Nitish Kumar Reddy : అమ్మ నుంచి ఫోన్ కాల్.. ప్రెస్‌ మీట్‌ను మధ్యలో ఆపేసిన  నితీశ్‌కుమార్ రెడ్డి!

ధర్మశాలలో తొలి వన్డే విజయం అనంతరం జరిగిన మీడియా సమావేశంలో ఆసక్తికర ఘటన చోటు చేసుకుంది. తెలుగు ప్లేయర్ నితీశ్ కుమార్ రెడ్డికి తల్లి నుంచి కాల్‌ రాగా స్వచ్ఛమైన తెలుగులో.."అమ్మా..నేను ఐదు నిమిషాలు ఆగి చేస్తా" అని ఎంతో వినయంగా సమాధానం ఇవ్వడం వైరల్ గా మారింది.

New Update
FotoJet - 2026-06-14T115931.571

nitish kumar reddy

Nitish Kumar Reddy : ధర్మశాల వేదికగా అఫ్గానిస్థాన్‌తో జరిగిన తొలి వన్డే మ్యాచ్‌లో భారత్ ఘన విజయం సాధించిన సంగతి తెలిసిందే. అయితే ఈ మ్యాచ్ విజయం ఎంతటి ఆనందాన్ని ఇచ్చిందో, మ్యాచ్ అనంతరం నిర్వహించిన ప్రెస్ కాన్ఫరెన్స్‌లో చోటు చేసుకున్న ఒక ఆసక్తికర ఘటన క్రికెట్ అభిమానుల మనసులను అంతగానూ దోచుకుంది. టీమిండియా యువ ఆల్‌రౌండర్, తెలుగు కుర్రాడు నితీశ్ కుమార్ రెడ్డికి సంబంధించిన ఒక  వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతోంది.

మ్యాచ్ ముగిసిన తర్వాత సాంప్రదాయబద్ధంగా జరిగే మీడియా సమావేశంలో నితీశ్ కుమార్ రెడ్డి పాల్గొన్నాడు. విలేకర్లు అడుగుతున్న ప్రశ్నలకు అతడు ఎంతో ఓపిగ్గా, హుందాగా సమాధానాలు ఇస్తున్న సమయంలో హఠాత్తుగా అతడి మొబైల్ ఫోన్ మోగింది. స్క్రీన్‌పై 'అమ్మ' అని చూసిన నితీశ్.. ఎంతటి పెద్ద ప్రెస్ మీట్ అయినప్పటికీ వెనకాడకుండా కాసేపు మాట్లాడటం ఆపేశాడు. అక్కడున్న విలేకర్లకు క్షమాపణలు (సారీ) చెప్పి, ఫోన్ లిఫ్ట్ చేశాడు.

ఆ ఫోన్ కాల్‌లో నితీశ్ కుమార్ రెడ్డి స్వచ్ఛమైన తెలుగులో.. "అమ్మా.. నేను ఐదు నిమిషాలు ఆగి చేస్తా" అని ఎంతో వినయంగా సమాధానం ఇచ్చి ఫోన్ కట్ చేశాడు. ఆ వెంటనే ముఖంపై చిరునవ్వుతో ప్రెస్ మీట్‌లో ఉన్న విలేకర్లకు మరోసారి సారీ చెప్పి, యధావిధిగా సమావేశాన్ని కొనసాగించాడు. గ్లోబల్ వేదికపై ప్రెస్ మీట్ జరుగుతున్నా, తన మాతృభాష అయిన తెలుగులో అమ్మతో మాట్లాడటం, అలాగే ఎంత బిజీగా ఉన్నా అమ్మ కాల్‌ను నిర్లక్ష్యం చేయకపోవడం నెటిజన్లను విపరీతంగా ఆకట్టుకుంది. ఈ అందమైన దృశ్యాన్ని రాజస్థాన్‌ రాయల్స్‌ ఫ్రాంచైజీ తన అధికారిక సోషల్ మీడియా ఖాతాలో పోస్టు చేయడంతో ఈ క్లిప్ నెట్టింట తెగ వైరల్‌గా మారింది.  బీసీసీఐ సైతం ఆ దృశ్యాన్ని సోషల్ మీడియాలో పోస్టు చేసింది.

ఈ వీడియో చూసిన నెటిజన్లు నితీశ్ ప్రవర్తనపై ప్రశంసల జల్లు కురిపిస్తున్నారు. "మన తెలుగును ప్రపంచ వేదికపై హైలైట్ చేస్తున్నాడు", "నితీశ్‌కు అమ్మ అంటే ఎంత ప్రేమో..", "అమ్మ నుంచి కాల్ వస్తే ఎవరైనా సరే ఎత్తక తప్పదు" అంటూ రకరకాలుగా కామెంట్లు పెడుతూ అభినందిస్తున్నారు. కేవలం ఆటలోనే కాదు, విలువల్లోనూ నితీశ్ సూపర్ అని కొనియాడుతున్నారు.

ఇక మ్యాచ్ విషయానికొస్తే.. వర్షం కారణంగా అఫ్గానిస్థాన్‌తో జరిగిన ఈ తొలి వన్డేను అంపైర్లు 25 ఓవర్లకు కుదించారు. టాస్ ఓడి తొలుత బ్యాటింగ్‌ చేసిన అఫ్గాన్ జట్టులో గుర్బాజ్ సెంచరీతో రాణించడంతో ఆ జట్టు 194 పరుగులకు ఆలౌటైంది. భారత బౌలర్లలో అరంగేట్ర ఆటగాళ్లు గుర్నూర్ బ్రార్, హర్ష్ దూబె తలో 3 వికెట్లతో చెలరేగగా, తెలుగు కుర్రాడు నితీశ్ కుమార్ రెడ్డి కీలకమైన 2 వికెట్లు పడగొట్టి అఫ్గాన్ పతనాన్ని శాసించాడు. అలాగే స్టార్ పేసర్ అర్ష్‌దీప్ సింగ్‌కు కూడా 2 వికెట్లు దక్కాయి.

అనంతరం 195 పరుగుల లక్ష్య ఛేదనతో బరిలోకి దిగిన టీమిండియా 22.5 ఓవర్లలోనే కేవలం 3 వికెట్లు కోల్పోయి ఘన విజయాన్ని అందుకుంది. భారత ఇన్నింగ్స్‌లో ఓపెనర్ శుభ్‌మన్ గిల్ (84*) అద్భుత ఇన్నింగ్స్ ఆడగా, కేఎల్ రాహుల్ (39*), ఇషాన్ కిషన్ (34) పరుగులతో రాణించారు. అద్భుత బ్యాటింగ్‌తో జట్టును గెలిపించిన శుభ్‌మన్ గిల్‌కు 'ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్' అవార్డు లభించింది. ఈ విజయంతో మూడు వన్డేల సిరీస్‌లో భారత్ 1-0 ఆధిక్యంలోకి దూసుకెళ్లింది. 

Advertisment
తాజా కథనాలు