Ansar Interim: ఢిల్లీ పేలుళ్ల కేసులో కొత్త కోణం‘అన్సార్‌ ఇంటీరియం’ పేరుతో టెర్రరిస్టు గ్రూపు

దేశంలో సంచలనం సృష్టించిన ఢిల్లీ ఉగ్ర పేలుడు కేసులో సంచలన విషయాలు వెలుగు చూస్తున్నాయి. పేలుళ్లు జరిపేందుకు నిర్ణయించుకున్న డాక్టర్ల బృందం అంతా కలసి ‘అన్సార్‌ ఇంటీరియం’ పేరుతో ఒక టెర్రరిస్టు గ్రూపును  ఏర్పాటు చేసినట్లు దర్యాప్తు సంస్థలు గుర్తించాయి.

New Update
FotoJet (16)

Ansar Interim: దేశంలో సంచలనం సృష్టించిన ఢిల్లీ ఉగ్ర పేలుడు కేసులో సంచలన విషయాలు వెలుగు చూస్తున్నాయి. పేలుళ్లు జరిపేందుకు నిర్ణయించుకున్న డాక్టర్ల బృందం అంతా కలసి ‘అన్సార్‌ ఇంటీరియం’ పేరుతో ఒక టెర్రరిస్టు గ్రూపును  ఏర్పాటు చేసినట్లు దర్యాప్తు సంస్థలు గుర్తించాయి. నిజానికి డాక్టర్ల బృందం చాలాకాలం కిందటే ర్యాడికలైజ్‌ అయ్యారని, ఆ సమయంలోనే ఈ ఉగ్రసంస్థను ఏర్పాటు చేసినట్లు ఈ కేసును దర్యాప్తు చేస్తున్న అధికారులు వెల్లడించారు. ప్రస్తుతం ఈ కేసును జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్‌ఐఏ) దర్యాప్తు చేస్తున్న విషయం తెలిసిందే.

కాగా ఈ పేలుళ్లలో ప్రధాన నిందితులుగా ఉన్న డాక్టర్లు ముజమ్మిల్‌ గన్నీ, ఉమర్‌ నబీ, ఆదిల్‌, ముజఫర్‌ మౌల్వీ ఇర్ఫాన్‌, కారీ ఆమిర్‌ , తౌఫిల్‌ గాజి తదితరులు ఏప్రిల్‌ 2022లో శ్రీనగర్‌లో ఒక సమావేశం ఏర్పాటు చేసుకున్నారు. అదే సమయంలో వారు అన్సార్‌ ఇంటీరియం అనే సంస్థను ఏర్పాటు చేశారు. దీనికి ఆదిల్‌ను చీఫ్‌గా నియమించుకున్నా రు. మౌల్వీ ఇర్ఫాన్‌కు డిప్యూటీగా బాధ్యతలు అప్పగించారు. 

అదే సమయంలో మిగిలిన వారు ఎవరెవరు ఏమి చేయాలనేది కూడా ముందే నిర్ణయించుకొని..ఆయా బాధ్యతలను పంచుకొన్నట్లు అరెస్టైన ఉగ్ర డాక్టర్లు దర్యాప్తులో వెల్లడించారు. దీనికోసం వీరు ఆపరేషనల్‌ కోడ్స్‌ కూడా సిద్ధం చేసుకొన్నారు. వీరిలో ఉమర్‌ సమన్వయకర్త బాధ్యతలు తీసుకోగా.. గన్నీ ఫైనాన్స్‌, కొనుగోళ్లు విభాగాలను చూసేవాడని తేలింది.కాగా అప్పటి నుంచి పేలుళ్లకు అవసరమైన మెటీరియల్‌ను సమకూర్చుకుంటూ వచ్చారు. 2023లో పేలుళ్లకు అవసరమైన మెటీరియల్‌, ఎరువులను సోహ్న నుంచి కొనుగోలు చేశారు. ఇక ఉమర్‌ సూచనల మేరకు ఫరీదాబాద్‌లోని ఓ కెమికల్‌ షాప్‌ నుంచి పొటాషియం నైట్రేట్‌ను తెప్పించుకున్నారు.

అయితే వారికి అంతుకు ముందు అనుభవం లేకపోయిన ఉమర్‌ ఆన్‌లైన్‌ వీడియోలు చూసి ఐఈడీలను ఎలా తయారు చేయాలో నేర్చుకొన్నట్లు ఇంటరాగేషన్‌లో వివరించారు. ఆదిల్‌ దక్షిణ కశ్మీర్‌కు చెందిన డానిష్‌ను అల్‌ఫలా విశ్వవిద్యాలయానికి తీసుకొచ్చి అక్కడ ఉంచాడు. అతనితో ఫిదాయిన్‌ దాడి చేయించాలని ఉమర్‌ ప్రయత్నించాడు. కానీ, చివరి నిమిషంలో వెనక్కి తగ్గినట్లు తెలుస్తోంది.

ఇక ఉగ్ర డాక్టర్లందరిలో అత్యధికంగా ర్యాడికలైజ్డ్‌ అయిన వ్యక్తి ఉమర్‌ అని తేలింది. అతను ఢిల్లీలోని రద్దీ ప్రదేశాల్లో లేదా.. ఏదైన కీలక ప్రార్థనా మందిరం వద్దగానీ అత్యంత శక్తిమంతమైన కారుబాంబును పేల్చాలని కుట్రపన్నినట్టు దర్యాప్తు బృందాలు వెల్లడించాయి.  శ్రీనగర్‌ పోలీసులు ఈ సంస్థ గుట్టును రట్టు చేయడంతో.. ఉమర్‌ తీవ్ర ఆందోళనకు గురయ్యాడు. ఆ సమయంలో ఏం చేయాలో అర్థంకాక ఢిల్లీలో పేలుడుకు పాల్పడి ఆత్మహత్య చేసుకొన్నాడు. ఇతడు  అంతకు ముందే రెండుసార్లు 2016, 2018లో ఉగ్ర సంస్థల్లో చేరేందుకు విఫల యత్నం చేసినట్టు దర్యాప్తు సంస్థలు గుర్తించాయి.

Advertisment
తాజా కథనాలు