/rtv/media/media_files/2026/05/04/vijay-and-2026-05-04-11-08-33.jpg)
అప్పట్లో ఎన్టీఆర్.. ఇప్పుడు విజయ్. రెండు వేర్వేరు కాలాలు, రెండు వేర్వేరు రాష్ట్రాలు.. కానీ చరిత్ర మాత్రం ఒకేలా పునరావృతమవుతోంది. తెలుగునాట ఒకప్పుడు అన్నగారు సృష్టించిన ఆ ప్రభంజనాన్ని, ఇప్పుడు తమిళనాట దళపతి విజయ్ కళ్ళకు కడుతున్నారు. కేవలం నెలల వ్యవధిలోనే ఒక ప్రాంతీయ పార్టీ వ్యవస్థాపితమై, అధికార పీఠాన్ని కైవసం చేసుకోవడం లేదా అతిపెద్ద శక్తిగా ఎదగడం అనేది అరుదైన రాజకీయ అద్భుతం.
దశాబ్దాల రాజకీయ చరిత్రను తిరగరాయడం అందరికీ సాధ్యం కాదు. కానీ, సినిమా గ్లామర్‌ను ప్రజాబలంగా మార్చుకుని, అతి తక్కువ కాలంలోనే అధికారానికి చేరువైన ఇద్దరు సూపర్ స్టార్ల ప్రస్థానం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. ఒకరు తెలుగువారి ఆత్మగౌరవ నినాదంతో వచ్చిన నందమూరి తారక రామారావు (NTR) అయితే, మరొకరు తమిళుల సంక్షేమమే లక్ష్యంగా వచ్చిన దళపతి విజయ్.
ఎన్టీఆర్ (1982-83) : 1982 మార్చి 29న తెలుగుదేశం పార్టీని స్థాపించిన ఎన్టీఆర్, కేవలం 9 నెలల కాలంలోనే ఆంధ్రప్రదేశ్‌లో కాంగ్రెస్ కోటలను బద్ధలు కొట్టారు. 1983 జనవరిలో జరిగిన ఎన్నికల్లో క్లీన్ స్వీప్ చేసి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు.
విజయ్ (2024-26): 2024 ఫిబ్రవరిలో తమిళగ వెట్రి కజగం (TVK) పార్టీని ప్రకటించిన విజయ్, సుమారు రెండేళ్ల కాలంలోనే తమిళనాడు రాజకీయాల్లో పెను మార్పులు తెచ్చారు. ప్రస్తుత ట్రెండ్స్ ప్రకారం 100కు పైగా సీట్లు సాధించి దశాబ్దాల డీఎంకే-ఏఐఏడీఎంకే ద్వైపాక్షిక పోరుకు ముగింపు పలికారు.
చైతన్య రథంపై రాష్ట్రమంతా
అప్పట్లో ఎన్టీఆర్ ఏ పార్టీతో పొత్తు లేకుండా చైతన్య రథంపై రాష్ట్రమంతా తిరిగారు. ఇప్పుడు విజయ్ కూడా ఏ ప్రధాన కూటమితో కలవకుండా తన సొంత బలంపైనే ఎన్నికల బరిలోకి దిగి సత్తా చాటుతున్నారు. అన్నగారికి అప్పట్లో మహిళా ఓటర్లు ఎలాగైతే బ్రహ్మరథం పట్టారో, ఇప్పుడు విజయ్ వెనుక యువత,మహిళా శక్తి కొండంత అండగా నిలిచింది. కాంగ్రెస్ పాలనపై విసుగు చెందిన ప్రజలు అప్పుడు ఎన్టీఆర్‌ను ఎలా ఆదరించారో, ఇప్పుడు ద్రవిడ పార్టీల మార్పును ఆశిస్తున్న తమిళ ప్రజలు విజయ్‌ను అలా అక్కున చేర్చుకున్నారు.
ఎన్టీఆర్ అప్పట్లో తిరుపతి, గుడివాడల నుండి పోటీ చేసి గెలిస్తే.. ఇప్పుడు విజయ్ కూడా పెరంబూరు, తిరుచ్చి ఈస్ట్ నుండి పోటీ చేసి అదే మేజిక్ రిపీట్ చేస్తున్నారు. సినిమా వాళ్లకు రాజకీయాలు రావు అన్న విమర్శకుల నోళ్లు అప్పుడు ఎన్టీఆర్ మూయించారు.. ఇప్పుడు విజయ్ తన ఫలితాలతో నిరూపిస్తున్నారు. ఎన్టీఆర్ ప్రవేశపెట్టిన 2 రూపాయల కిలో బియ్యం వంటి పథకాలు ఎలాగైతే చరిత్ర సృష్టించాయో, విజయ్ తన మేనిఫెస్టోలో ప్రకటించిన వినూత్న హామీలు ప్రజల్లోకి బలంగా వెళ్లాయి.
Follow Us