‘థార్ ఎడారి’ ప్లాన్‌తో ఇంధన సంక్షోభానికి ఇండియా చెక్.. రికార్డు స్థాయి ఉత్పత్తి!

రాజస్థాన్‌లోని థార్ ఎడారి ప్రాంతంలో ఉన్న చమురు క్షేత్రాల నుంచి భారత్ ముడి చమురు ఉత్పత్తిని అసాధారణ రీతిలో పెంచింది. ముఖ్యంగా జోధ్‌పూర్ ఆయిల్ ఫీల్డ్స్ నుంచి రికార్డు స్థాయిలో రోజుకు 1202 బ్యారెళ్ల ముడి చమురును ఉత్పత్తి చేస్తోంది.

New Update
_thar desert oil operations

ప్రపంచం మరో భారీ ఇంధన సంక్షోభం అంచున నిలిచింది. అమెరికా-ఇరాన్ మధ్య యుద్ధం కారణంగా అంతర్జాతీయ చమురు రవాణాకు కీలకమైన హార్ముజ్ జలసంధిని ఇరాన్ మూసివేసింది. ఈ పరిణామం ప్రపంచవ్యాప్తంగా పెట్రోల్, డీజిల్ ధరలపై తీవ్ర ప్రభావం చూపుతోంది. ఇప్పటికే పాకిస్తాన్, బంగ్లాదేశ్ వంటి పొరుగు దేశాలు ఇంధనం కోసం అల్లాడుతుండగా, భారత్ మాత్రం ముందుచూపుతో తన సొంత వనరులపై దృష్టి సారించింది. ఈ సంక్షోభాన్ని ఎదుర్కోవడానికి కేంద్రం తన ప్రతిష్టాత్మక ‘థార్’ ప్రణాళికను వేగవంతం చేసింది.

రాజస్థాన్‌లోని థార్ ఎడారి ప్రాంతంలో ఉన్న చమురు క్షేత్రాల నుంచి భారత్ ముడి చమురు ఉత్పత్తిని అసాధారణ రీతిలో పెంచింది. ముఖ్యంగా జోధ్‌పూర్ ఆయిల్ ఫీల్డ్స్ నుంచి రికార్డు స్థాయిలో రోజుకు 1202 బ్యారెళ్ల ముడి చమురును ఉత్పత్తి చేస్తోంది. గతేడాది ఇక్కడ కేవలం 705 బ్యారెళ్ల ఉత్పత్తి మాత్రమే జరిగేది. అంటే, ప్రస్తుత సంక్షోభం దృష్ట్యా ఉత్పత్తిని ఏకంగా 70 శాతం పెంచడం గమనార్హం.

ఆయిల్ ఇండియా లిమిటెడ్ జైసల్మేర్‌లోని బఘేవాలా చమురు క్షేత్రం నుంచి ముడి చమురును సేకరించి, ట్యాంకర్ల ద్వారా గుజరాత్‌లోని మెహసానాలో ఉన్న ONGC ప్లాంట్లకు తరలిస్తోంది. అక్కడి నుండి పైప్‌లైన్ ద్వారా ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్‌కు చెందిన కోయాలి రిఫైనరీకి ఈ చమురు చేరుతోంది. 2025-26 ఆర్థిక సంవత్సరానికి గాను ఆయిల్ ఇండియా తన రాజస్థాన్ ఫీల్డ్స్ నుండి 43,773 మెట్రిక్ టన్నుల ముడి చమురును ఉత్పత్తి చేసి సరికొత్త మైలురాయిని అందుకుంది. గతేడాది ఉత్పత్తి అయిన 32,787 మెట్రిక్ టన్నులతో పోలిస్తే ఇది భారీ వృద్ధి.

ఆధునిక సాంకేతికతతో అద్భుతాలు
బికనేర్-నాగౌర్ బేసిన్‌లో ఉన్న బఘేవాలా క్షేత్రం 1991లోనే వెలుగులోకి వచ్చినప్పటికీ, ఇప్పుడు అది దేశానికి సంజీవనిలా మారింది. దాదాపు 200.26 చదరపు కిలోమీటర్ల మేర విస్తరించి ఉన్న ఈ క్షేత్రంలో మొత్తం 52 బావులు ఉండగా, ప్రస్తుతం 33 బావులు చురుగ్గా పనిచేస్తున్నాయి.

ముఖ్యంగా ఇక్కడి చమురును వెలికితీయడానికి ఆయిల్ ఇండియా CSS (సైక్లిక్ స్టీమ్ స్టిమ్యులేషన్) అనే అత్యాధునిక టెక్నాలజీని వాడుతోంది. 2018లో ప్రారంభమైన ఈ సాంకేతికత ద్వారా ప్రస్తుతం 19 బావులలో విజయవంతంగా కార్యకలాపాలు నిర్వహిస్తున్నారు. దీనివల్ల గతేడాదితో పోలిస్తే చమురు వెలికితీతలో 72 శాతం వృద్ధి నమోదైంది. యుద్ధం ఇలాగే నెలలు కొనసాగితే అంతర్జాతీయంగా ఇబ్బందులు తప్పవు. అయితే, భారత్ తన దేశీయ చమురు నిల్వలను, ముఖ్యంగా థార్ ఎడారిలోని వనరులను సమర్థవంతంగా వినియోగించుకోవడం ద్వారా ఇంధన భద్రతను కాపాడుకుంటోంది. విదేశీ దిగుమతులపై ఆధారపడటాన్ని తగ్గించుకుంటూ, స్వయం సమృద్ధి దిశగా అడుగులు వేస్తోంది.

Advertisment
తాజా కథనాలు