేశారు.సీమాంతర దాడులపై స్పందించే హక్కు భారత్‌కు ఉందని, అందుకు అనుగుణంగా భారత్ దాడులు చేసిందని విక్రమ్ మిస్రీ తెలిపారు.భారత ఆర్మీ అర్ధరాత్రి 1:05 నుంచి 1:30 గంటల మధ్య ఆపరేషన్ సిందూర్ నిర్వహించిందని ఇండియన్ ఆర్మీకి చెందిన కల్నల్ సోఫియా ఖురేషి తెలిపారు.

''ఏప్రిల్ 22న పహల్గాంలో జరిగిన క్రూరమైన ఉగ్రవాదదాడిలో బాధితులుగా ఉన్న సాధారణ పౌరుల కుటుంబాలకు న్యాయం చేసేందుకు ఈ ఆపరేషన్ ప్రారంభించాం. తొమ్మిది ఉగ్రవాద శిబిరాలను లక్ష్యంగా చేసుకుని, వాటిని పూర్తిగా ధ్వంసం చేశాం'' అని సోఫియా తెలిపారు.భారత వైమానిక దాడుల్లో 26 మంది చనిపోయారని, 46మంది గాయపడ్డారని పాకిస్తాన్ మిలటరీ ప్రతినిధి లెఫ్టినెంట్ జనరల్ అహ్మద్ షరీఫ్ చౌధురీ ప్రకటించారు.
 
 ఆపరేషన్ సిందూర్ తర్వాత మే 8, 9 తేదీల్లో భారత్-పాక్ మధ్య గగనతలంలో స్వల్ప ఘర్షణలు జరిగాయి. పాక్ డ్రోన్ల ద్వారా భారత ధార్మిక స్థలాలను (జమ్మూలోని శంభు ఆలయం, పూంచ్‌లోని గురుద్వారా) లక్ష్యంగా చేసుకునే ప్రయత్నం చేయగా, భారత్ వాటిని తిప్పికొట్టింది. ఈ ఘటన తర్వాత భారత్ పాక్ పౌరుల వీసాలను రద్దు చేసి, వారిని స్వదేశానికి పంపించివేసింది. సార్క్ (SAARC) వీసా మినహాయింపు పథకాన్ని కూడా నిలిపివేసింది.క్వాడ్ (QUAD), బ్రిక్స్ (BRICS) దేశాలతో పాటు ఫ్రాన్స్, రష్యా, జర్మనీ వంటి దేశాలు భారత్ తన ఆత్మరక్షణ కోసం తీసుకున్న ఈ నిర్ణయాన్ని సమర్థించాయి.

ఆపరేషన్ సిందూర్ తర్వాత భారత సైన్యం, CRPF, జమ్మూ కశ్మీర్ పోలీసులు సంయుక్తంగా ‘ఆపరేషన్ మహాదేవ్’ చేపట్టారు. పహల్గాం దాడికి పాల్పడ్డ ముగ్గురు ఉగ్రవాదులను లేపేశారు. సులేమాన్ అలియాస్ ఫైజల్ జాట్ , హంజా ఆఫ్ఘని , జిబ్రాన్  అనే ఉగ్రవాదులను లేపేశారు.
 
నేటికి ఆ ఘటన జరిగి ఏడాది పూర్తయిన సందర్భంగా లోయలో భద్రతను అత్యంత కట్టుదిట్టం చేశారు. పహల్గాంలో మరణించిన పర్యాటకుల స్మారకార్థం నేడు ప్రత్యేక ప్రార్థనలు, నివాళుల కార్యక్రమాలు జరుగుతున్నాయి.: గతేడాది జరిగిన వైఫల్యాలను దృష్టిలో ఉంచుకుని, ఇప్పుడు ప్రతి పర్యాటక కేంద్రం వద్ద 'మల్టీ-లేయర్' సెక్యూరిటీని ఏర్పాటు చేశారు. ఆ చేదు జ్ఞాపకం వెంటాడుతున్నా, పర్యాటకుల సంఖ్య తగ్గకపోవడం విశేషం. ఉగ్రవాదం కంటే శాంతికే ప్రజలు మొగ్గు చూపుతారని ఇది నిరూపిస్తోంది.  గత ఏడాది కాలంలో సరిహద్దుల్లో చొరబాట్లు గణనీయంగా తగ్గాయి. ఉగ్రవాదుల ఏరివేత కోసం 'ఆపరేషన్ మహాదేవ్' వంటి అనుబంధ ఆపరేషన్లు నేటికీ కొనసాగుతూనే ఉన్నాయి.

పహల్గాం దాడి కేవలం పర్యాటకులపై జరిగిన దాడి కాదు, అది భారత ఆత్మగౌరవంపై జరిగిన దాడి. ఆ రోజు ప్రాణాలు కోల్పోయిన అమాయకులను స్మరించుకుంటూనే, భవిష్యత్తులో ఇలాంటివి పునరావృతం కాకుండా భారత్ తన రక్షణ కవచాన్ని మరింత పటిష్టం చేసుకుంది.

Advertisment
తాజా కథనాలు