NASA : అంతరిక్షంలోనూ అవుట్‌లుక్ తిప్పలు.. చంద్రుడి వైపు వెళ్తూ సాఫ్ట్‌వేర్ కష్టాలు!

అంతరిక్షంలోనూ టెక్నికల్ తిప్పలు తప్పవని నాసా శాస్త్రవేత్తలకు అర్థమైంది. 50 ఏళ్ల తర్వాత చంద్రుడిపైకి మనుషులను పంపే లక్ష్యంతో చేపట్టిన ఆర్టెమిస్-2 మిషన్ ప్రస్తుతం కొనసాగుతోంది.

New Update
nasa

అంతరిక్షంలోనూ టెక్నికల్ తిప్పలు తప్పవని నాసా శాస్త్రవేత్తలకు అర్థమైంది. 50 ఏళ్ల తర్వాత చంద్రుడిపైకి మనుషులను పంపే లక్ష్యంతో చేపట్టిన ఆర్టెమిస్-2 మిషన్ ప్రస్తుతం కొనసాగుతోంది. ఏప్రిల్ 1వ తేదీన నలుగురు వ్యోమగాములతో ఈ నౌక నింగిలోకి విజయవంతంగా దూసుకెళ్లింది. అయితే, ప్రయాణం మొదలైన కొద్దిసేపటికే అంతరిక్ష నౌకలో ఊహించని సమస్య ఎదురైంది. అది రాకెట్ ఇంజిన్ కో, షటిల్ కో సంబంధించింది కాదు.. వినడానికి వింతగా ఉన్నా అది మైక్రోసాఫ్ట్ అవుట్‌లుక్ సమస్య. 

ఆర్టెమిస్-2 కమాండర్ రీడ్ వైస్‌మన్ తన వద్ద ఉన్న మైక్రోసాఫ్ట్ సర్ఫేస్ ప్రో ట్యాబ్లెట్‌లో ఈమెయిల్స్ చెక్ చేద్దామని అవుట్‌లుక్ ఓపెన్ చేశారు. కానీ అది పని చేయలేదు. దీంతో ఆయన భూమిపై ఉన్న హ్యూస్టన్ మిషన్ కంట్రోల్‌కు సమాచారం అందించారు. నా ట్యాబ్లెట్‌లో రెండు అవుట్‌లుక్ యాప్స్ కనిపిస్తున్నాయి, కానీ రెండూ ఓపెన్ కావడం లేదు. మీరు రిమోట్ యాక్సెస్ ద్వారా వీటిని ఒకసారి చెక్ చేస్తే బాగుంటుందని ఆయన కోరారు. చివరకు భూమి మీద ఉన్న టెక్ సపోర్ట్ టీమ్ అంతరిక్షంలో ఉన్న ఆ డివైజ్‌ను రిమోట్‌గా యాక్సెస్ చేసి, ఆ సాఫ్ట్‌వేర్ సమస్యను పరిష్కరించింది.

అంతరిక్షంలోకి వెళ్లినా ఈ మైక్రోసాఫ్ట్ గోల తప్పదా అంటూ నెటిజన్లు సోషల్ మీడియాలో మీమ్స్‌తో రెచ్చిపోతున్నారు. స్పేస్‌లో అవుట్‌లుక్ వాడటం కంటే.. పావురాలకు స్పేస్ సూట్లు వేసి ఉత్తరాలు పంపడం నయమంటూ ఒకరు ఎద్దేవా చేయగా.. స్పేస్ ఫోర్స్ సిరీస్‌లో కంప్యూటర్ అప్‌డేట్ వల్ల మిషన్ ఆగిపోయే సీన్‌ను మరొకరు గుర్తు చేశారు. అసలు అంతరిక్షంలో ఈమెయిల్స్ పంపాల్సిన అవసరం ఏమొచ్చిందని మరికొందరు ప్రశ్నిస్తున్నారు.

టాయిలెట్ ఫ్యాన్ కూడా

కేవలం సాఫ్ట్‌వేర్ మాత్రమే కాదు, అంతరిక్ష నౌకలోని టాయిలెట్ ఫ్యాన్ కూడా జామ్ అవ్వడంతో వ్యోమగాములు కాసేపు ఇబ్బంది పడ్డారు. గ్రౌండ్ టీమ్ ఇచ్చిన సూచనలతో దాన్ని కూడా బాగు చేసుకున్నారు. ఇప్పటికే ఏప్రిల్ 3న ఓరియన్ నౌక భూమి గురుత్వాకర్షణ శక్తిని దాటుకుని చంద్రుడి వైపు నేరుగా ప్రయాణాన్ని మొదలుపెట్టింది. ఈ 10 రోజుల ప్రయాణంలో కమాండర్ రీడ్ వైస్‌మన్, విక్టర్ గ్లోవర్, క్రిస్టినా కోచ్, జెరెమీ హాన్సెన్ చంద్రుడి చుట్టూ తిరుగుతూ కీలక ప్రయోగాలు చేయనున్నారు. 

Advertisment
తాజా కథనాలు