/rtv/media/media_files/2025/12/26/cp-sajjanar-2025-12-26-21-18-22.jpg)
CP Sajjanar
'Ignite' scam : మల్టీ లెవెల్ మార్కెటింగ్ (MLM) పేరుతో అమాయక ప్రజలను నిలువునా ముంచేందుకు సిద్ధమైన ఒక భారీ అంతర్జాతీయ నెట్‌వర్క్‌ను హైదరాబాద్ సిటీ పోలీసులు గుట్టు రట్టు చేశారు. కేవలం 18 రోజుల క్రితమే ఏర్పాటైన ‘ఇగ్నైట్’ (IGNITE) అనే సంస్థపై ఉక్కుపాదం మోపడం ద్వారా సుమారు రూ. 5,000 కోట్ల మేర జరగబోయే భారీ మోసాన్ని ప్రాథమిక దశలోనే అడ్డుకున్నట్లు నగర పోలీస్ కమిషనర్ వీసీ సజ్జనార్ వెల్లడించారు. సెంట్రల్ క్రైమ్ స్టేషన్ (CCS) పోలీసులు అత్యంత ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన ‘ఆపరేషన్ ఇగ్నైట్ క్రాక్‌డౌన్’ ద్వారా ఈ మెగా స్కామ్ వెలుగులోకి వచ్చింది.
ఈ కేసుకు సంబంధించి సిసిఎస్ పోలీసులు దేశవ్యాప్తంగా మెరుపు దాడులు నిర్వహించారు. కేరళ, పశ్చిమ బెంగాల్, ఢిల్లీ, ఉత్తరప్రదేశ్ వంటి వివిధ రాష్ట్రాల్లో గాలించి ఈ మోసపూరిత ముఠాలోని ఆరుగురు కీలక నిందితులను అదుపులోకి తీసుకున్నారు. అరెస్ట్ చేసిన నిందితుల వద్ద నుంచి ల్యాప్‌టాప్‌లు, కీలక పత్రాలు, డిజిటల్ సాక్ష్యాలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. పట్టుబడిన నిందితులను బంజారాహిల్స్‌లోని కమాండ్ కంట్రోల్ సెంటర్ (ICCC) కార్యాలయంలో గురువారం మధ్యాహ్నం మీడియా ముందు ప్రవేశపెట్టి, కేసు తాలూకు పూర్తి వివరాలను వెల్లడించారు.
పోలీసుల దర్యాప్తులో ఈ ముఠాకు సంబంధించిన సంచలన నిజాలు బయటపడ్డాయి. గతంలో దేశవ్యాప్తంగా వేల కోట్ల రూపాయల మోసాలకు పాల్పడి, నిషేధానికి గురైన ‘క్లిక్ గ్లోబల్’, ‘క్యూనెట్’ (QNET), ‘విహాన్ డైరెక్ట్ సెల్లింగ్’ నెట్‌వర్క్ నిర్వాహకులే ఈ ‘ఇగ్నైట్’ వెనుక ఉన్నట్లు సిపి సజ్జనార్ స్పష్టం చేశారు. "పాత సీసాలో కొత్త మద్యం" చందంగా.. గత మూడు దశాబ్దాలుగా ఒకే తరహా మోసపూరిత విధానాన్ని అమలు చేస్తున్న ఈ ముఠా, మొదట 'గోల్డ్ క్వెస్ట్', ఆ తర్వాత 'క్వెస్ట్ నెట్', ఆపై 'క్యూనెట్'గా.. ఇప్పుడు సరికొత్తగా 'ఇగ్నైట్' పేరుతో అవతారమెత్తిందని సీపీ వివరించారు.
ఈ ముఠా ప్రధానంగా నిరుద్యోగ యువతను, సాఫ్ట్‌వేర్ ఉద్యోగులను లక్ష్యంగా చేసుకుని వల విసిరినట్లు తేలింది. "లక్షల్లో పెట్టుబడి పెడితే.. తక్కువ కాలంలోనే కోట్లు సంపాదించవచ్చు" అంటూ మాయమాటలతో నమ్మించి ఒక్కొక్కరి నుంచి రూ. 5 లక్షల నుండి రూ. 10 లక్షల వరకు వసూలు చేశారు. అధిక లాభాలు వస్తాయని ఆశ చూపి బలవంతంగా కొన్ని ఉత్పత్తులను కొనుగోలు చేయించడం, ఆ తర్వాత చేరిన సభ్యుల చేత మరికొంతమంది కొత్త సభ్యులను చేర్పించే గొలుసుకట్టు (Chain System) విధానాన్ని అమలు చేస్తూ లక్షలాది మందిని ఈ వలలోకి లాగడానికి స్కెచ్ వేశారు.
ఈ భారీ స్కామ్‌కు సంబంధించిన మూలాలు అంతర్జాతీయంగా విస్తరించి ఉన్నాయని పోలీసులు గుర్తించారు. ఈ ముఠా యొక్క ప్రధాన సూత్రధారులు హాంకాంగ్, దుబాయ్, మలేషియా వంటి విదేశాల్లో ఉండి నెట్‌వర్క్‌ను నడిపిస్తున్నట్లు దర్యాప్తులో తేలింది. ప్రస్తుతం బాధితుల నుంచి అందిన మూడు కీలక ఫిర్యాదుల ఆధారంగా హైదరాబాద్ పోలీసులు ఎఫ్‌ఐఆర్‌లు (FIRs) నమోదు చేశారు. ఈ మోసంలో పెద్ద ఎత్తున హవాలా, మనీ లాండరింగ్ కోణాలు కూడా ఉండే అవకాశం ఉన్నందున, తదుపరి సమగ్ర విచారణ నిమిత్తం ఈ వ్యవహారాన్ని ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ED) దృష్టికి తీసుకెళ్తున్నట్లు సీపీ ప్రకటించారు.
గత 25 ఏళ్లుగా పేర్లు మార్చుకుంటూ దేశవ్యాప్తంగా లక్షలాది మందిని దోచుకున్న ఈ అంతర్జాతీయ నెట్‌వర్క్ పట్ల ప్రజలు అత్యంత అప్రమత్తంగా ఉండాలని ఈ సందర్భంగా పోలీసులు హెచ్చరించారు. అతి తక్కువ కాలంలోనే ఎక్కువ లాభాలు వస్తాయంటూ ఆశ చూపే ఇలాంటి గొలుసుకట్టు, మోసపూరిత మల్టీ లెవెల్ మార్కెటింగ్ స్కీమ్‌లను నమ్మి డబ్బులు పోగొట్టుకోవద్దని సూచించారు. ఏదైనా సంస్థపై అనుమానం వస్తే వెంటనే పోలీసులను ఆశ్రయించాలని స్పష్టం చేశారు.
Follow Us